తమిళనాడులో ప్రత్యేక జెండా వివాదం..!
తమిళనాడులో మరో రాజకీయ వివాదం చెలరేగింది. ఇది కూడా అధికారంలో ఉన్న టీవీకే మంత్రి అధవ్ అర్జున్ కారణంగా… ఆయన తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలని ప్రకటించారు.మంత్రి వ్యాఖ్యల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అవమానించడమేనన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ అయితే టీవీకే విభజన రాజకీయాలు చేస్తుందని మండిపడింది.
జాతీయ త్రివర్ణ పతాకంతో సమానంగా తమిళనాడు రాష్ట్రానికి కూడా ప్రత్యేక జెండా ఉండాలని అధవ్ డిమాండ్ చేశారు. తమిళ భాష, తమిళ ప్రజల గొప్పతనాన్ని చాటిచెప్పేలా తమిళనాడుకు ప్రత్యేకంగా ఒక రాష్ట్ర జెండాను రూపొందించాలన్నారు. 2027 జులై 18నాటికి.. అంటే తమిళనాడు దినోత్సవం.. రాష్ట్రాల పునర్విభజన రోజైన నవంబర్ 1న ఈ ప్రత్యేక జెండాను ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ప్రతి ఏడాది తమిళనాడు దినోత్సవం సందర్బంగా ఈ జెండాను అధికారికంగా ఎగరవేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి
అయితే ఈ ప్రత్యేక జెండా డిమాండ్ పై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలలో విచ్ఛిన్నకర ఆలోచనలను పెంచి పోషించేందుకు టివికె ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. తమిళ గుర్తింపును, భారతీయ గుర్తింపును విడదీసేలా ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. జాతీయ పతాకం నీడలో తమిళ గుర్తింపు ఎప్పటికీ చిన్నబోదని స్పష్టం చేశారు. అనవసర వివాదాల జోలికి పోకుండా ప్రజల సమస్యలను పరిష్కరించే ఆలోచనలు చేయాలని సూచించారు.
ఇదిలావుండగా తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలన్న డిమాండ్ ఈ నాడు టీవీకే కొత్తగా చేస్తున్నది కాదని మేధావులు చెబుతున్నారు. 1970లోనే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి తమిళనాడుకు ఒక ప్రత్యేక జెండాను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించిందని మళ్ళీ ఇప్పుడు టీవీకే ఆ డిమాండ్ ను బయటకు తీసిందని చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రం కూడా ఇప్పటికే ప్రత్యేక జెండాకు చట్టబద్దత కల్పించడానికి ప్రయత్నం చేస్తోంది.







