చంద్రుడు ఎవరి సొత్తు? జెండా పాతితే.. ఆ భూమి వాళ్లదేనా? అంతర్జాతీయ చట్టం ఏం చెబుతోంది?
చంద్రుడిపై ఒక దేశం జెండా పాతితే.. ఆ ప్రాంతం ఆ దేశానిదైపోతుందా? అక్కడ బంగారం, విలువైన ఖనిజాలు దొరికితే వాటిని ఎవరైనా తీసుకెళ్లొచ్చా? అసలు భూమిపై ఉన్నట్లుగా చంద్రుడికి కూడా యజమానులు ఉంటారా? ఇప్పటివరకు ఇవి పెద్దగా ఆలోచించనవసరం లేని ప్రశ్నలే. కానీ ఇప్పుడు నిజంగానే ప్రపంచ దేశాలు వీటికి సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకంటే చంద్రుడిపై అమెరికా వేస్తున్న కొత్త అడుగులు అంతరిక్షంలో భవిష్యత్తు హక్కులపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. ఇందులో భారత్‌కు కూడా ఒక కీలకమైన పాత్ర ఉండబోతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2028 నాటికి చంద్రుడిపై శాశ్వత అమెరికా ఉనికిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘ది అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ స్పేస్’ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో అంతరిక్ష పరిశోధనలు, అభివృద్ధి, భవిష్యత్తులో నివాస ఏర్పాట్లలో అమెరికా నాయకత్వం వహించాలని స్పష్టం చేశారు. చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో అంగారకుడిపైకి మనుషులను పంపడం కూడా ఈ ప్రణాళికలో భాగమే.
అయితే ఈ ప్రకటనలో అంతరిక్షాన్ని ఉమ్మడి ప్రాంతంగా పేర్కొంటూనే, అక్కడ అమెరికా శాశ్వత ఉనికిని ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉండటం చర్చకు దారితీసింది. మరి అంతర్జాతీయ చట్టాలు దీనికి అనుమతిస్తాయా?
1967 ఒప్పందం.. ఏం చెప్తోంది!
చంద్రుడిపై యాజమాన్య హక్కుల విషయంలో 1967లో కుదిరిన ‘ఔటర్ స్పేస్ ట్రీటీ’ అత్యంత కీలకం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో రూపొందిన ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్షం, చంద్రుడు సహా ఇతర ఖగోళ వస్తువులు ఏ ఒక్క దేశానికీ సొంతం కావు. ప్రపంచంలోని అన్ని దేశాలూ వాటిని పరిశోధించడానికి, శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి సమాన హక్కులు కలిగి ఉంటాయి.
ఇవి కూడా చదవండి
ఈ ఒప్పందంలోని ఆర్టికల్-2 ప్రకారం ఏ దేశమూ చంద్రుడిని తన భూభాగంగా ప్రకటించుకోకూడదు. అక్కడ జెండా పాతినా, శాశ్వత స్థావరం నిర్మించినా, ఆక్రమణ ద్వారా యాజమాన్య హక్కులు పొందలేరు.
అంటే అమెరికా చంద్రుడిపై స్థావరం ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం అమెరికా సొంతం కాదు. కానీ ఇక్కడే మరో ప్రశ్న ఎదురవుతోంది. చంద్రుడిపై స్థావరాలు నిర్మించుకోవడానికి అనుమతి ఉన్నప్పుడు, అక్కడ లభించే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఎవరికి ఉంటుంది?
చంద్రుడిపై ఖనిజాలు దొరికితే.. ఎవరు తీసుకెళ్లొచ్చు?
చంద్రుడిపై నీటి మంచు (Water Ice), ఇతర ఖనిజ వనరులు భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు ఎంతో కీలకం కావచ్చు. అక్కడ లభించే నీటిని తాగడానికి మాత్రమే కాకుండా, ఆక్సిజన్, రాకెట్ ఇంధనం తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే చంద్రుడిపై పరిశోధనలతో పాటు వనరుల వినియోగంపై అగ్రరాజ్యాలు ఆసక్తి చూపుతున్నాయి.
