రంగులు బదులుగా …బంగారం, వజ్రాలతో దీపావళి రంగోలి.. తమన్నా స్పెషల్ అట్రాక్షన్!
దీపావళి వచ్చిందంటే ఇంటి ముందు అందమైన రంగోలీ వేయడం మనకు అలవాటు. రంగురంగుల పొడులు, పూల రేకులు, మధ్యలో వెలిగే దీపాలు.. ఇలా ప్రతి ఇంటి ముందు ఓ చిన్న పండుగ వాతావరణం కనిపిస్తుంది. కానీ దుబాయ్‌లో మాత్రం ఈసారి రంగోలీని చూసి కళ్లు తిప్పుకోవడం కష్టమే. ఎందుకంటే అక్కడ రంగులు, పూలతో కాదు.. ఏకంగా బంగారం, వజ్రాలు, ముత్యాలతో రంగోలీని తయారు చేశారు. అదీ ఒకటో రెండో ఆభరణాలతో కాదు.. ఏకంగా 213 నగలను ఉపయోగించి, 6.5 కిలోల బంగారంతో ఓ భారీ కళాఖండాన్ని సృష్టించారు. ఇప్పుడు ఈ గోల్డెన్ రంగోలీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రంగుల ముగ్గుకు బదులుగా బంగారు నగలతో రంగోలీ!
దుబాయ్‌లోని సిటీ సెంటర్ డైరా మాల్లో ఈ ప్రత్యేకమైన రంగోలీని ఏర్పాటు చేశారు. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ దమాస్ (Damas), దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో కలిసి ఈ ఆలోచనను నిజం చేసింది. ఈ రంగోలీ ఆవిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ నటి తమన్నా భాటియా కూడా హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమానికి మరింత ఆకర్షణ పెరిగింది.
View this post on Instagram
ఈ రంగోలీని దగ్గరగా చూస్తే అందులో ఎన్ని రకాల నగలు ఉన్నాయో గమనించవచ్చు. నెక్లెస్‌లు, గాజులు, చెవి రింగులు, పెండెంట్లు.. ఇలా రకరకాల ఆభరణాలను ఒకదానికొకటి సరిపోయేలా అమర్చారు. దమాస్కు చెందిన రంగోలీ, లెగసీ, అనన్య కలెక్షన్ల నుంచి మొత్తం 213 ఆభరణాలను తీసుకున్నారు. వాటితో సంప్రదాయ రంగోలీ డిజైన్‌ను రూపొందించారు. బంగారం మెరుపుకు వజ్రాల కాంతి, ముత్యాల అందం తోడవడంతో ఈ రంగోలీ ఓ ప్రత్యేకమైన కళాఖండంలా కనిపిస్తోంది.
10 మంది కలిసి 16 గంటలు పనిచేస్తే కానీ పూర్తికాలేదట!
ఈ రంగోలీని రూపొందించడం వెనుక కూడా అంతే ఆసక్తికరమైన కథ ఉంది. చూడటానికి నగలను అందంగా అమర్చినట్టే కనిపించినా, ఒక్కో ఆభరణాన్ని సరైన స్థానంలో పెట్టడం అంత సులభమైన పని కాదు. డిజైన్‌లో ఎక్కడా తేడా రాకుండా, ప్రతి నగ మరో నగతో అందంగా కలిసిపోయేలా అమర్చాల్సి ఉంటుంది. అందుకే ఏకంగా 10 మంది సభ్యుల బృందం 16 గంటల పాటు కష్టపడింది. ఒక్కో ఆభరణాన్ని చేతులతో జాగ్రత్తగా అమర్చుతూ చివరకు ఈ గోల్డెన్ రంగోలీని పూర్తి చేశారు.
View this post on Instagram
ఈ రంగోలీ రెండు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పుతో ఉంది. అంటే దాదాపు నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో బంగారు నగలతోనే రంగుల ప్రపంచాన్ని సృష్టించారన్నమాట. సాధారణంగా రంగోలీ వేయడానికి ఉపయోగించే రంగులు, పూల స్థానంలో ఇన్ని విలువైన ఆభరణాలను ఉపయోగించడం ఈ ప్రదర్శనకు అసలు ప్రత్యేకత.
సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్!
సిటీ సెంటర్ డైరా మాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ రంగోలీకి సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. ‘థోడీ సీ చమక్, ఢేర్ సారా జాదూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే కొంచెం మెరుపు.. ఎంతో మ్యాజిక్ అని అర్థం. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇదే మాట అంటున్నారు. ‘ఇంత అద్భుతమైన డిజైన్ యూఏఈలోనే సాధ్యం’, ‘చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే మాల్లో ఇన్ని బంగారు నగలను పెట్టినా ఎలాంటి భయం లేకపోవడం దుబాయ్‌లోనే సాధ్యమంటూ సరదాగా స్పందిస్తున్నారు.
దుబాయ్‌లో దీపావళి అంటే షాపింగ్ కూడా ఓ పండగే!
ఇక ఈ రంగోలీతో పాటు దుబాయ్‌లో దీపావళి షాపింగ్ కూడా జోరుగా సాగుతోంది. పండుగ సందర్భంగా 180కి పైగా నగల దుకాణాలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా 1,500 దిర్హామ్‌లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన నగలు కొనుగోలు చేసేవారికి మొత్తం ఒక కిలో బంగారాన్ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రమోషన్ నవంబర్ 12 వరకు కొనసాగుతుంది. షాపింగ్ మాల్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు, రెస్టారెంట్లలో దీపావళి స్పెషల్ మెనూలు, హోటళ్లలో పండుగ ఆఫర్లతో దుబాయ్ అంతటా సందడి కనిపిస్తోంది.
సాధారణంగా మన దగ్గర దీపావళి రంగోలీ అంటే రంగులతో వేసే అందమైన ముగ్గు. కానీ దుబాయ్ మాత్రం అదే సంప్రదాయాన్ని తీసుకుని దానికి లగ్జరీ టచ్ ఇచ్చింది. పూలు, రంగుల స్థానంలో బంగారం, వజ్రాలను పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. ఇలాంటి రంగోలీని చూస్తే దాని అందాన్ని ఆస్వాదించాలా? లేక అందులో ఉన్న నగల విలువను లెక్కపెట్టాలా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల







