గేమింగ్ రంగంలోకి మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu) మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ ను అలరిస్తున్న ఆయన, తాజాగా గేమింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వార్తల్లో నిలిచారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న షార్ట్‌గన్ గేమ్స్(Shortgun Games) అనే గేమింగ్ స్టార్టప్‌లో ఆయన కొంత వాటాను కొనుగోలు చేశారు. ఇందుకోసం ఎంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. ఇండియన్ క్రియేటివ్ టాలెంట్ ను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లాలనే టార్గెట్ తో పనిచేస్తున్న ఈ సంస్థలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
జీత్ చందన్(jeeth chandan), విధిత్ మెహతా(vidith mehta) స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రాజెక్ట్ టేక్‌డౌన్(Project Takedown) పేరుతో భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను రూపొందిస్తోంది. ఫ్యూచర్ లోని ముంబై నగర నేపథ్యంలో సాగే ఈ గేమ్ 10 నుంచి 15 గంటల పాటు సాగేలా రూపొందిస్తున్నారు. పీసీతో పాటు ప్లేస్టేషన్5, ఎక్స్‌బాక్స్ సిరీస్ X|S కన్సోళ్లపై అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్ఆర్ఆర్, ఉరి వంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ డైరెక్టర్ విక్కీ అరోరా(Vicky arora) ఈ ప్రాజెక్టులో భాగమవడం విశేషం. యాక్షన్ సీన్స్ కు సినిమాటిక్ అనుభూతిని అందించేలా ఆయన పనిచేయనున్నారు.
భారత్‌లోనే గేమ్‌ను అభివృద్ధి చేసి అమెరికా, యూరప్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో రిలీజ్ చేయాలని సంస్థ ప్లాన్స్ రెడీ చేస్తోంది. 2028 చివరి నాటికి ఈ గేమ్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంది. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS RAJAMOULI) తెరకెక్కిస్తున్న వారణాసి(Varanasi) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.







