తప్పిపోయిన శ్రీజారెడ్డి కోసం ముమ్మర ప్రయత్నాలు..
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది రోజులు. నల్గొండ యువతి శ్రీజారెడ్డి అమెరికాలో అదృశ్యమై తొమ్మిది రోజులు గడిచిపోయాయి. చిన్న ఆచూకీ కానీ, చిన్న సమాచారం కానీ.. ఏమీ లేదు. అన్ని ప్రయత్నాలు జరుగుతున్నా… ఏమైంది? అన్న పూచిక పుల్లంత సమాచారం కూడా దొరకడం లేదు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర నైరాశ్యంలో పడిపోయారు.
శ్రీజారెడ్డి ఆచూకీ కోసం అందరూ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఎవరికి దగ్గట్టు వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తప్పిపోయిందన్న సమాచారం తెలుసుకోగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. కుటుంబానికి భరోసానిచ్చారు. ఇదే క్రమంలో బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి కూడా తనవంతు ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ సమాచారం తెలుసుకొని, కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడారు. తాను కూడా ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తానని, ధైర్యంగా వుండాలని భరోసానిచ్చారు. తనకు తెలిసిన మిత్రులు, అక్కడ వుండే బంధువులతో ఆచూకీ కోసం ప్రయత్నిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు.
మరోవైపు తెలుగుటైమ్స్ కూడా తనవంతు ప్రయత్నాలను చేస్తూనే వుంది. వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు శ్రీజారెడ్డికి సంబంధించిన వార్తల సమాచారం తెలియజేస్తూనే వుంది. ఎవరెవరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రయత్నాలు ఎక్కడి వరకు వచ్చాయి? అన్న విషయాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తూనే వుంది.
మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నాలివీ…
శ్రీజారెడ్డి తప్పిపోయిందన్న సమాచారం అందుకున్న వెంటనే మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా రంగంలోకి దిగారు. చొరవ తీసుకొని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, విదేశాంగశాఖ, బోస్టన్ లోని భారత కాన్సులేట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. అమెరికాలోని వివిధ తెలుగు సంఘాలతోనూ మాట్లాడుతూనే వున్నారు. స్థానిక పోలీసులతో మాట్లాడి, శ్రీజారెడ్డి ఆచూకీ కోసం అందరూ పనిచేయాలని కోరారు.
నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల కోయ శ్రీజ బోస్టన్‌లో కనిపించకుండా పోయారు. ఈనెల 2వ తేదీన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన కోయ శ్రీజ.. తిరిగి రాలేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీజ ఫ్రెండ్స్.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ యాదగిరిరెడ్డి, రూప దంపతులకు శ్రీజ ఏకైక కుమార్తె.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రీజ.. బోస్టన్లోని యూనివర్సిటీలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు. చదువుతో పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు. మరో 6 నెలల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉండగా.. ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బోస్టన్లోని డోర్చెస్టర్ ప్రాంతంలో నివసిస్తున్న శ్రీజ ఈనెల 2వ తేదీన కాలేజీకి వెళ్లి, పార్ట్‌టైమ్ ఉద్యోగం ముగించుకుని తన నివాసానికి చేరుకున్నట్లు సమాచారం.కాసేపు వాకింగ్ చేసి వస్తానని చెప్పి శ్రీజ బయటకు వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్నేహితులు ఆమె కోసం వెతికారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.







