గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. సామాజిక సమీకరణాలపై ఉత్కంఠ
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ అంశం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ కోటాలో ఎమ్మెల్సీ కావాలని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగానే ఉంది. ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కుతాయనే దానిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఆశావహుల సంఖ్య భారీగా ఉండడం, ఖాళీలు తక్కువగా ఉండడంతో సామాజిక సమీకరణాలను బ్యాలన్స్ చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని చెప్పొచ్చు.
ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ల పదవీకాలం ఈ నెల 15తో ముగియనుంది. ఈ మూడు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. దీంతో పదవిని ఆశిస్తున్న సీనియర్లు, ఆశావాహుల లాబీయింగ్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో, మిగిలిన సామాజిక వర్గాలకు ఈ ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయని పార్టీలో చర్చ జరుగుతోంది. కనీసం రెండు స్థానాలను బీసీలకే కేటాయిస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే స్పష్టం చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
గవర్నర్ కోటాలో భర్తీ చేయబోయే స్థానాలలో పద్మశాలి వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే సిరిసిల్ల సభలో బహిరంగంగా ప్రకటించారు. దీంతో పద్మశాలి వర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కూతురు పవిత్రవాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాశ్ నేత తదితరులు కూడా ఈ రేసులో గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలాగే రెండో బీసీ సీటు కోసం యాదవ, గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. యాదవ వర్గం నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్, లోకేశ్ యాదవ్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరు సతీశ్ పేర్లు తెరపైకి వచ్చాయి. గౌడ వర్గం నుంచి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ల శారద, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ముదిరాజ్ వర్గం నుంచి సునీతా రావు కూడా మహిళా కోటాలో అవకాశం ఆశిస్తున్నారు.
కేవలం బీసీలకే కాకుండా ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా బలమైన ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్సీ కోటా నుంచి మాజీ ఎమ్మెల్సీ సంపత్ కుమార్, చాడగొండ వెంకటేశ్ పేర్లు పరిశీలనలో ఉండగా, ఎస్టీ కోటాలో సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు బలరాం నాయక్ పేరు ప్రచారంలో ఉంది. ఇక బ్రాహ్మణ కోటాలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, మైనార్టీ కోటాలో మరో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కూడా ఈ పదవులపై కన్నేసి ఉంచారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన వెంటనే భర్తీ చేయాలనే కఠిన నిబంధన ఏమీ లేదు. ఇది ఎన్నికల సంఘం పరిధిలోకి కూడా రాదు. కేబినెట్ లో ముగ్గురి పేర్లను ఖరారు చేసి, ఆమోదం కోసం గవర్నర్కు పంపాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… అప్పుడే గవర్నర్ కోటా స్థానాలను భర్తీ చేస్తే బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాన్ని త్వరలోనే పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారని సమాచారం. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం రచిస్తారో వేచి చూడాలి.







