అమెరికాలో ఇల్లు కొనడం ఇక కలేనా? ఇంత దారుణంగా ఉందా పరిస్థితి?
ఒక ఇంటిని కొనాలనే ఆలోచనలో చాలా చిన్న చిన్న కోరికలు దాగి ఉంటాయి. ఆదివారం ఉదయం కాఫీ తాగుతూ కిటికీలోంచి బయటకు చూడటం. పిల్లలు గోడల మీద పెన్సిల్‌తో గీతలు గీసినా ఇంటి యజమాని ఏమంటాడోనని భయపడకపోవడం. నచ్చిన రంగుతో గోడలకు పెయింట్ వేయించుకోవడం. నెల మొదట్లో ఓనర్ కనపడతాడేమో అనే భయం లేకపోవడం. బయటకు చూస్తే ఇవన్నీ పెద్ద ఆశలేమీ కావు. కానీ అమెరికాలో చాలామంది అద్దెదారులకు ఈ చిన్న కోరికలే ఇప్పుడు చాలా ఖరీదైనవిగా మారాయి.
ఒక కుటుంబం సొంత ఇల్లు కొనాలని నిర్ణయించుకుందనుకోండి. ముందుగా నచ్చిన ఇంటి కోసం వెతుకుతుంది. ఇల్లు నచ్చుతుంది.. ధర నచ్చదు. ధర కాస్త అందుబాటులో ఉందనుకుంటే డౌన్ పేమెంట్ సరిపోదు. అదీ ఎలాగోలా సమకూర్చుకుంటే బ్యాంకు వడ్డీ రేట్లు భయపెడతాయి. అన్నీ దాటుకుని లోన్ తీసుకుంటే నెలనెలా ఈఎంఐ కట్టడానికి మిగతా జీవితం సరిపోదు. చివరకు ఇంటిని కొనకుండానే దాని ధర పెరిగిపోయిందని తెలుసుకుంటారు. ఇదంతా చూస్తుంటే అమెరికాలో ఇల్లు కొనడం కంటే లాటరీ గెలవడం సులభమేమో అనిపిస్తుంది.
ప్రపంచానికి ఆర్థిక పాఠాలు చెప్పే అమెరికాలో ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు తమకంటూ నాలుగు గోడలు సంపాదించుకోవడానికి పడుతున్న కష్టమిది. CNBC, SurveyMonkey నిర్వహించిన తాజా సర్వేలో బయటపడిన గణాంకాలు చూస్తే అమెరికన్ డ్రీమ్‌కు కూడా ఇప్పుడు డౌన్ పేమెంట్ అవసరమైందేమో అనిపించకమానదు.
ఇల్లు కావాలి.. కానీ జీవితాంతం అద్దెదారులుగానే ఉండాల్సి వస్తుందేమో!
అమెరికాలో అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారిలో 87 శాతం మంది భవిష్యత్తులో సొంత ఇల్లు కొనాలని కోరుకుంటున్నారు. అయితే వారిలో 34 శాతం మంది మాత్రం తమ జీవితంలో ఎప్పటికీ ఇల్లు కొనలేమని భావిస్తున్నారు. అంటే సొంతింటి కోరిక ఉంది. కానీ ఆ కోరిక నెరవేరుతుందనే నమ్మకం లేదు. కలలు కనడానికి డబ్బులు అవసరం లేదు కాబట్టి కలలు కంటున్నారు. వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం బ్యాంకు బ్యాలెన్స్ కావాలి కదా!
ఈ నిరాశ కేవలం ఉద్యోగ జీవితాన్ని ఇప్పుడే ప్రారంభించిన యువతలోనే లేదు. 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్నవారిలో 35 శాతం మంది సొంత ఇల్లు కొనలేమని భావిస్తున్నారు. 35 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్నవారిలో ఈ సంఖ్య 36 శాతంగా ఉంది. అంటే జీవితంలో సగం ప్రయాణం పూర్తయినా సొంతింటి విషయంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.
డౌన్ పేమెంట్ దగ్గరే డౌన్!
ఇల్లు కొనాలంటే ముందుగా డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగిలిన మొత్తానికి బ్యాంకు రుణం తీసుకోవచ్చు. వినడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా! కానీ అమెరికాలో చాలామందికి ఆ చిన్న అడుగే పెద్ద కొండలా కనిపిస్తోంది.
