ట్రంప్‌ను చుట్టుముట్టిన ‘క్విడ్ ప్రో కో’ వివాదం! రుజువైతే ఏమవుతుంది?
రాజకీయాల్లో ఉచితంగా ఏదీ జరగదు అంటుంటారు. ఎవరో ఒకరు ఎవరికో ఒకటి ఇస్తున్నారంటే.. దాని వెనుక ఏదో లెక్క ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇచ్చే విరాళాలు, తీసుకునే ప్రయోజనాల మధ్య గీత చాలా సన్నగా ఉంటుంది. ఆ గీత దాటితే అది రాజకీయ స్నేహం కాదు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జరిగే బేరసారంగా మారుతుంది. అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మొదలైన వివాదం కూడా ఇలాంటి అనుమానాల చుట్టూ తిరుగుతోంది.
అధ్యక్షుడి ప్రాజెక్టులకు కోట్లు కుమ్మరించిన బడా కంపెనీలు, బిలియనీర్లు ఏదో మంచి పని చేయాలనే ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చారా? లేక వైట్‌హౌస్‌లో తమకంటూ ఒక ప్రత్యేక రూట్ ఏర్పాటు చేసుకున్నారా? అసలు డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్లకు ఏం దక్కింది?
డబ్బులు ఇచ్చారు సరే.. రిటర్న్ గిఫ్ట్ ఏంటి?
ట్రంప్ వైట్‌హౌస్‌లో భారీ బాల్రూమ్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై భారం వేయకుండా ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరించారు. వినడానికి మంచి ఆలోచనగానే కనిపిస్తుంది. కానీ ఆ డబ్బులు ఇచ్చినవారి లిస్ట్ బయటకు వచ్చాకే..దీని వెనక ఏదో ఉందనే ఆలోచనలు మొదలయ్యాయి.
వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన అంతర్గత పత్రాల ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు 333 మిలియన్ డాలర్ల విరాళాలు నమోదయ్యాయి. 67 విరాళాలు ఒక్కొక్కటి 10 వేల డాలర్లకు పైగా ఉన్నాయి. కనీసం 77 మిలియన్ డాలర్లు తమ పేర్లు బయటకు రాకూడదని కోరుకున్న దాతల నుంచి వచ్చినట్లు పత్రాలు వెల్లడించాయి.
Nvidia, Apple వంటి టెక్ దిగ్గజాలు ఒక్కొక్కటి 25 మిలియన్ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించాయి. Amazon, Microsoft, Caterpillar, Comcast వంటి సంస్థల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. వీళ్లంతా ఒక్కసారిగా వైట్‌హౌస్ నిర్మాణంపై ఇంత ప్రేమ ఎందుకు చూపించారు? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ట్రంప్‌కు దగ్గరగా ఉంటే చాలు.. డీల్స్ కూడా దగ్గరవుతాయా?
ఈ వ్యవహారంలో మెరెడిత్ ఓరూర్క్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ట్రంప్‌కు సన్నిహితురాలైన ఆమె, ఆయన 2024 ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. ఇప్పుడు ట్రంప్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు భారీ విరాళాలు సమీకరించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ట్రంప్ పేరుతో ఎవరెవరిని సంప్రదించారు? ఎంత డబ్బు అడిగారు? విరాళాలు ఇవ్వడానికి ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు? దాతలకు ట్రంప్‌తో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారా? అనే వివరాలు కావాలని డెమొక్రాట్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
సెనేటర్లు ఎలిజబెత్ వారెన్, రిచర్డ్ బ్లూమెంటాల్, ప్రతినిధుల సభ సభ్యుడు రాబర్ట్ గార్సియా కలిసి ఆమెకు లేఖ రాశారు. ఈ నిధుల సేకరణ వ్యవస్థలో అవినీతికి ఆస్కారం ఉందని, క్విడ్ ప్రో కో రాజకీయాలు జరిగాయా అనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అంటే ఇప్పుడు వాళ్లు అడుగుతున్నది చాలా సింపుల్. డబ్బులు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఇచ్చిన తర్వాత వాళ్లకు ఏం లభించింది? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే అసలు వ్యవహారం ఏంటో అర్థమవుతుంది.
