పెళ్లి కాకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం.. డేటింగ్ యాప్ సంచలనం!
మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం, ఇల్లు, హోదా.. ఇవన్నీ ఎంత ముఖ్యమో, జీవితాంతం తోడుగా ఉండే ఒక మనిషి కూడా అంతే ముఖ్యం. మన సంతోషాన్ని పంచుకోవడానికి, కష్టాల్లో ఓదార్చడానికి, మనం ఎలా ఉన్నా అర్థం చేసుకునే ఒక తోడు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే ప్రేమకు, పెళ్లికి మన జీవితాల్లో అంతటి ప్రాధాన్యం. కానీ విచిత్రంగా ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగినా మనసుకు నచ్చే మనిషిని వెతుక్కోవడం మాత్రం అంతకంతకూ కష్టమైపోతోంది.
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లతోనైనా మాట్లాడొచ్చు. వందలాది డేటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినా మనసుకు నచ్చిన వ్యక్తి దొరుకుతాడనే నమ్మకం మాత్రం చాలామందిలో కనిపించడం లేదు. పరిచయాలు పెరుగుతున్నాయి కానీ బంధాలు బలపడటం లేదు. గంటల తరబడి చాటింగ్ చేసినా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. చివరకు ప్రేమ కోసం వెతుకుతూ అలసిపోతున్న వాళ్లూ ఉన్నారు.
ఈ సమస్యకు ఇప్పుడు చైనా ఓ కొత్త పరిష్కారాన్ని చూపించాలనుకుంటోంది. మనకు నచ్చే జీవిత భాగస్వామిని వెతికిపెట్టే బాధ్యతను AIకి అప్పగిస్తోంది. అంతేకాదు.. ఆ AI యాప్ ద్వారా మూడేళ్లలో పెళ్లి కాకపోతే కట్టిన డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇస్తోంది! ఏడాదికి సుమారు రూ.25 వేల మెంబర్షిప్ ఫీజు.. మూడేళ్లలో పెళ్లి కాకపోతే ఫుల్ రీఫండ్! వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ప్రయోగం ఇప్పుడు చైనాలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రేమను వెతికిపెట్టే బాధ్యత AIదే!
చైనాకు చెందిన ‘లియాంగ్పే AI’ (Liangpei AI) అనే స్టార్టప్ తీసుకొచ్చిన ఈ కొత్త డేటింగ్ యాప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూలైలో ప్రారంభమైన ఈ యాప్ ఏడాదికి 2,000 యువాన్లు (సుమారు రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు) మెంబర్షిప్ ఫీజుగా వసూలు చేస్తోంది. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే.. యాప్‌లో చేరిన తర్వాత మూడేళ్లలోపు పెళ్లి చేసుకోకపోతే కట్టిన డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తారు. అంటే మీకు సరైన జీవిత భాగస్వామిని వెతికిపెట్టే బాధ్యత మాదే.. ఒకవేళ ఆ ప్రయత్నంలో విఫలమైతే మీ డబ్బులు మీకే తిరిగి ఇచ్చేస్తాం అనేది సంస్థ హామీ.
సాధారణంగా డేటింగ్ యాప్‌ల వ్యాపార విధానం వేరుగా ఉంటుంది. ఎన్ని రోజులు యాప్ వాడితే అంతకాలం వాటికి ఆదాయం వస్తుంది. ఒకరితో పరిచయం ఏర్పడినా, అది పెళ్లి వరకు వెళ్లకపోయినా వాటికి పెద్దగా నష్టం ఉండదు. కానీ లియాంగ్పే AI మాత్రం యూజర్లకు జీవిత భాగస్వామిని వెతికిపెట్టడమే తమ అసలు లక్ష్యమని చెబుతోంది. అందుకే పెళ్లి జరగకపోతే ఫీజు వెనక్కి ఇచ్చే సాహసం చేస్తోంది.
ఒకేసారి చాలామందితో పరిచయం ఉండదు!
ఇప్పుడున్న డేటింగ్ యాప్‌లలో ఒకేసారి పదిమందితో మాట్లాడొచ్చు. ఒకరితో చాటింగ్ చేస్తూనే మరొకరి ప్రొఫైల్ నచ్చితే అటువైపు వెళ్లొచ్చు. కానీ లియాంగ్పే AIలో మాత్రం అలాంటి స్వేచ్ఛ ఉండదు. ఒక సమయంలో ఒక్క వ్యక్తితో మాత్రమే మ్యాచ్ అవ్వాలి. ఆ పరిచయాన్ని కొనసాగించాలా? వద్దా? అనేది తేల్చుకున్న తర్వాతే మరో వ్యక్తిని పరిచయం చేస్తారు.
ఎందుకంటే ఒకేసారి చాలామందితో మాట్లాడటం వల్ల నిజంగా ఎవరితో మనకు అనుబంధం ఏర్పడుతోందో గుర్తించడం కష్టమవుతుందని సంస్థ భావిస్తోంది. ప్రతి ఒక్కరినీ పోల్చి చూసుకుంటూ ఉంటే ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉండదని అంటోంది. అందుకే ఒకరితో పరిచయానికి తగిన సమయం ఇవ్వాలన్నది ఈ యాప్ ఆలోచన.
