జేక్ లాంగ్ చర్యను ముక్తకంఠంతో ఖండిస్తున్న భారతీయ అమెరికన్ ప్రతినిధులు
సిటెల్ లో జరుగుతున్న దీపావళి వేడుకలకు అంతరాయం కలిగించిన జేక్ లాంగ్ చర్యను భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ఈ ఘటనను జాతి వివక్షతో కూడిన ప్రదర్శనగా అభివర్ణించారు. హిందూ సమాజం ఎటువంటి భయం లేకుండా పండుగను జరుపుకోగలగాలని ఆమె పేర్కొన్నారు.
ఎక్స్ మాధ్యమంగా ఆమె ప్రతిస్పందిస్తూ.. ‘‘ఈ నీచమైన, జాత్యహంకార ప్రదర్శనను చూసి నేను తీవ్రంగా అసహ్యించుకుంటున్నాను. దీపావళి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండగ. సమాజం అంతా అత్యంత వైభంగా, సురక్షితంగా జరుపుకోవాలి. ఈ ద్వేషపూరిత ప్రదర్శనకు మన నగరంలో గానీ, మన దేశంలో గానీ చోటు లేనే లేదు’’ అంటూ స్పష్టం చేశారు.
భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భూటోరియా కూడా ఈ నిరసనను ఖండిస్తూ, దీనిని “పూర్తి మూర్ఖత్వం” అని అభివర్ణించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని చేసే జాతిపరమైన దూషణలకు యునైటెడ్ స్టేట్స్లో చోటు లేదని ఆయన అన్నారు.
కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా (CoHNA) కూడా ఈ సంఘటనను హిందూ వ్యతిరేక దురభిమానానికి ఉదాహరణగా అభివర్ణిస్తూ, ఒక సామాజిక హెచ్చరికను జారీ చేసింది. పిల్లలు ప్రదర్శన ఇస్తున్న సమయంలో, లాంగ్ మరియు తోటి కార్యకర్త థామస్ అలెన్ హిందూ వ్యతిరేక సందేశాలున్న ఫలకాలను పట్టుకుని వేడుకలోకి ప్రవేశించారని ఆ సంస్థ తెలిపింది. అలాగే కార్యక్రమానికి హాజరైన ప్రజలు నిరసనకారులను ప్రాంగణం నుండి తొలగించారని CoHNA పేర్కొంది. కార్యకర్తలు ఇతర దీపావళి వేడుకలకు అంతరాయం కలిగించే ప్రణాళికలను ప్రకటించారని చెబుతూ, సంఘ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కూడా అది కోరింది.
అమెరికాలోని సియాటెల్‌లో భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకల్లోకి ట్రంప్ మద్దతుదారులు కొందరు ప్రవేశించి, భారతీయులు, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘భారతీయులందరినీ దేశం నుంచి బహిష్కరించాలి’, ‘హిందువులు క్రైస్తవులను భర్తీ చేస్తున్నారు’ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ నిరసనకారులు దీపావళి వేడుకలనే తమ ఆందోళనకు వేదికగా చేసుకోవడం అక్కడి భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది.







