కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై వివాదం!
హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న వేళ, ప్రజల ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల పరిరక్షణ ఇప్పుడు కీలక రాజకీయ, సామాజిక అంశంగా మారింది. కూకట్పల్లిలోని 3.15 ఎకరాల ట్రక్ పార్క్ స్థలాన్ని ఈ నెల 27న వేలం వేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద తదితరులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆందోళనకు దిగడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. సీపీఐ, సీపీఎం వంటి వామపక్షాలు సైతం ఈ పోరాటానికి సంఘీభావం తెలపడం విశేషం.
కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి మూడు ప్రధాన నియోజకవర్గాల కూడలిలో లక్షలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇంతటి జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ప్రజావసరాల కోసం మిగిలి ఉన్న ఏకైక ప్రభుత్వ స్థలం ఇదేనని స్థానికులు, నేతలు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో పార్కులు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు లేదా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఇలాంటి స్థలాలు ఎంతో కీలకం. వీటిని వాణిజ్య అవసరాలకు విక్రయిస్తే, భవిష్యత్ తరాలకు కనీస సామాజిక మౌలిక వసతులు కరువయ్యే ప్రమాదం ఉందని పట్టణ ప్రణాళికా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ భూమి చుట్టూ వివాదం నెలకొనడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా పదమూడేళ్ల క్రితం, అంటే 2013లోనూ నాటి ప్రభుత్వం ఈ స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పట్లో అన్ని రాజకీయ పక్షాలు, స్థానిక ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి అడ్డుకోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే స్థలాన్ని వేలానికి పెట్టడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కంటే ఆదాయ సమీకరణకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ధర్నా సందర్భంగా హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “ఇంచు భూమి కూడా అమ్మబోం” అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు, అధికారంలోకి వచ్చాక కాప్రా, అమీన్పూర్, ఇప్పుడు కూకట్పల్లి అంటూ ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వేలం వేస్తున్నారని ఆయన విమర్శించారు. పాలనను పక్కనపెట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, ప్రజా ఆస్తులను తెగనమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరి ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రజల పక్షాన నిలబడి ఈ నెల 27న జరగబోయే వేలాన్ని అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
ఏ ప్రభుత్వానికైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు నిధుల సమీకరణ అనేది ఒక పెద్ద సవాలు. అందులో భాగంగానే హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా విలువైన భూముల వేలానికి ప్రభుత్వాలు మొగ్గు చూపుతుంటాయి. అయితే, శివారు ప్రాంతాల్లోని విశాలమైన భూములకు, జనవాసాల మధ్య ఉన్న ప్రజావసరాల స్థలాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాలి. ఆదాయం కోసం నివాస ప్రాంతాల్లోని ‘లంగ్ స్పేస్’ లేదా ప్రజా అవసరాల భూములను విక్రయించడం దీర్ఘకాలంలో నగర జీవన ప్రమాణాలను దెబ్బతీస్తుంది.
కూకట్పల్లి ట్రక్ పార్క్ భూమి వివాదం కేవలం ఒక 3.15 ఎకరాల స్థలానికి సంబంధించినది మాత్రమే కాదు.. నగర అభివృద్ధిలో వాణిజ్య ఆదాయం ముఖ్యమా? లేక ప్రజా శ్రేయస్సు ముఖ్యమా? అన్న మౌలిక ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రతిపక్షాలు, వామపక్షాలు, స్థానిక ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటుందా, లేక వేలం ప్రక్రియతో ముందుకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి.







