ఎన్నికల్లో ఇప్పటి వరకు విజయం పొందిన భారతీయ అమెరికన్లు వీరే..
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ నేతలు తమ సత్తా చాటారు. అందులోనూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన పలువురు సత్తా చాటారు. అమీబేరా అయితే.. ఏకంగా 8 వ సారి తిరిగి ఎన్నిక కావడం విశేషం. భారతీయ అమెరికన్ చట్ట సభ సభ్యుల్లో అత్యంత సీనియర్ గా ఆయనకు ఇప్పటికే పేరుంది. దీన్ని ఈ గెలుపుతో మరింత సుస్థిరం చేసుకున్నారు. అయితే.. డెమోక్రటిక్ ప్రభంజనంతో రిపబ్లిక్ పార్టీ తరపున పోటీలో వున్న పలువురు భారతీయ అమెరికన్లు ఓటమి పాలయ్యారు.
ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ అమెరికన్ నేతలు….
అమీ బేరా :
కాలిఫోర్నియాలోని 3 వ జిల్లా నుంచి మరోసారి ఎన్నికయ్యారు. ఆయన పూర్తి పేరు అమరీశ్ బాబూలాల్ బేరా. 2012 లో తొలిసారిగా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈయన మూలాలు గుజరాత్ లో వున్నాయి. గుజరాత్ నుంచి వారి కుటుంబం అమెరికాకి వలస వెళ్లింది. చట్ట సభలోకి రాక మునుపు వైద్య వృత్తిలో వుండేవారు. సాక్రమెంటో కౌంటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా వుండేవారు.
రో ఖన్నా :
కాలిఫోర్నియా 17 వ జిల్లా నుంచి తిరిగి ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్ కి ఎన్నిక కావడం ఆరోసారి. 2020 లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బెర్నీ శాండర్స్ ప్రచార కార్యక్రమాలకు సారథ్యం వహించారు.
ఇవి కూడా చదవండి
సుహాస్ సుబ్రహ్మణ్యం :
వర్జీనియా 10 వ జిల్లా నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించారు. హ్యూస్టన్ లో జన్మించారు సుహాస్. న్యాయవాది, పారిశ్రామికవేత్త. ఒబామా హయాంలో వైట్ హౌస్ టెక్నాలజీ అడ్వైజర్ గా పనిచేశారు. 2019 నుంచి 2023 వరకు వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభలో సభ్యుడు. 2023-2024 అదే రాష్ట్ర సెనేట్ లో సభ్యుడు. సుహాస్ తల్లిదండ్రులది కర్నాటక, తమిళనాడు. కొంత కాలం హైదరాబాద్ లో కూడా నివసించారు.
ప్రమీల జయపాల్ :
వాషింగ్టన్ 7 వ జిల్లా నుంచి హౌస్ సభ్యురాలిగా వున్నారు. అదే స్థానం నుంచి తిరిగి విజయ ఢంకా మోగించారు. 1965 లో చెన్నైలో జన్మించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చేశారు. ఎంబీఏ పూర్తి చేసి, 2016 లో తొలిసారిగా ప్రతినిధుల సభలో అడుగు పెట్టారు.
పియా దాండియా :
ఫ్లోరిడాలోని 22 వ జిల్లా నుంచి గెలుపొందారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టకు ముందు టీచర్ గా, హైస్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ఫ్లోరిడా 22 వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి బరిలో నిలిచిన డెమోక్రాటిక్ అభ్యర్థి పియా దాండియా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిన కేసీ అస్కర్ ని ఓడించారు. ఫ్లోరిడా నుంచి అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర నెలకొల్పారు.మొత్తం ఓట్లలో పియా దాండియాకి 51.9 శాతం, కేసీ అస్కర్ కి 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి.
అరుణా మిల్లర్ :
మేరీ ల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా వరుసగా రెండోసారి గెలుపొందారు. వీరి మూలాలు హైదరాబాద్ లో వున్నాయి. తండ్రి ఉద్యోగ రీత్యా అమెరికాకి వలసెళ్లారు. అరుణా ఇంజినీరింగ్ చదివి, 25 సంవత్సరాలు పనిచేశారు. 2010 లో డెమోక్రటిక్ పార్టీ నుంచి మేరీల్యాండ్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టారు. 8 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు.
నబీలా సయ్యద్ :
ఇల్లినాయిస్ రాష్ట్ర సెనేట్ 26 వ డిస్ట్రిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై నబీలా విజయం సాధించారు. నాలుగు సంవత్సరాల కిందే ఇల్లినాయిస్ ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. చిన్న వయస్కురాలిగా రికార్డు కూడా నెలకొల్పారు. నబీలా తల్లిదండ్రులు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. వారి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకుంటారు.
మిగతా భారతీయ అమెరికన్ల ఫలితాలు వెలువడాల్సి వుంది.