విరాళాల తర్వాత మారిన ప్రభుత్వ నిర్ణయాలు?
ఈ క్రమంలో కొంతమంది దాతలకు ట్రంప్ ప్రభుత్వంలో ప్రయోజనాలు లభించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన పరిశోధనాత్మక కథనాల్లో వివరించింది. ప్రభుత్వ కాంట్రాక్టులు, నియంత్రణ సంస్థల నిర్ణయాలు, వ్యాపార అనుమతులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఒక దాత కుటుంబ సభ్యుడికి ట్రంప్ క్షమాభిక్ష కూడా ఇచ్చారు.
ఉదాహరణకు, టెలికాం వ్యాపారవేత్త చార్లెస్ ఎర్గెన్కు చెందిన EchoStar కంపెనీపై FCC విచారణ ప్రారంభించింది. తర్వాత ట్రంప్‌తో సమావేశం జరిగింది. ఆ తర్వాత విచారణ ముగిసింది. అదే వ్యాపారవేత్త ట్రంప్ బాల్‌రూమ్‌కు భారీ విరాళం ఇవ్వడానికి అంగీకరించారు. మరోవైపు Rocket అనుబంధ సంస్థ ఒక వ్యాపార కొనుగోలుకు ప్రభుత్వ అనుమతి పొందిన కొన్ని వారాల తర్వాత బాల్‌రూమ్‌కు 10 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది.
ఇవన్నీ చూస్తే అనుమానాలు రావడం సహజం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరిగాయని చెప్పడం వేరు.. వాటి మధ్య ఒప్పందం ఉందని నిరూపించడం వేరు. విరాళం ఇచ్చినందుకే ప్రభుత్వ నిర్ణయం అనుకూలంగా వచ్చిందని ఇప్పటివరకు నిరూపితం కాలేదు.
అయితే ప్రశ్నలు అడగడానికి మాత్రం ఈ పరిణామాలు సరిపోతాయి. అసలు ఈ విరాళాలు పూర్తిగా స్వచ్ఛందమైనవేనా? లేక ప్రభుత్వంతో వ్యాపార సంబంధాలు ఉన్నవారు వైట్‌హౌస్‌కు దగ్గరయ్యేందుకు ఉపయోగించిన మార్గమా? డెమొక్రాట్లు ఇప్పుడు ఈ లింకులన్నీ పరిశీలించాలని చూస్తున్నారు.
జనవరి నుంచి ట్రంప్‌కు అసలైన టెన్షన్ మొదలవుతుందా?
ఇప్పటివరకు డెమొక్రాట్లు ప్రశ్నలు అడిగారు. కానీ జనవరిలో కాంగ్రెస్‌లో కీలక కమిటీలపై నియంత్రణ చేపట్టిన తర్వాత పరిస్థితి మారవచ్చు. వారికి సబ్పోనా అధికారం లభిస్తుంది. అంటే అవసరమైన పత్రాలు ఇవ్వాలని, విచారణకు హాజరుకావాలని సంబంధిత వ్యక్తులను అధికారికంగా ఆదేశించగలరు.
అప్పుడు కేవలం విరాళాలు ఇచ్చినవారి పేర్లు అడగడం దగ్గర వ్యవహారం ఆగిపోకపోవచ్చు. ఇమెయిల్స్, ఫోన్ సంభాషణలు, సమావేశాల వివరాలు, విరాళాల ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు.. ఇలా తెర వెనుక జరిగిన వ్యవహారాలన్నీ పరిశీలనలోకి రావచ్చు.
