బరువు తగ్గించే మందులతో చూపు పోయే ప్రమాదం.. కీలక హెచ్చరిక జారీ చేసిన అమెరికా FDA!
బరువు తగ్గడానికి ఇప్పుడు చాలామంది ఆశ్రయిస్తున్న మందులు Ozempic, Wegovy, Mounjaro. ముఖ్యంగా ఊబకాయం, డయాబెటిస్ సమస్యలతో బాధపడేవారికి ఈ మందులు మంచి ఫలితాలు ఇస్తున్నాయనే ప్రచారంతో వీటి వినియోగం భారీగా పెరిగింది. అయితే బరువు తగ్గించే ఈ మందుల విషయంలో ఇప్పుడు అమెరికా నుంచి ఒక కీలక హెచ్చరిక వచ్చింది. బరువు తగ్గించే ప్రయత్నంలో కళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం కూడా ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) వెల్లడించింది. దీంతో ఈ మందుల తయారీ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
134 వేల మంది రోగులపై అధ్యయనం.. బయటపడిన ఆందోళనకర విషయం!
అమెరికాలో అందుబాటులో ఉన్న Ozempic, Wegovy సహా GLP-1 తరగతికి చెందిన ఊబకాయం, డయాబెటిస్ మందులపై FDA సమీక్ష చేపట్టింది. 1.34 లక్షలకు పైగా రోగులకు సంబంధించిన క్లినికల్ అధ్యయనాలు, మందుల వాడకం తర్వాత నమోదైన దుష్ప్రభావాల నివేదికలను పరిశీలించింది. ఈ పరిశీలనలో GLP-1 మందులు వాడేవారిలో అరుదైన కంటి సమస్య వచ్చే ప్రమాదం కొంత పెరిగే అవకాశం ఉందని గుర్తించింది.
ఈ సమస్య పేరు నాన్-ఆర్టెరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (NAION). వైద్య పరిభాషలో దీనిని కొన్నిసార్లు ‘ఐ స్ట్రోక్’ అని పిలుస్తారు. కంటికి సంబంధించిన ఈ సమస్యలో చూపును మెదడుకు చేరవేసే ఆప్టిక్ నరానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా ఆ నరం దెబ్బతిని చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి ఈ నరం తీవ్రంగా దెబ్బతింటే తిరిగి చూపు రావడం కూడా కష్టమవుతుంది.
గ్లకోమా తర్వాత ఆప్టిక్ నరం దెబ్బతినడం వల్ల అంధత్వానికి దారితీసే ముఖ్యమైన కారణాల్లో NAION ఒకటి.
Ozempic, Wegovy వాడేవారికి FDA హెచ్చరికలు ఎందుకు?
ఈ మందుల వల్ల కంటి సమస్య వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని తొలిసారిగా 2024 జూలైలో మసాచుసెట్స్‌లోని Mass Eye and Ear ఆసుపత్రి పరిశోధకులు గుర్తించారు. సెమాగ్లుటైడ్ (Semaglutide) మందులు వాడుతున్న రోగుల్లో, ఈ మందులు వాడనివారితో పోలిస్తే NAION వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తమ పరిశోధనలో వెల్లడించారు.
సెమాగ్లుటైడ్ అనేది Ozempic, Wegovy వంటి మందుల్లో ఉండే ప్రధాన క్రియాశీల పదార్థం. ఈ పరిశోధన వెలుగులోకి వచ్చిన తర్వాత 2024 చివర్లో FDA కూడా ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజాగా నిర్వహించిన సమీక్షలో ఈ మందులు వాడేవారికి NAION వచ్చే ప్రమాదం చాలా అరుదుగా ఉన్నప్పటికీ, సాధారణం కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చని FDA నిర్ధారించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న GLP-1 మందులన్నింటికీ సంబంధించి ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలిపింది.
అయితే ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది. అసలు ఈ మందులు ఆప్టిక్ నరానికి రక్త సరఫరాపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎందుకు పెరుగుతోంది? అనే విషయాలపై శాస్త్రవేత్తలకు ఇంకా స్పష్టత రాలేదు.
బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియాలో ఇప్పటికే హెచ్చరికలు
అమెరికా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, కొన్ని దేశాలు ఇప్పటికే ఇలాంటి హెచ్చరికలను తమ నిబంధనల్లో చేర్చాయి. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) గత ఏడాది జూన్‌లో సెమాగ్లుటైడ్ వాడకంతో NAION వచ్చే అవకాశం చాలా అరుదైన దుష్ప్రభావంగా గుర్తించింది. మందుల లేబుళ్లపై దీనికి సంబంధించిన హెచ్చరికలు చేర్చాలని సిఫార్సు చేసింది.
బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఈ మందుల విషయంలో ఇలాంటి హెచ్చరికలను తప్పనిసరి చేశాయి.
దక్షిణ కొరియాలోనూ ఈ సమస్యపై ఒక అనుమానిత కేసు నమోదైంది. 2024 డిసెంబర్లో GLP-1 తరగతికి చెందిన ఊబకాయం మందు వాడిన తర్వాత ఒక వ్యక్తికి NAION సంబంధిత చూపు సమస్య వచ్చినట్లు నివేదించారు. ఆ దేశ ఆహార, ఔషధ భద్రతా విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది.
మందుల కంపెనీలు ఏమంటున్నాయి?
ఈ మందుల తయారీ సంస్థలపై అమెరికాలో ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. GLP-1 మందులు వాడిన తర్వాత తమకు చూపు సమస్యలు వచ్చాయని కొందరు వినియోగదారులు ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయించారు.
అయితే ఈ ఆరోపణలను Eli Lilly, Novo Nordisk సంస్థలు ఖండిస్తున్నాయి. Mounjaro, Zepbound మందులను తయారు చేసే Eli Lilly, FDA తాజా నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే తమ స్పందన తెలియజేస్తామని వెల్లడించింది.
మరోవైపు Ozempic, Wegovy తయారీ సంస్థ Novo Nordisk మాత్రం తమ మందుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. నియంత్రణ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, ఈ మందుల వల్ల కలిగే ప్రయోజనాలు వాటి ప్రమాదాల కంటే ఎక్కువగానే ఉన్నాయని తమకు నమ్మకం ఉందని పేర్కొంది.
FDA ఆదేశాలతో ఇకపై ఏం మారనుంది?
GLP-1 మందుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల భద్రతా సమాచారంలో NAION వల్ల చూపు కోల్పోయే అవకాశం గురించి హెచ్చరికలు చేర్చాలని FDA ఆదేశించింది. ఈ మార్పులు మందుల లేబుళ్లలోని హెచ్చరికలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాల్లో భాగంగా ఉండనున్నాయి.
అయితే ఈ ఆదేశాలపై ఔషధ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ చివరకు ఈ హెచ్చరికలను తప్పనిసరి చేయాలా వద్దా అనే నిర్ణయం FDA చేతుల్లోనే ఉంటుంది.
బరువు తగ్గడం కోసం వాడే ఒక మందు.. మరోవైపు చూపును కోల్పోయే ప్రమాదం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ మందుల వాడకం విషయంలో ప్రయోజనాలతో పాటు వాటి అరుదైన దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం కూడా ఇప్పుడు అంతే ముఖ్యం.
గమనిక: ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం ఈ మందులు వాడుతున్న ప్రతి ఒక్కరికీ చూపు సమస్య వస్తుందని అర్థం కాదు. వైద్యుల సూచన లేకుండా మందులను ఆపడం లేదా మోతాదును మార్చడం చేయకూడదు. అకస్మాత్తుగా చూపు తగ్గడం లేదా మార్పులు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







