“ఇక సైలెంట్‌గా ఉండలేం!”.. గూగుల్‌పై AI టీమ్ తిరుగుబాటు!
టెక్నాలజీ ప్రపంచంలో గూగుల్‌కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కొత్త ఆవిష్కరణలు, స్వేచ్ఛగా ఆలోచించే ఉద్యోగులు, ప్రపంచాన్ని మార్చే ప్రయోగాలు.. ఇవన్నీ ఆ కంపెనీకి గుర్తింపు తెచ్చాయి. కానీ ఇప్పుడు అదే గూగుల్‌లో ఏదో జరుగుతోంది. కంపెనీ లోపల పనిచేస్తున్న కొందరు వ్యక్తులు తమకు తెలిసిన విషయాలను బయట ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారు. అందుకు మాత్రం కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. చివరకు వాళ్లు తమ కంపెనీతోనే తలపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ వాళ్లు బయటపెట్టాలనుకుంటున్న విషయం ఏంటి? గూగుల్ ఎందుకు అంతగా కలవరపడుతోంది?
ఉద్యోగ ఒప్పందాల్లోనే అసలు చిక్కు!
గూగుల్‌కు చెందిన AI విభాగం డీప్‌మైండ్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఇప్పుడు తమ ఉద్యోగ ఒప్పందాల్లోని కొన్ని నిబంధనలను తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ‘Non-Disparagement Clause’ అనే నిబంధనపై వారి అభ్యంతరం. దీని ప్రకారం కంపెనీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా బహిరంగంగా మాట్లాడకూడదు. అయితే బ్రిటన్‌లోని కొందరు ఉద్యోగుల ఒప్పందాల్లో ఈ నిబంధన చాలా కఠినంగా ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.
ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా కంపెనీని విమర్శించకుండా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఇద్దరు ప్రస్తుత ఉద్యోగులు ఆ పత్రికకు తెలిపారు. కొన్ని ఒప్పందాల్లో ఈ ఆంక్షలు జీవితాంతం వర్తించేలా ఉన్నాయని చెప్పారు. అంటే ఒక ఉద్యోగి గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు మాత్రమే కాదు, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తనకు తెలిసిన విషయాల గురించి మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట.
AI గురించి ఉద్యోగులకు తెలిసిన విషయాలు బయటకు రావొద్దా?
ఇక్కడే అసలు వివాదం మొదలైంది. AIని అభివృద్ధి చేస్తున్న పరిశోధకులకు ఆ టెక్నాలజీ సామర్థ్యాల గురించి మాత్రమే కాదు.. దానివల్ల ఎదురయ్యే సమస్యలు, పరిమితులు, ప్రమాదాల గురించి కూడా అవగాహన ఉంటుంది. అలాంటప్పుడు ఆ అనుభవాలను ప్రజలతో పంచుకునే స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదన్నది ఉద్యోగుల ప్రశ్న.
AI టెక్నాలజీ చాలా వేగంగా మారుతోందని, దాని ప్రభావం కూడా చాలా విస్తృతంగా ఉండబోతోందని ఒక ఉద్యోగి అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారని, తెలుసుకునే హక్కు కూడా వారికి ఉందని అన్నారు. AI వల్ల కలిగే నష్టాలు, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాల గురించి బయటకు వచ్చే సమాచారం చాలా సందర్భాల్లో ఆ టెక్నాలజీతో పనిచేసే వ్యక్తుల నుంచే వస్తుందని ఆయన వివరించారు.
ఈ అంశంపై గూగుల్ అంతర్గత మెసేజింగ్ ప్లాట్ఫామ్లో ఇటీవల పెద్ద చర్చే జరిగింది. డజన్ల కొద్దీ ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. కొందరు ఒప్పందాల్లోని నిబంధనలను నేరుగా ప్రశ్నించగా, మరికొందరు ‘1984’ అనే పదంతో కూడిన ఎమోజీలను పోస్టు చేశారు. జార్జ్ ఆర్వెల్ రాసిన ఈ ప్రసిద్ధ నవలలో వ్యక్తిగత స్వేచ్ఛపై నియంత్రణ, నిఘా, భావప్రకటనపై ఆంక్షలు ప్రధాన అంశాలు.
మాజీ ఉద్యోగి బయటపెట్టిన విషయంతో మొదలైన కలకలం!
ఈ వివాదం ఒక్కసారిగా తెరపైకి రావడానికి ఒక మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. గూగుల్ డీప్‌మైండ్‌లో పనిచేసిన సోఫియా లిగువోరి ఇటీవల BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సైనిక అవసరాల కోసం AI అభివృద్ధి చేయడంపై తన అభ్యంతరాలను వెల్లడించారు. తన ఉద్యోగ ఒప్పందంలో కంపెనీని విమర్శించకుండా ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఆ ఆంక్షలను పట్టించుకోకుండా తన అభిప్రాయాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఆమె వ్యాఖ్యలు బయటకు వచ్చిన తర్వాత బ్రిటన్‌లోని డీప్‌మైండ్ ఉద్యోగులు తమ ఉద్యోగ ఒప్పందాలను మరోసారి పరిశీలించడం మొదలుపెట్టారు. అప్పుడే తమ ఒప్పందాల్లోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయని కొందరు గుర్తించారు. దీంతో ఈ విషయం కంపెనీ అంతర్గత చర్చకు దారితీసింది.
