కరోనా కేసు: అమెరికాపై చైనా రూ. 4.80 లక్షల కోట్ల దావా! అసలేంటి ఈ మేటర్?
కరోనా వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి ఆరేళ్లు దాటిపోయింది. లాక్డౌన్లు లేవు, మాస్కుల గొడవ లేదు, వ్యాక్సిన్ల కోసం క్యూలు కూడా లేవు. కానీ ఆ వైరస్ పుట్టుక, దాని వ్యాప్తి చుట్టూ మొదలైన అసలు గొడవ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదు. అప్పట్లో కరోనా వ్యాప్తికి చైనానే కారణమంటూ అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కోర్టుకెక్కింది. ఇప్పుడు చైనా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఎదురుదాడికి దిగింది. ఏకంగా రూ. 4.80 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలంటూ మిస్సోరీపై పరువు నష్టం కేసు వేసింది. ఇప్పటికే ఈ కేసుపై చైనాలోని వుహాన్ కోర్టులో విచారణ కూడా మొదలైంది. అంటే కరోనా కథకు మరో కొత్త లీగల్ సీక్వెల్ మొదలైనట్టే!
అమెరికా ఆరోపణలు.. చైనాకు కోపం!
అసలు చైనాకు ఇంత కోపం ఎందుకొచ్చిందంటే.. కరోనా సమయంలో అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం చేసిన ఆరోపణలే కారణం. చైనా ప్రభుత్వం కరోనా వైరస్ ప్రమాదాన్ని మొదట్లో దాచిపెట్టిందని, మనుషుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపిస్తుందనే విషయాన్ని బయటకు రానివ్వలేదని, హెచ్చరించిన వారిని అడ్డుకుందని అప్పట్లో మిస్సోరీ ఆరోపించింది. అంతేకాదు, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో చైనా విఫలమవడంతో ప్రపంచమంతా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
2020లో అప్పటి మిస్సోరీ అటార్నీ జనరల్ ఎరిక్ ష్మిట్ చైనా ప్రభుత్వంపై అమెరికా కోర్టులో కేసు వేశారు. కరోనా కారణంగా తమ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, ఈ నష్టానికి చైనానే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో చైనా నేషనల్ హెల్త్ కమిషన్, వుహాన్ ప్రభుత్వం, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీని కూడా ప్రతివాదులుగా చేర్చారు.
ఇప్పుడు చైనా కౌంటర్.. ఏకంగా రూ. 4.80 లక్షల కోట్లు!
అమెరికా చేసిన ఆరోపణలతో తమ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని చైనా వాదిస్తోంది. మిస్సోరీకి చెందిన రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని, చైనాపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని, అమెరికాలో చట్టపరమైన చర్యలను కూడా తమను లక్ష్యంగా చేసుకునేందుకు ఉపయోగించుకున్నారని ఆరోపిస్తోంది. దీనివల్ల తమ సంస్థలకు, అధికారులకు భారీ నష్టం జరిగిందని చెబుతోంది.
ఈ నేపథ్యంలో వుహాన్ ప్రభుత్వం, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కలిసి 2025 ఏప్రిల్ 30న మిస్సోరీపై కేసు వేశాయి. తొలుత మాజీ అటార్నీ జనరల్స్ ఎరిక్ ష్మిట్, ఆండ్రూ బెయిలీని కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఆ తర్వాత ప్రస్తుత అటార్నీ జనరల్ క్యాథరిన్ హనవే పేరును కూడా కేసులో చేర్చారు.
చైనా డిమాండ్ చేస్తున్న పరిహారం ఎంతో తెలుసా? 356.437 బిలియన్ యువాన్లు! అంటే సుమారు 53.5 బిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 4.80 లక్షల కోట్లు. ఇక్కడితో ఆగలేదు. అంతర్జాతీయ మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల ద్వారా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని కూడా చైనా కోరుతోంది.
న్యూయార్క్ టైమ్స్ నుంచి యూట్యూబ్ వరకు.. అందరికీ క్షమాపణలు చెప్పాలట!
చైనా డిమాండ్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. కేవలం డబ్బులు చెల్లిస్తే సరిపోదని, తమకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని అంటోంది. అందుకోసం ది న్యూయార్క్ టైమ్స్, CNN, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు యూట్యూబ్‌లో కూడా క్షమాపణలు ప్రచురించాలని కోరింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ, జిన్హువా వంటి మీడియా సంస్థల్లోనూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఈ కేసును వుహాన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు 2025 మే 7న విచారణకు స్వీకరించింది. నవంబర్ 2026లో విడుదలైన కోర్టు ప్రకటన ప్రకారం, నవంబర్ 2026లోనే విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. గత శుక్రవారం కూడా కోర్టు విచారణ నిర్వహించింది.
వుహాన్ ల్యాబ్ చుట్టూ అప్పట్లో అంత రచ్చ ఎందుకు?
ఈ మొత్తం వివాదంలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. కరోనా వైరస్ పుట్టుకపై చర్చ మొదలైనప్పటి నుంచి ఈ ల్యాబ్ పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. వైరస్ సహజంగా పుట్టిందా? ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? అనే ప్రశ్నలతో ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైరస్ ల్యాబ్‌లోనే తయారైందనే ఆరోపణ ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
తమపై కావాలనే కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నారని అప్పట్లో వుహాన్ ల్యాబ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్‌ను తామే తయారు చేశామని, ల్యాబ్ నుంచి లీక్ అయిందని మాత్రమే కాకుండా, తమ పరిశోధకులు, సిబ్బందికి సంబంధించి కూడా ఎన్నో తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొంది. తమ సంస్థను చైనా సైన్యం స్వాధీనం చేసుకుందనే ప్రచారం కూడా జరిగిందని ఆరోపించింది.
అమెరికా కోర్టులో చైనాకు ఇప్పటికే ఎదురుదెబ్బ!
ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. 2025 మార్చిలో అమెరికా ఫెడరల్ కోర్టు మిస్సోరీకి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. కరోనా వ్యాప్తి తొలినాళ్లలో చైనా ప్రభుత్వం సమాచారాన్ని దాచిపెట్టడం, రక్షణ పరికరాలను పెద్ద ఎత్తున నిల్వ చేసుకోవడం వంటి అంశాలకు బాధ్యత వహించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో మిస్సోరీకి అనుకూలంగా 24.5 బిలియన్ డాలర్ల డిఫాల్ట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. అంటే సుమారు రూ. 2.20 లక్షల కోట్లు.
ఏదైమైనా…
కరోనా సమయంలో ఎవరు తప్పు చేశారనే ప్రశ్నకు ఇప్పటికీ ప్రపంచానికి స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఆ వైరస్ కారణంగా జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహించాలనే విషయంలో మాత్రం అమెరికా, చైనా రెండూ ఒకదానిపై మరొకటి వేలెత్తి చూపిస్తున్నాయి. వైరస్ ప్రపంచాన్ని వదిలేసింది.. కానీ దాని పేరుతో మొదలైన బిలియన్ల డాలర్ల పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల







