38వ ఏట కోహ్లీ.. తర్వాతి టార్గెట్ అదే..!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) నవంబర్ 5న తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ వయసులో చాలామంది క్రికెటర్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటే, కోహ్లీ మాత్రం తన అద్భుతమైన ఫిట్నెస్, ఆటపై ఉన్న అంకితభావంతో వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తున్నాడు. ప్రస్తుతం కోహ్లీ కెరీర్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, అభిమానుల గుండెల్లో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును కోహ్లీ అందుకోగలడా..?
విరాట్ కోహ్లీ ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు కలిపి 86 అంతర్జాతీయ సెంచరీలతో క్రికెట్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే క్రికెట్లో ఇప్పటికే 55 సెంచరీలతో సచిన్ (49) రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచిన కోహ్లీ, టెస్టుల్లో 30 శతకాలు, టీ20ల్లో ఒక శతకం సాధించాడు. సచిన్ టెండూల్కర్ సాధించిన మహా మైలురాయి ‘100 సెంచరీల’ రికార్డును సమం చేయాలంటే కోహ్లీకి ఇంకా 14 సెంచరీలు అవసరం. టి20 అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ప్రస్తుతం వన్డే క్రికెట్‌పైనే తన పూర్తి దృష్టిని కేంద్రీకరించాడు.
ఇవి కూడా చదవండి
2027 వన్డే ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కింగ్ కోహ్లీ, ఆ లోపు సచిన్ రికార్డును అందుకోవడంపైనే క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, పరిమితంగా వన్డే మ్యాచ్‌లు ఆడుతున్న తరుణంలో 14 సెంచరీలు చేయడం కాస్త కష్టమైన సవాలే అయినప్పటికీ, కోహ్లీ లాంటి రన్ చేజ్ మాస్టర్‌కు ఇది అసాధ్యమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 74 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించి, తనలో ఇంకా ఆ కసి తగ్గలేదని కోహ్లీ మరోసారి చాటిచెప్పాడు. క్రికెట్ రికార్డుల కంటే భారత్‌కు మ్యాచ్‌లు గెలిపించడమే తన అసలైన ఫిలాసఫీ అని చెప్పే కోహ్లీ, రాబోయే రోజుల్లో ఆ 100 సెంచరీల మేజిక్ ఫిగర్‌ను కూడా దాటాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.