రిజిస్ట్రేషన్ విషయంలోనూ కఠినమైన నిబంధనలే ఉన్నాయి. యూజర్లు తమ అసలు పేరు, ఫొటో ఇవ్వాలి. అంతేకాదు, తాము అవివాహితులమని ధ్రువీకరించుకోవాలి. యాప్ ప్రారంభమైన మొదటి నెలలోనే ఈ తనిఖీల ద్వారా 150 మందికి పైగా ఇప్పటికే పెళ్లయిన వ్యక్తులను గుర్తించి తొలగించినట్లు సంస్థ వెల్లడించింది.
మీ గురించి 20 నిమిషాలు తెలుసుకున్నాకే మ్యాచ్!
ఈ యాప్‌లో చేరాలంటే కేవలం పేరు, వయసు, ఉద్యోగం వివరాలు ఇస్తే సరిపోదు. ముందుగా దాదాపు 20 నిమిషాల పాటు AIతో మాట్లాడాలి. ఈ సంభాషణలో మీ కుటుంబ నేపథ్యం, చదువు, ఉద్యోగం, వ్యక్తిత్వం, ఆసక్తులు, జీవనశైలి, భవిష్యత్తుపై మీ ఆలోచనలు, జీవిత భాగస్వామి నుంచి మీరు ఆశించే విషయాల గురించి AI తెలుసుకుంటుంది.
ఈ వివరాలన్నింటినీ విశ్లేషించి మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రొఫైల్ తయారు చేస్తుంది. ఆ తర్వాత మీకు సరిపోయే వ్యక్తులను వెతుకుతుంది. అంటే కేవలం ఫొటో బాగుందా? మంచి ఉద్యోగం ఉందా? అనే విషయాలకే పరిమితం కాకుండా ఇద్దరి ఆలోచనలు, అలవాట్లు, జీవితంపై అభిప్రాయాలు ఎంతవరకు కలుస్తాయో అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది.
ఈ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి కూడా AI రంగంలో మంచి అనుభవం ఉన్నవాడే. లియాంగ్పే AI వ్యవస్థాపకుడు జెంగ్ జిన్క్సున్ గతంలో చైనాకు చెందిన ప్రముఖ AI చాట్‌బాట్ ‘కిమి’ అభివృద్ధిలో పనిచేశారు. ముఖ్యంగా AI సెర్చ్ టెక్నాలజీ అభివృద్ధికి నాయకత్వం వహించారు. అయితే సొంతంగా ఈ డేటింగ్ స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచనతో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పట్లో తన దగ్గరున్న స్టాక్ ఆప్షన్లను కూడా వదులుకున్నారు. వాటి విలువ తర్వాత కోట్లాది యువాన్లకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తన ప్రేమకథే ఈ బిజినెస్‌కు స్ఫూర్తి!
జెంగ్ ఈ ఆలోచనతో ముందుకు రావడానికి తన వ్యక్తిగత జీవితంలోని ఓ అనుభవం కూడా కారణం. ఆయనకు తన భార్య డేటింగ్ యాప్ ద్వారానే పరిచయమైంది. అయితే ఇద్దరూ సాధారణంగా ఫొటోలు చూసి, రెండు మూడు మాటలు మాట్లాడుకుని కలిసిన వారు కాదు. తమ గురించి వెయ్యి పదాలకు పైగా వివరాలతో ప్రొఫైల్స్ రాసుకున్నారు. ఆ తర్వాత ఒక్కరోజు మాత్రమే చాటింగ్ చేసుకుని కలవాలని నిర్ణయించుకున్నారు.
మొదట్లోనే ఒకరి గురించి మరొకరికి లోతైన అవగాహన రావడంతో తమ పరిచయం త్వరగా బలమైన బంధంగా మారిందని జెంగ్ భావిస్తున్నారు. ఈ అనుభవమే తన కొత్త యాప్‌కు పునాది అయింది. ఆయన దృష్టిలో ఇప్పుడున్న చాలా డేటింగ్ యాప్‌లు ఆన్లైన్ ఎల్లో పేజీల మాదిరిగా పనిచేస్తున్నాయి. ఎవరెవరు ఉన్నారో చూపిస్తాయి కానీ, ఎవరెవరికి సరిపోతారో చెప్పలేకపోతున్నాయి.
ముఖ్యంగా ఇప్పటి యువత జీవిత భాగస్వామి విషయంలో చాలా స్పష్టమైన అంచనాలతో ఉంటున్నారు. కుటుంబం, కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవనశైలి.. ఇలా ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇన్ని అంశాలను సాధారణ ప్రొఫైల్స్ ద్వారా అర్థం చేసుకోవడం కష్టమని, ఆ లోటును AI భర్తీ చేయగలదని జెంగ్ నమ్ముతున్నారు.
ప్రేమలో సమస్య వస్తే AI దగ్గర సలహా!
