ట్రంప్ ఓటమికి భారతీయులే కారణమా? భారీగా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మిడ్‌టెర్మ్ ఎన్నికల ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయా? ముఖ్యంగా భారతీయ అమెరికన్ల ఓట్లు డెమోక్రాట్ల వైపు మళ్లడం ట్రంప్ వర్గాన్ని కలవరపెడుతోందా?ఇవే ఇప్పుడు అక్కడ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేయబోతోందనే చర్చ మొదలైంది. దాదాపు 18 వేల మంది అక్రమ భారతీయ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు చర్యలు వేగవంతం చేయడంతో పాటు, H-1B వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశాలున్నాయని ఓ నివేదిక పేర్కొంది.
ఈ పరిణామాలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల నుంచి అక్కడే స్థిరపడిన కుటుంబాల వరకు అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వీసా నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ విధానాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు తాజా పరిణామాలు మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మిడ్‌టెర్మ్ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు డెమోక్రాట్లకే!
మిడ్‌టెర్మ్ ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి ఎదురైన పరాజయానికి భారతీయ అమెరికన్ల ఓటింగ్ కూడా ఒక కారణమని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ మూలాలున్న ఓటర్లలో దాదాపు 65 శాతం మంది డెమోక్రటిక్ అభ్యర్థులకు ఓటు వేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ట్రంప్ మద్దతుదారుల్లో అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది.
దీంతో భారతీయులపై ఇమ్మిగ్రేషన్ పరంగా మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో కొత్త నిబంధనలు తీసుకురావడం, అక్రమంగా అమెరికాలో ఉంటున్నవారిని వేగంగా గుర్తించి స్వదేశానికి పంపించడం వంటి చర్యలపై చర్చ జరుగుతోంది.
2025లో అమెరికా నుంచి 3,567 మంది భారతీయులను బహిష్కరించారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది. ఈ ఏడాది జూన్ నాటికి మరో 1,076 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు H-1B వీసాల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా తగ్గాయి. గత ఏడాది 1.72 లక్షలుగా ఉన్న భారతీయుల H-1B వీసా రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది 1.06 లక్షలకు పడిపోయాయి. అంటే అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయుల విషయంలో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
MAGA ప్రభావంతో భారతీయులపై విద్వేషం 240 శాతం పెరిగిందా?
ట్రంప్‌కు మద్దతుగా నిలిచే కుడిపక్ష వర్గాలు తమను తాము MAGA (Make America Great Again) ఉద్యమ మద్దతుదారులుగా చెప్పుకుంటాయి. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మార్చాలన్న నినాదంతో ముందుకు సాగుతున్న ఈ వర్గాల్లోని కొందరు వలసదారులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో భారతీయుల సంఖ్య, ప్రభావం పెరుగుతుండటాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భారతీయులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2024 జనవరి నుంచి 2026 జూన్ మధ్య కాలంలో భారతీయులపై విద్వేషపూరిత పోస్టులు ఏకంగా 240 శాతం పెరిగినట్లు పేర్కొంది.
2024 జనవరిలో భారతీయులకు వ్యతిరేకంగా 12,904 పోస్టులు ఉండగా, 2026 జూన్ నాటికి ఆ సంఖ్య 43,843కు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే సోషల్ మీడియాలో మొదలైన విద్వేష ప్రచారం క్రమంగా బహిరంగ నిరసనలు, వివాదాల రూపంలోనూ బయటపడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
డెమోక్రాట్ల విజయానికి హిందువులే కారణమంటూ ఆరోపణలు!
అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకతకు సియాటెల్‌లో జరిగిన ఓ దీపావళి వేడుక ఘటన ఉదాహరణగా నిలిచింది.ఈ నిరసనలో పాల్గొన్న వ్యక్తుల్లో జాక్ లాంగ్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది. ట్రంప్ మద్దతుదారుడిగా గుర్తింపు ఉన్న అతడు, దీపావళి వేడుకలో తనను, తన అనుచరులను హిందువులు, యాంటీఫా (Antifa) మద్దతుదారులు దాడి చేశారని సోషల్ మీడియా వేదిక Xలో ఆరోపించాడు. తమపై దాడి చేయడంతో పాటు, తమ జెండాను కూడా ధ్వంసం చేశారని పేర్కొన్నాడు.
అంతేకాదు, టెక్సాస్‌లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించడానికి హిందువులే సహకరించారని ఆరోపించాడు. అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్ ప్రాంతాల్లో క్రైస్తవుల స్థానంలో హిందువుల ప్రభావం పెరుగుతోందని, దానికి వ్యతిరేకంగానే తాము నిరసన తెలుపుతున్నామని చెప్పాడు.
ఈ వివాదంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నిరసనకు నాయకత్వం వహించిన జాక్ లాంగ్ నేపథ్యం. అతడిని ట్రంప్ మద్దతుదారుడిగా గుర్తిస్తారు. ‘వైట్ రీప్లేస్మెంట్’ (White Replacement) పేరుతో ఒక సంస్థను నడుపుతున్నట్లు తెలిసింది.
ఫైనల్ గా..
ఒకప్పుడు అమెరికా అంటే భారతీయ యువతకు ఎన్నో ఆశలు. మంచి చదువు, మంచి ఉద్యోగం, ఆర్థికంగా స్థిరపడటం, కుటుంబానికి మెరుగైన భవిష్యత్తు ఇవ్వడం.. ఇలా ఎన్నో కలలతో వేలాది మంది అమెరికా బాట పట్టారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన యువత, ఐటీ ఉద్యోగులు అక్కడ తమ జీవితాలను నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఒకవైపు H-1B వీసాలపై ఆంక్షల భయాలు, మరోవైపు భారతీయులపై పెరుగుతున్న విద్వేషం, ఇంకోవైపు డిపోర్టేషన్ ఆందోళనలు.. ఇవన్నీ అమెరికాలో స్థిరపడిన భారతీయులను ఆలోచనలో పడేస్తున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







