కాంగ్రెస్ అబద్ధాలపై బీజేపీ సమరభేరి..!
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు, ఎన్నికల వ్యవస్థపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, పాదయాత్రల ద్వారా కాంగ్రెస్ నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు రాజకీయాలను ఎండగట్టడంతో పాటు, దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో తమ రాజకీయ ప్రణాళికలపై ఆయన స్పష్టమైన బ్లూప్రింట్ అందించారు.
రామ్ లీలా మైదానంలో ఏకంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ, కనీసం 50 వేల మందిని కూడా సమీకరించలేక చతికిలబడడం ఆ పార్టీ పతనానికి నిదర్శనమని రామ్ మాధవ్ విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్‌కు సొంత కేడర్ నుంచే స్పందన కరువైందనడానికి ఈ వైఫల్యమే నిదర్శనమన్నారు. అంతేకాకుండా, ఈ ర్యాలీకి ముఖం చాటేసిన నేతలపై హైకమాండ్ క్రమశిక్షణా చర్యలు చేపడుతూ.. మధ్యప్రదేశ్ యూత్ వింగ్‌ను పూర్తిగా సస్పెండ్ చేయడం ఆ పార్టీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలను, అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలదేనని రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పును తట్టుకోలేక ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ వ్యవస్థలను అణచివేశారని, అలాగే 1987లో కశ్మీర్ ఎన్నికల్లో సాగించిన తీవ్రస్థాయి రిగ్గింగే ఆ ప్రాంతంలో ఉగ్రవాదానికి, వేర్పాటువాదానికి ఆజ్యం పోసిందని ఆయన గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యబద్ధంగా వరుస విజయాలు సాధిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేకనే రాహుల్ గాంధీ అండ్ కో నిత్యం నిరాధార ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఎలక్టోరల్ రోల్స్ ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏ ఒక్కరికో మేలు చేసేది కాదని, ఇది 1952 నుంచీ అమల్లో ఉన్న నిబంధనే అని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. 2004 తర్వాత గత రెండు దశాబ్దాలుగా ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరగలేదని, ఇప్పుడు ఎన్నికల సంఘం పారదర్శకత కోసం అక్రమ వలసదారులు, బోగస్ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు హడలిపోతోందని సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారనేది పచ్చి అబద్ధమని, అందులో ఎక్కువ భాగం బదిలీ అయినవి, మరణించిన వారివేనని లెక్కలతో వివరించారు. ఇక ఈవీఎంలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని, బ్యాలెట్ పేపర్లతో జరిగిన అసోం సిల్చార్ ఎన్నికలోనూ, నాలుగు రాష్ట్రాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీనే భారీ మెజారిటీతో గెలిచిందనే వాస్తవాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.
తెలంగాణ రాజకీయాలపై రామ్ మాధవ్ చేసిన కామెంట్స్ సర్వత్రా ఆసక్తి నింపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరి చేతిలో కాకుండా నలుగురు ముఖ్యమంత్రుల చేతుల్లో సమాంతరంగా నడుస్తోందని, తీవ్రమైన అవినీతి పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ రాజకీయ పతనాన్ని ప్రస్తావిస్తూ.. ఆయన ఎవరితో కలిస్తే వాళ్లు ఓడిపోతారని, థర్డ్ ఫ్రంట్ పేరుతో రాజకీయంగా మనుగడ కోసం ప్రయత్నించి చివరికి పూర్తిగా అవుట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణకు ఏకైక సహజ ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేసిన ఆయన.. రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, పార్లమెంట్లో ఆయన హాజరుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయన తమ ఎన్నికల ప్రచారానికీ ఒక పెద్ద స్టార్ క్యాంపెయినర్‌గా మారాడని వ్యంగ్యంగా ముగించారు.







