రస్సెల్ బ్రాండ్‌కు పదేళ్ల జైలు.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ఆరోపణలు..మస్క్ విమర్శలు.. అసలేం జరిగింది?
ప్రముఖ కమెడియన్, నటుడు రస్సెల్ బ్రాండ్‌కు లండన్ కోర్టు ఏకంగా 10 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. 1999 నుంచి 2009 మధ్య నలుగురు మహిళలపై జరిగిన లైంగిక నేరాలకు సంబంధించి ఆయన దోషిగా తేలడం ఈ కేసులో కీలక పరిణామం. అయితే తీర్పు వెలువడిన తర్వాత కథ అక్కడితో ఆగలేదు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ కూడా తెరపైకి వచ్చి, రస్సెల్ బ్రాండ్‌తో తనకున్న గత సంబంధం గురించి సంచలన విషయాలు బయటపెట్టారు. మరోవైపు ఎలాన్ మస్క్ మాత్రం బ్రాండ్‌కు విధించిన శిక్షను అన్యాయమంటూ విమర్శించడం కొత్త చర్చకు దారితీసింది. ఇవన్నీ కలగలిసి ఈ కేసును అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. అసలు రస్సెల్ బ్రాండ్ ఏం చేశాడు? ఇన్నేళ్ల తర్వాత ఈ వ్యవహారం ఎందుకు బయటపడింది? జెమీమా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మస్క్‌కు ఈ తీర్పు ఎందుకు నచ్చలేదు?
నవ్వించిన కమెడియన్.. ఇప్పుడు లైంగిక నేరాల కేసులో దోషి!
రస్సెల్ బ్రాండ్ పేరు బ్రిటన్‌లో తెలియని వారుండరు. కమెడియన్‌గా, నటుడిగా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా ఒకప్పుడు ఆయనకు మంచి క్రేజ్ ఉండేది. తనదైన కామెడీ టైమింగ్, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆయన పేరు వినిపిస్తున్నది మాత్రం పూర్తిగా భిన్నమైన కారణంతో. ఆరుగురు మహిళలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై మొత్తం ఏడు క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.
1999 నుంచి 2009 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఉన్న ఘటనలకు సంబంధించి మూడు అత్యాచార ఆరోపణలు, మూడు లైంగిక దాడి ఆరోపణలు, మరో అసభ్యకర దాడికి సంబంధించిన అభియోగం ఉన్నాయి. చివరి అభియోగాన్ని విచారణ సమయంలో అత్యాచార ప్రయత్నం కాని అసభ్యకర దాడి ప్రయత్నంగా మార్చారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను బ్రాండ్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉన్నారు. మహిళలతో తనకు సంబంధాలు ఉన్న మాట నిజమేనని, కానీ అవన్నీ పరస్పర అంగీకారంతోనే జరిగాయని చెబుతూ వచ్చారు. బలవంతంగా ఎవరితోనూ లైంగిక సంబంధం పెట్టుకోలేదని కోర్టులోనూ వాదించారు. కానీ నాలుగు వారాల విచారణ తర్వాత జ్యూరీ ఆయన వాదనలను పూర్తిగా అంగీకరించలేదు. నవంబర్ 5న వెలువడిన తీర్పులో ఒక అత్యాచారం, మూడు లైంగిక దాడి కేసుల్లో ఆయన దోషిగా తేలారు. ఈ నాలుగు నేరాలకు సంబంధించి నలుగురు మహిళలు బాధితులుగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
మిగిలిన రెండు అత్యాచార ఆరోపణలు, మరో అసభ్యకర దాడి ప్రయత్నం కేసులో మాత్రం ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. నవంబర్ 9న కోర్టు 10 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, జీవితాంతం లైంగిక నేరస్థుల రిజిస్టర్లో ఆయన పేరు కొనసాగనుంది.
20 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలు.. ఇప్పుడు కేసు ఎందుకు?
రస్సెల్ బ్రాండ్‌పై ఆరోపణలు ఒక్కసారిగా ఇప్పుడు పుట్టుకొచ్చినవి కావు. 2023 సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన ది సండే టైమ్స్, ది టైమ్స్, ఛానల్ 4 డిస్పాచెస్ కలిసి నిర్వహించిన పరిశోధనాత్మక కథనం ఈ వ్యవహారాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. గతంలో బ్రాండ్ తమపై అత్యాచారం, లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డాడంటూ పలువురు మహిళలు తమ అనుభవాలను బయటపెట్టారు. ఈ కథనం ప్రచురితమైన వెంటనే బ్రాండ్ ఒక వీడియో విడుదల చేసి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తన సంబంధాలన్నీ పరస్పర అంగీకారంతోనే కొనసాగాయని చెప్పుకొచ్చారు.
అయితే మీడియా కథనాలతో ఈ వ్యవహారం ముగిసిపోలేదు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. వంద మందికి పైగా సాక్షులను విచారించారు. వందలాది స్టేట్మెంట్లు, పత్రాలు, ఫొటోలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. ఇలా దాదాపు మూడేళ్ల పాటు సాగిన దర్యాప్తు చివరకు కోర్టు విచారణకు దారితీసింది.
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా.. రస్సెల్ బ్రాండ్‌తో తనకేం సంబంధం?
రస్సెల్ బ్రాండ్ కేసు గురించి చర్చ జరుగుతున్న సమయంలో జెమీమా గోల్డ్‌స్మిత్ పేరు తెరపైకి రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను 1995లో పెళ్లి చేసుకున్న జెమీమా, 2004లో ఆయన నుంచి విడిపోయారు. ఆ తర్వాత 2013లో రస్సెల్ బ్రాండ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పుడు అదే సంబంధానికి సంబంధించిన చేదు అనుభవాలను జెమీమా బయటపెట్టారు.
