బండి సంజయ్‌కి మళ్లీ రాష్ట్ర పగ్గాలు!?
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల కిందట పార్టీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచంద్రరావును మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తిరిగి ఎంపీ బండి సంజయ్ చేతికి వెళ్లనున్నాయనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవారు. అప్పట్లో బీజేపీ దూకుడు ఊహించని స్థాయిలో ఉండేది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఆ సమయలో పార్టీ కేవలం జాతీయ స్థాయి పార్టీగానే కాకుండా, అధికార బీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాలు సాధించడంతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఊహించని విధంగా ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుని సంచలనం సృష్టించింది. సంజయ్ అనుసరించిన దూకుడు రాజకీయ శైలి, ప్రభుత్వ వైఫల్యాలపై నిరంతరం పోరాటం చేసే తీరు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాయి.
ఇవి కూడా చదవండి
అయితే, ఆయన దూకుడుతో పార్టీలో అంతర్గతంగా కొంత అసంతృప్తి చెలరేగడం, కొందరు సీనియర్ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఆయనను ఆ పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత పార్టీలో నాయకత్వ మార్పులు జరుగుతూ వచ్చాయి.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా, రాష్ట్రంలో పార్టీ మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలన్నా, కేడర్‌లో ఉత్సాహం రావాలన్నా బండి సంజయ్ లాంటి దూకుడుగల నాయకుడే కచ్చితంగా అవసరమని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో కీలక వ్యూహకర్తగా ఉన్న సునీల్ బన్సాల్ తదితర పరిశీలకులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అధ్యక్ష మార్పుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రామచంద్రరావుకు ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగిస్తే, ఖాళీ అయ్యే రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని మళ్లీ బండి సంజయ్‌కే కట్టబెట్టాలనే ప్రతిపాదనపై అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఒకవేళ బండి సంజయ్‌కు మళ్లీ రాష్ట్ర పగ్గాలు దక్కితే తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా కనెక్ట్ అయ్యే నాయకుడిగా పేరున్న సంజయ్ రాకతో పార్టీ కేడర్‌లో మళ్ళీ కొత్త జోష్ వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ విధివిధానాలపై, వైఫల్యాలపై పోరాటాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌కు పగ్గాలు ఇవ్వడం ద్వారా పార్టీ సామాజిక వర్గాల సమీకరణలోనూ బలపడే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.
మొత్తానికి రాబోయే స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ హైకమాండ్ తీసుకునే ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.