గూగుల్ వివరణ ఇచ్చినా ఉద్యోగులు వెనక్కి తగ్గడం లేదు!
ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో గూగుల్ కూడా స్పందించింది. కంపెనీని వదిలి వెళ్లిన ఉద్యోగులపై ఈ నిబంధనలను అమలు చేయబోమని స్పష్టం చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి ఒప్పందాల్లో ఇప్పటికే మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఉద్యోగులు తమ అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక అంతర్గత వ్యవస్థలు కూడా ఉన్నాయని తెలిపింది.
అయితే ప్రస్తుత ఉద్యోగులు ఈ వివరణతో సంతృప్తి చెందడం లేదు. కొత్తగా చేరేవారి ఒప్పందాల్లో మాత్రమే మార్పులు చేస్తే సరిపోదని, ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల ఒప్పందాల్లోనూ ఈ నిబంధనలను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు. కంపెనీ ఇచ్చే మౌఖిక హామీల కంటే ఒప్పందాల్లో స్పష్టమైన మార్పులే తమకు భరోసా ఇస్తాయని భావిస్తున్నారు.
ఒకప్పుడు ఉద్యోగుల నిరసనలకు తలొగ్గిన కంపెనీ!
గూగుల్ చరిత్రలో ఇలాంటి అంతర్గత వ్యతిరేకతలు గతంలోనూ ఉన్నాయి. 2018లో అమెరికా రక్షణ శాఖ కోసం డ్రోన్ల చిత్రాలను విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు గూగుల్ ఒక ఒప్పందం చేసుకుంది. అయితే ఆ ప్రాజెక్టుపై ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడంతో చివరకు పెంటగాన్‌తో ఆ ఒప్పందాన్ని కొనసాగించకూడదని కంపెనీ నిర్ణయించింది.
కానీ ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితులు మారాయి. సైనిక అవసరాల కోసం AI వినియోగంపై గతంలో తీసుకొచ్చిన కొన్ని పరిమితులను 2025లో గూగుల్ తొలగించింది. 2024లో ఇజ్రాయెల్ సైన్యంతో కంపెనీకి ఉన్న ఒప్పందాలను వ్యతిరేకిస్తూ కార్యాలయాల్లో నిరసనలు తెలిపిన ఉద్యోగులను కూడా తొలగించింది. ఈ పరిణామాలు కంపెనీలో ఉద్యోగుల అభిప్రాయాలకు ఇస్తున్న ప్రాధాన్యతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఇది గూగుల్ సమస్య మాత్రమే కాదు!
AI రంగంలో పనిచేస్తున్న పరిశోధకుల్లో ఈ తరహా ఆందోళనలు పెరుగుతున్నాయి. గూగుల్‌తో పాటు OpenAI, Anthropic వంటి సంస్థల్లో పనిచేసిన కొందరు ప్రముఖ పరిశోధకులు కూడా AI వల్ల సమాజానికి ఎదురయ్యే ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. కొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ కంపెనీల విధానాలను ప్రశ్నించారు.
AI అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో, దాని ప్రభావాలను అంచనా వేయడం కూడా అంతే ముఖ్యం. ఉద్యోగాలు, వ్యక్తిగత గోప్యత, ప్రజాస్వామ్యం, యుద్ధ రంగం.. ఇలా అనేక అంశాలపై AI ప్రభావం ఉండబోతోంది. ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్న పరిశోధకుల అనుభవాలు ప్రజలకు చేరడం అవసరమని ఒక వర్గం వాదిస్తోంది. మరోవైపు కంపెనీలు తమ వ్యాపార రహస్యాలను, ఉద్యోగుల ద్వారా తెలిసే గోప్యమైన సమాచారాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి.
అయితే ఈ రెండు అంశాల మధ్య గీత ఎక్కడ గీయాలి? కంపెనీ రహస్యాలను కాపాడటం ఒక ఎత్తయితే, ప్రజలకు హాని కలిగించే అవకాశం ఉన్న టెక్నాలజీ గురించి హెచ్చరించే ఉద్యోగుల గొంతు నొక్కకుండా చూడటం మరో ఎత్తు. AI యుగంలో ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలకు పెద్ద సవాలుగా మారుతోంది.
మొత్తానికి, ప్రపంచానికి AI భవిష్యత్తును పరిచయం చేస్తున్న గూగుల్లోనే ఇప్పుడు AI భవిష్యత్తు గురించి మాట్లాడే స్వేచ్ఛపై పోరాటం మొదలైంది. ఈ పోరాటం ఉద్యోగుల ఒప్పందాల దగ్గర ఆగిపోతుందా? లేక టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగుల భావప్రకటన స్వేచ్ఛపై అనుసరిస్తున్న విధానాలనే మార్చుకోవాల్సి వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
–సూర్య ప్రకాష్ జోశ్యుల