2014లో బ్రాండ్ తనపై హింసకు పాల్పడ్డాడని, మానసికంగా నియంత్రించేందుకు ప్రయత్నించాడని, వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. ఒక సందర్భంలో పరిస్థితి హింసాత్మకంగా మారడంతో బ్రాండ్‌ను తన ఇంటి నుంచి బయటకు పంపించేందుకు పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ అప్పట్లో ఆయనపై అధికారికంగా కేసు పెట్టేందుకు ముందుకు రాలేదట. దీనికి కారణం కూడా ఆమె వివరించారు. తన పిల్లలు అప్పటికి టీనేజ్‌లో ఉండటంతో, ఈ వ్యవహారం మీడియాలో పెద్ద చర్చగా మారితే వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని భయపడ్డానని చెప్పారు.
ఇంతటితో ఆగకుండా 2023లో రస్సెల్ బ్రాండ్‌పై పరిశోధనాత్మక కథనం సిద్ధం చేస్తున్న జర్నలిస్టులకు కూడా తాను సహకరించినట్లు జెమీమా వెల్లడించారు. ఆయనపై సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వస్తే సిద్ధంగా ఉన్నానని, కోర్టులో అవసరమైతే తన అనుభవాలను వెల్లడిస్తానని తెలిపారు. ఇప్పటికే బ్రాండ్‌పై సాక్ష్యమిచ్చిన మహిళలకు ఆమె మద్దతు ప్రకటించారు.
ఎలాన్ మస్క్‌కు ఎందుకంత అభ్యంతరం? ‘Unjust’ అంటూ ఒక్క మాటతో స్పందన!
రస్సెల్ బ్రాండ్‌కు జైలు శిక్ష పడటంపై ఎలాన్ మస్క్ స్పందించడం ఈ వ్యవహారానికి మరో కోణాన్ని తీసుకొచ్చింది. బ్రిటన్ మాజీ ఎంపీ ఆండ్రూ బ్రిడ్జెన్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు మస్క్ స్పందించాడు. బ్రిడ్జెన్ తన పోస్టులో బ్రాండ్‌కు విధించబోయే శిక్షను, మరో బాలల లైంగిక దోపిడీ కేసులో సాజిద్ మహమూద్ ఖాన్‌కు విధించిన మూడేళ్ల జైలు శిక్షతో పోల్చారు. ఒక కేసులో పదేళ్లకు పైగా శిక్ష, మరో కేసులో మూడేళ్ల శిక్ష.. ఈ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నిస్తూ బ్రిటన్‌లో రెండు రకాల న్యాయం అమలవుతోందా? అనే చర్చను మొదలుపెట్టారు.
ఈ పోస్టుపై స్పందించిన మస్క్ ‘Unjust’ అంటూ ఒక్క మాట రాశారు. అంటే బ్రాండ్‌కు విధించబోయే శిక్ష అన్యాయమని ఆయన అభిప్రాయం. అయితే మస్క్ ఈ వ్యాఖ్య చేసిన సమయానికి కోర్టు తుది శిక్షను ప్రకటించలేదు. ఆయన స్పందించింది అప్పటికి ఊహిస్తున్న శిక్షపైనే. ఆ తర్వాత కోర్టు 10 ఏళ్ల 6 నెలల జైలు శిక్షను ఖరారు చేసింది.
నిజానికి బ్రాండ్‌కు మస్క్ మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2023లో లైంగిక వేధింపుల ఆరోపణలు బయటపడినప్పుడు కూడా ఆయన బ్రాండ్‌కు అండగా నిలిచారు. ‘నేను రస్సెల్ బ్రాండ్‌కు మద్దతు ఇస్తున్నాను. అతను చెడ్డ వ్యక్తి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. బ్రాండ్ తన రాజకీయ అభిప్రాయాల కారణంగానే విమర్శలు ఎదుర్కొంటున్నాడనే వాదనను కూడా మస్క్ అప్పట్లో వినిపించారు.
రాజకీయంగా బ్రాండ్ మారిపోయారా? అందుకే ఆయనకు మద్దతు పెరిగిందా?
రస్సెల్ బ్రాండ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు వామపక్ష భావజాలానికి, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు దగ్గరగా ఉన్న ఆయన.. గత కొన్నేళ్లుగా ప్రధాన మీడియా సంస్థలు, ప్రభుత్వ విధానాలు, కరోనా ఆంక్షలపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అమెరికాలోని సంప్రదాయవాద వర్గాలకు కూడా దగ్గరయ్యారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ రాజకీయ మార్పు కారణంగా అమెరికాలోని కొందరు సంప్రదాయవాద ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలిచారు. 2023లో ఆరోపణలు బయటపడినప్పుడే ఎలాన్ మస్క్, అలెక్స్ జోన్స్ వంటి వారు బ్రాండ్‌కు అండగా మాట్లాడారు. అధికార వ్యవస్థలను విమర్శిస్తున్నందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినిపించాయి.
కథ ఇక్కడితో ముగిసిపోలేదు.. మరో రెండు కేసులు ఎదురుచూస్తున్నాయా?
ప్రస్తుతం రస్సెల్ బ్రాండ్ న్యాయబృందం ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే అప్పీల్ దాఖలైనట్లు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. మరోవైపు ఆయనపై వచ్చిన రెండు అదనపు అత్యాచార ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఫిర్యాదులకు సంబంధించి బ్రాండ్‌ను ప్రశ్నించిన పోలీసులు, కేసు ఫైళ్లను క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (CPS)కు పంపించారు. ఈ సంస్థ అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి, తదుపరి క్రిమినల్ అభియోగాలు మోపాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది.;







