ఆక్లాండ్ నెట్స్‌లో శుభ్‌మన్ గిల్ సరికొత్త ప్రయోగం..!
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్‌ను ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుని మంచి జోష్‌లో ఉంది. అయితే, రాబోయే వన్డే సిరీస్ సన్నద్ధత కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆక్లాండ్‌లో జట్టుతో చేరడంతో నెట్స్ ప్రాక్టీస్ సెషన్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాక్టీస్ సెషన్లో భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ధరించిన ఒక సరికొత్త పరికరం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
జొమాటో అధినేత దీపిందర్ గోయల్ స్థాపించిన, ఇంకా మార్కెట్లోకి విడుదల కాని ‘టెంపుల్’ (Temple) అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫిట్నెస్ ట్రాకింగ్ పరికరాన్ని గిల్ తన నుదుటిపై ధరించి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గిల్ ఈ పరికరాన్ని ధరించి ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లతో కలిసి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. ప్రాక్టీస్ ప్రారంభించడానికి ముందు గిల్.. రాబోయే సిరీస్ వ్యూహాలు, జట్టు సమీకరణాలపై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో సుదీర్ఘంగా చర్చలు జరపడం గమనార్హం.
ఇంకా బహిరంగ మార్కెట్లోకి రాని ఈ సరికొత్త స్మార్ట్ డివైజ్‌ను గతంలో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ధరించి కనిపించారు. కంటి పైభాగంలో నుదుటి చుట్టూ ధరించే ఈ పరికరం.. తీవ్రమైన శారీరక శ్రమ లేదా ఒత్తిడి సమయంలో మెదడుకు జరిగే రక్తప్రసరణ, నాడీ వ్యవస్థ ప్రతిస్పందనలు, మానసిక ఒత్తిడి స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. మార్కెట్లో ఇప్పటికే లభిస్తున్న స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ రింగుల కంటే ఇది ఎలా భిన్నంగా పనిచేస్తుందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పటికే ఆక్లాండ్ చేరుకోగా, విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.








