ఏపీ సర్కార్ పనితీరుపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసలు..!
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక, హరిత ఇంధన (Green Energy) రంగానికి భారీ ఊతం లభించింది. సదస్సులో భాగంగా ఒకే వేదికపై ఏకంగా రూ. 43,871 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 17 కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి. సౌర విద్యుత్, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ మరియు పంప్డ్ స్టోరేజ్ వంటి భవిష్యత్తు ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ముందుకు రావడంతో, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రధాన హరిత ఇంధన హబ్‌గా అవతరిస్తోంది.
ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన కొనియాడారు. అత్యంత తక్కువ కాలంలోనే రాష్ట్రంలో ఏకంగా 7.86 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఒక అద్భుతమైన రికార్డని కేంద్రమంత్రి అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని..
ఇవి కూడా చదవండి
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సాధిస్తున్న వేగం దేశ ఇంధన భద్రతకు ఎంతో దోహదపడుతుందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. తాజా ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో భారీ ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణ వల్ల సామాన్య కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.







