గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్ ! నవంబర్ బులెటిన్‌లో ఏముంది?
అమెరికాలో స్థిరపడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు నవంబర్ వీసా బులెటిన్ కొంత ఊరటనిచ్చింది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకునేవారికి ఈసారి మంచి వార్తే వచ్చింది. ఇప్పటివరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న కొన్ని కేటగిరీల్లో ఏకంగా ఏడాది ముందుకు కదలిక కనిపించింది. దీంతో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కొంతమంది దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
అయితే ఉద్యోగం ఆధారంగా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు మాత్రం పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఆధారపడే EB-1, EB-2 కేటగిరీలు ఈసారి కూడా ముందుకు కదల్లేదు. EB-3లో మాత్రం కేవలం 21 రోజుల పురోగతి మాత్రమే నమోదైంది.
ఫ్యామిలీ గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి నిజంగానే గుడ్ న్యూస్!
నవంబర్ 2026 వీసా బులెటిన్‌లో F1, F2B, F3 కేటగిరీల్లో వచ్చిన మార్పులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ మూడు కేటగిరీల ఫైనల్ యాక్షన్ డేట్స్ ఒక్కొక్కటి ఏడాది ముందుకు జరిగాయి. ఫైలింగ్ డేట్స్ కూడా సరిగ్గా ఏడాది ముందుకు కదిలాయి. అంటే ఇన్నాళ్లూ తమ ప్రాధాన్యత తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కొంతమందికి ఇప్పుడు అప్లికేషన్ ప్రక్రియలో ముందడుగు వేసే అవకాశం ఏర్పడింది.
ఇక F2A కేటగిరీలో కూడా కొంత ఊరట లభించింది. అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్నవారి భార్యాభర్తలు, పిల్లలకు సంబంధించిన ఈ కేటగిరీ ఫైనల్ యాక్షన్ డేట్ ఒక నెల ముందుకు కదిలింది. అలాగే F2A ఫైలింగ్ డేట్ ఇప్పటికే కరెంట్‌గా ఉండటంతో అర్హులైన దరఖాస్తుదారులు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా తమ అప్లికేషన్లు సమర్పించవచ్చు.
అయితే అమెరికా పౌరుల సోదరులు, సోదరీమణుల కోసం ఉద్దేశించిన F4 కేటగిరీ మాత్రం ఇంకా నెమ్మదిగానే సాగుతోంది. ఈ కేటగిరీలో ఫైనల్ యాక్షన్ డేట్ డిసెంబర్ 15, 2006 దగ్గరే ఉండిపోయింది. ఫైలింగ్ డేట్ కూడా ఫిబ్రవరి 1, 2007 వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే ఈ కేటగిరీలో ఉన్నవారి నిరీక్షణ ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు మాత్రం నిరాశే!
కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల్లో కనిపించిన కదలిక ఉద్యోగ ఆధారిత కేటగిరీల్లో మాత్రం కనిపించలేదు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులకు అత్యంత కీలకమైన EB-1, EB-2 తేదీలు నవంబర్ బులెటిన్‌లో కూడా మారలేదు. EB-1 ఫైనల్ యాక్షన్ డేట్ ఫిబ్రవరి 1, 2023 దగ్గరే ఉండగా, EB-2 నవంబర్ 1, 2013 వద్దే నిలిచిపోయింది. ఫైలింగ్ డేట్స్‌లో కూడా ఎలాంటి పురోగతి లేదు.
ఇక్కడే భారతీయ ఉద్యోగుల అసలు సమస్య కనిపిస్తోంది. అమెరికా కంపెనీల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నవారు, మంచి జీతాలు సంపాదిస్తున్నవారు, అక్కడే కుటుంబాలతో స్థిరపడాలని కోరుకుంటున్నవారు కూడా గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఉద్యోగం ఉంది, ఆదాయం ఉంది, అమెరికాలోనే జీవితం కొనసాగుతోంది. కానీ శాశ్వత నివాస హోదా మాత్రం అందని ద్రాక్షగానే మిగులుతోంది.
EB-3 కేటగిరీలో మాత్రం కొద్దిగా కదలిక వచ్చింది. ఫైనల్ యాక్షన్ డేట్ జనవరి 1, 2014 నుంచి జనవరి 22, 2014కు మారింది. అంటే 21 రోజుల పురోగతి మాత్రమే. మరీ ముఖ్యంగా ఫైలింగ్ డేట్ జనవరి 15, 2015 దగ్గరే ఆగిపోయింది. ఇతర ఉద్యోగుల (Other Workers) కేటగిరీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. EB-4, EB-5 విభాగాల్లో కూడా పెద్దగా మార్పులేమీ లేవు.
భారతీయుల ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ తేదీలు ఇవే..
నవంబర్ 2026 బులెటిన్ ప్రకారం కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డుల ఫైనల్ యాక్షన్ డేట్స్ ఇలా ఉన్నాయి.
కేటగిరీ నవంబర్ 2026 తేదీ
F1 జనవరి 22, 2021
F2A అక్టోబర్ 22, 2026
F2B ఆగస్టు 22, 2020
F3 అక్టోబర్ 22, 2015
F4 డిసెంబర్ 15, 2006
ఫైలింగ్ డేట్స్ విషయానికి వస్తే F1 కేటగిరీ ఫిబ్రవరి 1, 2021కు, F2B సెప్టెంబర్ 1, 2020కు, F3 నవంబర్ 1, 2015కు చేరుకున్నాయి. F2A మాత్రం కరెంట్‌గా కొనసాగుతోంది. F4 ఫైలింగ్ డేట్ ఫిబ్రవరి 1, 2007 దగ్గరే ఉంది.
ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డుల వెయిటింగ్ ఎంత?
ఉద్యోగం ఆధారంగా అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునే భారతీయులు గమనించాల్సిన ఫైనల్ యాక్షన్ డేట్స్ ఇవి.
కేటగిరీ నవంబర్ 2026 తేదీ
EB-1 ఫిబ్రవరి 1, 2023
EB-2 నవంబర్ 1, 2013
EB-3 జనవరి 22, 2014
Other Workers జనవరి 22, 2014
EB-4 డిసెంబర్ 15, 2022
EB-5 Unreserved డిసెంబర్ 1, 2023
EB-5 Rural Current
EB-5 High Unemployment Current
EB-5 Infrastructure Current
ఫైలింగ్ డేట్స్‌లోనూ EB-1 జులై 1, 2024 దగ్గర, EB-2, EB-3 జనవరి 15, 2015 దగ్గరే కొనసాగుతున్నాయి. EB-4 జనవరి 1, 2025గా ఉంది. EB-5 అన్రిజర్వ్డ్ కేటగిరీ మే 1, 2024కు చేరుకుంది. గ్రామీణ ప్రాంతాలు, అధిక నిరుద్యోగం ఉన్న ప్రాంతాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులకు సంబంధించిన EB-5 కేటగిరీలు మాత్రం కరెంట్‌గా ఉన్నాయి. అంటే వీసాల జారీకి ప్రస్తుతం ఎలాంటి కటాఫ్ తేదీ లేదు’.
—-సూర్య ప్రకాష్ జోశ్యుల







