హరీశ్ రావు కంచుకోటపై ముప్పేట దాడి!
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి సిద్ధిపేటపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలుగా మాజీ మంత్రి హరీశ్ రావుకు తిరుగులేని కంచుకోటగా, బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయలా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలు ఒకేసారి సిద్ధిపేటను తమ రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా ఎంచుకున్నాయి. దీంతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇటీవలే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి వరాలు కురిపిస్తూనే రాజకీయంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా సిద్ధిపేటను ఎంచుకున్నారు. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే వేదికపై నుంచి ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు.
గతంలో సిరిసిల్లలో అనుసరించిన అభివృద్ధి, రాజకీయ దాడి ఫార్ములానే సిద్ధిపేటలోనూ అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. స్థానికంగా హరీశ్ రావు పట్టును సడలించడంతో పాటు, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగడుతూ హరీశ్ రావు, కేటీఆర్, కేసీఆర్‌లపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. అధికార యంత్రాంగాన్ని, సంక్షేమ పథకాలను అస్త్రాలుగా మలచుకుని బీఆర్ఎస్ కోటలో పాగా వేయాలన్నది కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
అయితే కాంగ్రెస్ సభకు ముందే సిద్ధిపేట రాజకీయాల్లోకి కవిత ఎంట్రీ ఇవ్వడం అనూహ్య పరిణామం. తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్ధిపేటలో శాశ్వత పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు. శుక్రవారం సర్వమత ప్రార్థనల అనంతరం భూమిపూజ నిర్వహించి, అక్కడి నుంచే తన రాజకీయ గళాన్ని వినిపించనున్నారు.
ఇవి కూడా చదవండి
కవిత వ్యూహం అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూనే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను, ముఖ్యంగా హరీశ్ రావు, కేటీఆర్‌లను ఆమె లక్ష్యంగా చేసుకుంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆమె చేస్తున్న విమర్శలు పరోక్షంగా కేసీఆర్ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించేలా ఉంటున్నాయి. ప్రధాన పార్టీలకు ఏమాత్రం తీసిపోని విధంగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే సంకేతాన్ని కవిత బలంగా పంపిస్తున్నారు.
ఒకవైపు అధికార పక్షం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు సొంత కుటుంబం నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టిన కవిత.. ఇలా ఇరువైపుల నుంచి వస్తున్న విమర్శల దాడులను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు పెద్ద సవాలుగా మారింది. మరో ఏడాదిలో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల వ్యూహాలకు దీటుగా సమాధానం చెప్పడంలో పార్టీ కొంత తడబడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా హరీశ్ రావుకు అత్యంత బలమైన నియోజకవర్గంలోనే ప్రత్యర్థులు పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండటం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
మొత్తానికి, అటు సంక్షేమ పథకాలతో కాంగ్రెస్, ఇటు శాశ్వత కార్యాలయంతో కవిత పార్టీ సిద్ధిపేట గడ్డపై తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ ముక్కోణపు రాజకీయ పోరులో హరీశ్ రావు తన కంచుకోటను ఎలా కాపాడుకుంటారు? రేవంత్, కవితల పర్యటనలు స్థానిక రాజకీయ సమీకరణాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి? అనేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.