మెరెడిత్ ఓరూర్క్ను గతంలో కూడా డెమొక్రాట్లు ప్రశ్నించారు. కానీ తమకు సమాధానాలు రాలేదని చెబుతున్నారు. ఈసారి మాత్రం ఆమె నుంచి పూర్తి వివరాలు రాబట్టాలని పట్టుదలగా ఉన్నారు.
అంటే ఇప్పటివరకు రాజకీయ విమర్శలుగా కనిపించిన వ్యవహారం, త్వరలో అధికారిక విచారణగా మారే అవకాశం ఉంది. ట్రంప్ వర్గం కూడా ఈ విచారణను ఎదుర్కోవాల్సి రావచ్చు.
క్విడ్ ప్రో కో రుజువైతే.. ట్రంప్‌కు ఎంత పెద్ద దెబ్బ?
ఇక్కడే అసలు సస్పెన్స్ ఉంది. ఎందుకంటే క్విడ్ ప్రో కో ఆరోపణలు రావడం ఒకటి.. వాటిని కోర్టులో నిరూపించడం మరోటి. డబ్బులు ఇచ్చిన కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు వచ్చింది కాబట్టి అవినీతి జరిగిందని వెంటనే చెప్పలేం. ఆ డబ్బుకు ప్రతిఫలంగా నిర్దిష్ట ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటానని ఒప్పందం జరిగిందని నిరూపించాల్సి ఉంటుంది.
అమెరికా ఫెడరల్ చట్టంలోని 18 U.S.C. Section 201 ప్రకారం ప్రభుత్వ అధికారిని ప్రభావితం చేయడానికి లంచం ఇవ్వడం, అధికారిక చర్యకు ప్రతిఫలంగా విలువైన ప్రయోజనం స్వీకరించడం నేరం. సంబంధిత లంచం నిబంధన కింద నేరం రుజువైతే గరిష్ఠంగా 15 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా వంటి పరిణామాలు ఎదురవుతాయి. అయితే ఈ శిక్ష నేరం నిరూపితమైన వ్యక్తికి, వర్తించే చట్టపరమైన నిబంధనల ఆధారంగా మాత్రమే ఉంటుంది.
ఇక్కడ ట్రంప్‌కు ఎదురయ్యే అసలు ప్రమాదం జైలు శిక్ష మాత్రమే కాదు. అధ్యక్ష పదవికి ఉండే నైతిక విశ్వసనీయత దెబ్బతినడం, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల్లో అనుమానాలు పెరగడం, ఆయన పార్టీపై రాజకీయ ఒత్తిడి పెరగడం కూడా పెద్ద పరిణామాలే.
ట్రంప్ వర్గం వెర్షన్ ఏంటి?
ఈ ఆరోపణలపై ఓరూర్క్ ప్రతినిధి స్పందిస్తూ.. ట్రంప్‌ను డబ్బుతో కొనలేరని స్పష్టం చేశారు. ఆయన రాజకీయ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన నిధుల సేకరణకర్త అని, దాతలకు కృతజ్ఞతతో ఉంటారని చెప్పారు. డెమొక్రాట్ల ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు.
చివరికి చెప్పాలంటే..
ట్రంప్ బాల్రూమ్ ఎంత భారీగా నిర్మించారన్నది ఇప్పుడు ప్రధాన విషయం కాదు. దాని కోసం డబ్బులు ఇచ్చినవారికి అమెరికా అధికార వ్యవస్థలో ఏమైనా ప్రత్యేక తలుపులు తెరుచుకున్నాయా అన్నదే అసలు ప్రశ్న. విరాళం ఇచ్చినవారు కేవలం దాతలుగానే ఉన్నారా? లేక అధికారానికి దగ్గరయ్యేందుకు ముందుగానే పెట్టుబడి పెట్టారా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ట్రంప్ చుట్టూ ఈ క్విడ్ ప్రో కో వివాదం చల్లారేలా కనిపించడం లేదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