సర్వేలో పాల్గొన్న అద్దెదారుల్లో 52 శాతం మంది డౌన్ పేమెంట్ చెల్లించడానికి అవసరమైన పొదుపు తమ దగ్గర లేదని చెప్పారు. మరో 47 శాతం మంది తమ ఆదాయం సరిపోవడం లేదని లేదా క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండటంతో మార్టిగేజ్ రుణం పొందలేకపోతున్నామని తెలిపారు.
అంటే బ్యాంకు దగ్గరకు వెళ్లకముందే బ్యాంకు అర్హతల నుంచి బయటపడిపోతున్నారు. ఇల్లు కొనడానికి డబ్బు కావాలి. డబ్బు కోసం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి అద్దె తగ్గాలి. అద్దె తగ్గాలంటే చౌకైన ఇల్లు కావాలి. కానీ చౌకైన ఇల్లు ఎక్కడుందో తెలియదు. ఇదంతా చూస్తుంటే సొంతింటి కోసం ఒక కుటుంబం ముందుగా ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేయాల్సి వస్తుందేమో!
ఇక్కడే అసలు విషయం బయటపడుతోంది. ఇళ్లు లేవని కాదు. ఇళ్లు ఉన్నాయి. కొనడానికి డబ్బులే లేవు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మకానికి బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ వాటి ధరలు చూసిన తర్వాత చాలామందికి తమ జీతం ఎంత చిన్నదో మరోసారి గుర్తొస్తోంది.
అద్దె కట్టడానికే సంపాదిస్తున్నామా !
అమెరికాలో అద్దెకు ఉంటున్న ప్రతి నలుగురిలో ఒకరు తమ పన్నులు కట్టగా మిగలే ఆదాయంలో కనీసం సగాన్ని ఇంటి అద్దె, ఇతర హౌసింగ్ ఖర్చులకే వెచ్చిస్తున్నారు. అంటే నెల జీతం చేతికి రాగానే మొదటి స్వాగతం ఇంటి అద్దె బిల్లు నుంచే వస్తోంది. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే జీవితాన్ని నడిపించాలి.
దాంతో అమెరికాలో మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఒక విచిత్రమైన ప్రశ్న దగ్గర ఆగిపోయింది. జీవితమంతా కష్టపడి పనిచేసి సంపాదించేది మన కోసం ఒక ఇల్లు కొనడానికా? లేక మరొకరి ఇంటి అద్దె కట్టడానికా?
ఐదేళ్లలో అమెరికన్ డ్రీమ్ ధర మరింత పెరిగింది!
గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఇల్లు కొనడం చాలా కష్టమైందని 73 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఇంటి ధరలు పెరగడమే ప్రధాన కారణమని 72 శాతం మంది చెప్పారు. రోజువారీ ఖర్చులు పెరగడం వల్ల పొదుపు చేయలేకపోతున్నామని 70 శాతం మంది తెలిపారు. మరో 66 శాతం మంది అధిక మార్టిగేజ్ వడ్డీ రేట్లను సమస్యగా గుర్తించారు.
అంటే ఇంటి ధరలు పెరిగాయి. నిత్యావసరాల ధరలు పెరిగాయి. వడ్డీలు పెరిగాయి. కానీ మధ్యతరగతి ప్రజల కలల ధర మాత్రం తగ్గలేదు. వాళ్లకు కావాల్సింది పెద్ద బంగ్లా కాదు. కనీసం తమ కుటుంబం హాయిగా ఉండగలిగే ఒక ఇల్లు. కానీ ఆ చిన్న కోరికను నెరవేర్చుకోవడానికే ఇప్పుడు పెద్ద ఆర్థిక ప్రణాళిక అవసరమవుతోంది.
