హైదరాబాద్లో విదేశీ ఓటర్లు.. ఎస్ఐఆర్ అవసరమా..? లేదా?
హైదరాబాద్ లో జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎస్ఐఆర్ ప్రక్రియను కాంగ్రెస్తో పాటు పలు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఈ ముసుగులో విదేశీయులను, అక్రమ వలసదారులను రక్షించేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో నగరంలో కొందరు విదేశీయులు అక్రమంగా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించడం ఈ వివాదానికి మరింత బలాన్ని చేకూర్చింది.
ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లుగా నమోదైనట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 12 మంది నేపాల్ కు చెందిన వ్యక్తులు ఎలాంటి వీసా లేదా భారతీయ పౌరసత్వం లేకుండానే అక్రమంగా ఓటు హక్కు పొందినట్లు అధికారులు తేల్చారు. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో పదుల సంఖ్యలో రోహింగ్యాలు అక్రమంగా ఓటర్ల జాబితాలో చేరినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బూత్ లెవెల్ అధికారులు జారీ చేసిన నోటీసులకు సంబంధిత విదేశీయులు ఎలాంటి ఆధారాలు లేదా ధృవీకరణ పత్రాలు సమర్పించలేదని అధికారులు స్పష్టం చేశారు. సుమారు 6 వేల మందికి పైగా నోటీసులు జారీ చేసినప్పటికీ, గడువు ముగిసినా ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అర్హత లేని, విదేశీ, బోగస్ ఓట్ల తొలగింపునకు జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నేతృత్వంలో ఈ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 12.53 లక్షల మందికి నోటీసులు జారీ చేయగా, వారిలో అత్యధికులు విచారణకు సరైన పత్రాలు చూపలేదని సమాచారం.
ఈ పరిణామాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేశభద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న విదేశీయులను, అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఓటు హక్కు లేని విదేశీయులను తొలగిస్తుంటే కాంగ్రెస్ పార్టీ అందుకు అడ్డు తగలడం వెనుక రాజకీయ లబ్ధి దాగుందని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన విదేశీ ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే బీఎల్ఓలకు గేటెడ్ కమ్యూనిటీలు, విద్యా సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు సహకరించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30 నాటికి తుది ఓటరు జాబితా ప్రచురించనున్న నేపథ్యంలో ఈ విదేశీ ఓటర్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన కేంద్రబిందువుగా మారింది.







