విమర్శలకు ఘాటుగా బదులిచ్చిన సందీప్ రెడ్డి వంగా
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఓ దారుణ నేర ఘటన ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి రణ్‌బీర్ కపూర్(ranbir kapoor) హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy vanga) తెరకెక్కించిన యానిమల్(animal) సినిమాలోని ఓ ఎపిసోడ్‌ను కొందరు ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. సినిమాలో చూపించిన హింసాత్మక సన్నివేశాల ప్రభావంతోనే కొందరు నేరాలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హింసను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు డైరెక్టర్ ను టార్గెట్ గా చేసుకున్నారు.
గత కొద్దిరోజులుగా ఈ విమర్శలపై మౌనంగా ఉన్న సందీప్ రెడ్డి వంగా తాజాగా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక దారుణ ఘటన జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవడం, వారి కుటుంబాల పట్ల సానుభూతి చూపించడం మొదటి బాధ్యత కావాలని ఆయన పేర్కొన్నారు. అయితే అసలు సమస్యను పక్కనపెట్టి సినిమాలను నిందించడం, ఒకరిని బలిపశువుగా మార్చడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. బాధితుల పట్ల నిజమైన ఆందోళన కంటే వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలనే ఉద్దేశమే కొందరిలో కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా అవకాశవాద విమర్శకులు, కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలపై ఆయన పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతరుల పనిని విమర్శించడానికి అవకాశం దొరికినప్పుడల్లా సామాజిక సంస్కర్తలుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. విషాదకర ఘటనలను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చుకోవడం తగదని, సానుభూతికి, అవకాశవాదానికి మధ్య ఉన్న తేడాను గుర్తించాలని హితవు పలికారు. సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో మరోసారి చర్చకు తెరలేపాయి.







