తొలిసారి టెస్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన..!
భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో చేపట్టబోయే దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మూడు ఫార్మాట్ల అధికారిక జట్లను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఒక ఏకైక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి గెబెహా వేదికగా ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌తో ఈ టూర్ షురూ కానుంది. ఈ పర్యటనలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్పు ఏంటంటే, రెడ్-బాల్ క్రికెట్లో భారత జట్టుకు స్మృతి మంధాన(Smrithi Mandanna) తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నారు.
షెడ్యూల్ వివరాల ప్రకారం.. డిసెంబర్ 9 నుంచి 13 వరకు ఏకైక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత డిసెంబర్ 16 నుంచి పరిమిత ఓవర్ల సమరం ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లోని మ్యాచ్‌లు డిసెంబర్ 16, 19, 22 తేదీల్లో వరుసగా పార్ల్, కేప్ టౌన్, బ్లూమ్‌ఫోంటైన్ నగరాల్లో జరగనున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 26, 29, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఇందుకోసం బెనోని మొదటి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు పోచెఫ్స్ట్రూమ్లో జరగబోతున్నాయి.
బిసిసిఐ ప్రకటించిన సెలెక్షన్ కమిటీ నిర్ణయం ప్రకారం మూడు ఫార్మాట్లకూ స్మృతి మంధాననే కెప్టెన్‌గా లీడ్ చేయనుండటం విశేషం. టెస్ట్ మరియు వన్డే జట్లకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోగా, టీ20 ఫార్మాట్లో మాత్రం షఫాలీ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. జట్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, వికెట్ కీపర్లు రిచా ఘోష్, యాస్తికా భాటియా వంటి సీనియర్ ఆటగాళ్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా గడ్డపై గట్టి సవాల్‌ను ఎదుర్కొని సిరీస్ గెలవాలనే పట్టుదలతో టీమిండియా పటిష్టమైన లైనప్‌తో బరిలోకి దిగుతోంది.