ఈ యాప్‌లో కేవలం జంటలను పరిచయం చేయడమే కాదు.. పరిచయమైన తర్వాత ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు వస్తే సలహాలు ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. దీనికి ‘AI స్ట్రాటజిస్ట్’ అని పేరు పెట్టారు. యూజర్ల ప్రొఫైల్స్, వారి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా సంబంధంలో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషించి సూచనలు చేస్తుంది.
ఓ మహిళకు యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి అకస్మాత్తుగా మెసేజ్‌లకు స్పందించడం మానేశాడు. దీంతో ఆమె AI స్ట్రాటజిస్ట్‌ను సంప్రదించింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తి తన పరిస్థితిని మూడు రోజుల్లోగా వివరిస్తూ స్పందించాల్సిన బాధ్యత ఉంటుందని AI సూచించింది. దీంతో ఆమె ఆ పరిచయాన్ని ముగించుకుంది. ఆ తర్వాత తనకు బాగా సరిపోయే వ్యక్తిని కనుగొన్నట్లు సమాచారం.
అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది. ఒక వ్యక్తి మనస్తత్వాన్ని కేవలం ప్రొఫైల్, మెసేజ్‌ల ఆధారంగా AI ఎంతవరకు అంచనా వేయగలదు? ఒకరిపై మరొకరికి నిజంగా ప్రేమ ఉందా? లేక మొదట్లో కనిపించే ఆకర్షణ మాత్రమేనా? ఇలాంటి భావోద్వేగాలను అల్గారిథమ్‌లు పూర్తిగా అర్థం చేసుకోగలవా? అన్నది ఇప్పటికీ చర్చించాల్సిన విషయమే.
35 వేల మంది యూజర్లు.. కోట్లలో పెట్టుబడులు!
చైనాలో డేటింగ్ వ్యాపారం చాలా పెద్దది. 2024లో అక్కడి ఆన్లైన్ డేటింగ్ మార్కెట్ విలువ 22.6 బిలియన్ యువాన్లు (సుమారు 3.4 బిలియన్ డాలర్లు). దాదాపు 28 కోట్ల మంది ఈ మార్కెట్‌కు సంబంధించిన సేవలను ఉపయోగిస్తున్నట్లు అంచనా.
ఇలాంటి భారీ మార్కెట్లోకి అడుగుపెట్టిన లియాంగ్పే AI కూడా తక్కువ సమయంలోనే మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పటివరకు 35 వేలకు పైగా రిజిస్టర్డ్ యూజర్లు చేరగా, సుమారు 9 శాతం మంది చెల్లింపు మెంబర్షిప్ తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, ఈ స్టార్టప్‌కు 15 మిలియన్ యువాన్లు (సుమారు 2.2 మిలియన్ డాలర్లు) ఏంజెల్ ఫండింగ్ కూడా లభించింది.
అయితే ఈ యాప్ ప్రారంభమై కొద్ది నెలలే కావడంతో దీని ద్వారా ఎన్ని జంటలు పెళ్లి చేసుకున్నాయనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. మూడేళ్ల పెళ్లి గ్యారెంటీ ఆఫర్ నిజంగా ఎంతవరకు పనిచేస్తుందో తెలియాలంటే మరికొంత సమయం పట్టాల్సిందే.
మనసుకు నచ్చిన మనిషిని కూడా AI వెతికిపెడుతుందా?
ఈ ప్రయోగంపై నెటిజన్ల అభిప్రాయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. AI ముందుగానే ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు సరిపోతాయో లేదో అంచనా వేస్తే భవిష్యత్తులో మరింత సంతోషకరమైన వైవాహిక జీవితాలు సాధ్యమవుతాయని కొందరు అంటున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవస్థలపై యువతలో పెరుగుతున్న నిరాసక్తతను తగ్గించడానికి కూడా ఇలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఇప్పటికే పెళ్లయిన వాళ్లకు కూడా ఇలాంటి AI సలహాదారుడు ఉంటే బాగుంటుందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లలు లేని తమలాంటి దంపతులకు కూడా AI స్ట్రాటజిస్ట్ అవసరమని ఓ నెటిజన్ కామెంట్ చేయడం విశేషం.
ఏదైమైనా…
చైనా స్టార్టప్ చేస్తున్న ప్రయోగం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అయితే AI ఇద్దరి మధ్య అనుకూలతను అంచనా వేయగలదేమో కానీ, ఒకరి కోసం మరొకరు చేసే త్యాగాన్ని, కష్టాల్లో తోడుగా నిలిచే మనసును, కాలంతో పాటు పెరిగే అనుబంధాన్ని ఎంతవరకు గుర్తించగలదు? పెళ్లి అనేది సరైన వ్యక్తిని ఎంచుకోవడంతోనే పూర్తయ్యే ప్రయాణం కాదు. ఆ వ్యక్తితో కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యం.
టెక్నాలజీ మనకు నచ్చిన వ్యక్తిని వెతికిపెట్టగలదేమో.. కానీ ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించే హృదయాన్ని మాత్రం మనమే పెంచుకోవాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