ఇక ఇప్పటికే సొంత ఇల్లు కొనుక్కున్నవాళ్ల పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. మార్టిగేజ్ చెల్లిస్తున్న ఇంటి యజమానుల్లో 84 శాతం మంది గత ఐదేళ్లలో తమ హౌసింగ్ ఖర్చులు పెరిగాయని చెప్పారు. ఇంటి బీమా, ప్రాపర్టీ ట్యాక్స్, వడ్డీ చెల్లింపులు పెరిగిపోయాయి. దాదాపు ముగ్గురిలో ఒకరు గణనీయమైన ఖర్చుల పెరుగుదలను ఎదుర్కొంటున్నారు.
అంటే ఇల్లు కొననివాళ్లు కొనలేక బాధపడుతున్నారు. కొనుక్కున్నవాళ్లు దాని ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు అనేది మనిషికి భద్రత ఇవ్వాలి. కానీ ఇప్పుడు కొందరికి అదే నెలవారీ ఆర్థిక పరీక్షగా మారింది.
అమెరికన్ డ్రీమ్‌కు ఇప్పుడు వడ్డీ రేట్ల పరీక్ష!
ఇంటి ధరను ఎలాగోలా భరించగలిగినా మార్టిగేజ్ వడ్డీ రేట్లు మరో సమస్యగా మారుతున్నాయి. భవిష్యత్తులో ఇల్లు కొనాలని భావిస్తున్నవారిలో 61 శాతం మంది 7 శాతం వడ్డీ రేటు చాలా ఎక్కువని చెప్పారు.
ఏడు శాతం అనేది కాగితంపై చిన్న సంఖ్యలా కనిపించవచ్చు. కానీ పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు దాని ప్రభావం నెలవారీ చెల్లింపుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కుటుంబం తన జీతంలో ఎంత భాగాన్ని ఇంటి కోసం కేటాయించాలి? పిల్లల చదువులకు ఎంత మిగలాలి? అత్యవసర ఖర్చులకు ఎంత దాచుకోవాలి? అనే లెక్కలు మొదలవుతాయి.
ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 72 శాతం మంది అపార్ట్మెంట్ల కంటే ఒకే కుటుంబం నివసించే స్వతంత్ర ఇంటిని కొనాలని కోరుకుంటున్నారు. పిల్లలకు ప్రత్యేక గది ఉండాలి. కొంత స్థలం ఉండాలి. తమకంటూ ఒక చిన్న ప్రైవసీ ఉండాలి. ఇవి పెద్ద విలాసాలేమీ కావు. కానీ వాటి ధర మాత్రం చాలామందికి విలాసవంతమైనదిగానే కనిపిస్తోంది.
అమెరికన్లు ఆశలు వదులుకోలేదు !
ఇన్ని సమస్యలున్నా సొంతింటి కలను అమెరికన్లు పూర్తిగా వదులుకోలేదు. అద్దెదారుల్లో 16 శాతం మంది ఇప్పటికే ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తున్నారు. మరో 62 శాతం మంది భవిష్యత్తులో కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే తమకు ఇల్లు కొనాలనే ఉద్దేశం లేదని చెప్పారు.
కలలు మాత్రం అందరికీ సమానమే… ధరలు మాత్రం కాదు!
అమెరికాలో ఒకప్పుడు సొంత ఇల్లు ఉండటం విజయానికి గుర్తు. ఇప్పుడు అది ఆర్థికంగా విజయం సాధించినవాళ్లకు మాత్రమే దక్కే బహుమతిలా మారిపోయింది. విచిత్రమేమిటంటే, ఇల్లు కొనాలనుకునే వాళ్ల సంఖ్య తగ్గలేదు. కానీ ఆ కలను నిజం చేసుకునే ధైర్యం మాత్రం చాలామందిలో కనిపించడం లేదు. బహుశా అమెరికన్ డ్రీమ్‌కు ఇప్పుడు ఒక కొత్త అర్థం వచ్చిందేమో… సొంత ఇంటి గురించి కలలు కనడం ఉచితం, కానీ ఆ కలను కొనుక్కోవడం మాత్రం చాలా ఖరీదు!
ఫైనల గా … అమెరికా చాలా కాలంగా ప్రపంచానికి ఒక సందేశం ఇస్తోంది: కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. కానీ ఇప్పుడు అక్కడి అద్దెదారులు ఒక చిన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నట్టున్నారు. కష్టపడితే సాధించే వాటిల్లో ఇల్లు ఉందా లేదా? అని.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