1979లో రూపొందించిన ‘మూన్ అగ్రిమెంట్’ ప్రకారం చంద్రుడు, దాని సహజ వనరులు మానవాళి ఉమ్మడి వారసత్వం. వాటి వినియోగం వల్ల వచ్చే ప్రయోజనాలు అన్ని దేశాలకు అందేలా అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలని ఈ ఒప్పందం సూచిస్తుంది.
అయితే ఈ ఒప్పందాన్ని అమెరికా, చైనా, రష్యా వంటి ప్రధాన అంతరిక్ష శక్తులు ఆమోదించలేదు. భారత్ సంతకం చేసినప్పటికీ ఇంకా అధికారికంగా ఆమోదించలేదు. దీంతో చంద్రుడిపై వనరుల వెలికితీత, వాటి వినియోగానికి సంబంధించి అంతర్జాతీయంగా భిన్నమైన అభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
చంద్రుడి కోసం అమెరికా, చైనా మధ్య మరో పోటీ!
ఇప్పుడు చంద్రుడిపై పోటీ కేవలం రాకెట్లు, వ్యోమగాముల ప్రయాణాలకే పరిమితం కాలేదు. భవిష్యత్తులో అక్కడ ఎవరు స్థావరాలు ఏర్పాటు చేస్తారు? ఎవరి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తారు? అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను ఎవరు నిర్ణయిస్తారు? అన్న అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయి.
అమెరికా నేతృత్వంలో ఆర్టెమిస్ కార్యక్రమం కొనసాగుతుండగా, చైనా-రష్యాలు కలిసి ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ (ILRS) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయి.
దీంతో ప్రపంచ దేశాలు రెండు అంతరిక్ష కూటములుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా నేతృత్వంలోని ఆర్టెమిస్ ఒప్పందాలకు ఒకవైపు మద్దతు పెరుగుతుంటే, మరోవైపు చైనా-రష్యా తమ సొంత అంతరిక్ష పరిశోధన వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.
స్పేస్ థింక్ ట్యాంక్ ‘స్పేస్‌పోర్ట్ సారాభాయ్’ డైరెక్టర్ జనరల్ సుస్మితా మొహంతి అభిప్రాయం ప్రకారం.. అంతరిక్ష పరిశోధన అనేది ఇప్పటివరకు అంతర్జాతీయ సహకారంతోనే ముందుకు సాగింది. అమెరికా ఒక్కటే అంతరిక్షంలో ఆధిపత్యం సాధించలేదని, రష్యా సహకారం కూడా కీలకంగా నిలిచిందని ఆమె గుర్తుచేశారు.
చైనా కూడా 2007 నుంచి ఆరు చంద్రయాన మిషన్లు నిర్వహించింది. వీటిలో రెండు చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చే మిషన్లు ఉన్నాయి. 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
అమెరికాతో స్నేహం.. చైనాతో పోటీ.. భారత్ ఏం చేయాలి?
ఈ పరిణామాలు భారత్‌కు అత్యంత కీలకం. ఎందుకంటే భారత్ ఇప్పటికే అమెరికా నేతృత్వంలోని ఆర్టెమిస్ ఒప్పందాల్లో భాగస్వామిగా ఉంది. 2023 జూన్‌లో ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. మరోవైపు అంతరిక్ష రంగంలో తన వ్యూహాత్మక స్వతంత్రతను కూడా కాపాడుకోవాలనుకుంటోంది.
2026 ఆగస్టులో నాసా తన మూన్ బేస్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇస్రోను ఆహ్వానించింది. ఇది భారత్‌కు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో మరిన్ని అవకాశాలను అందించే పరిణామం.
అదే సమయంలో భారత్ తన సొంత లక్ష్యాలతో ముందుకెళ్తోంది. ‘స్పేస్ విజన్ 2047’లో భాగంగా 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ (రిటైర్డ్) అభిప్రాయం ప్రకారం.. ఆర్టెమిస్ ఒప్పందాలపై భారత్ సంతకం చేసినప్పటికీ, భవిష్యత్తులో అంతరిక్ష వ్యవహారాల్లో ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై దేశంలో విస్తృత చర్చ జరగాలి. ట్రంప్ ప్రకటనను కేవలం రాజకీయ వ్యాఖ్యగా చూడకూడదని, అది అమెరికా అధ్యక్షుడి అధికారిక విధాన ప్రకటన అని ఆయన పేర్కొన్నారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







