ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు..!
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ నేరుగా హాజరుకాగా.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో(Pawan Kalyan) పాటు మిగిలిన మంత్రులందరూ వర్చువల్ పద్ధతిలో ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సాగిన ఈ మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ ముందుకు వచ్చిన 45కు పైగా అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, మొత్తం 48 కీలక ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
రాష్ట్రంలో ఉగ్రరూపం దాల్చిన ‘అర్నాబ్’ తుఫాన్ సృష్టించిన బీభత్సం, వరద నష్టంపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా సమీక్షించారు. తుఫాన్ ధాటికి సర్వస్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున పూర్తిగా అండగా నిలబడాలని, సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. బాధితుల పునరావాసం, మౌలిక వసతుల పునరుద్ధరణ విషయంలో ఎలాంటి నిధుల కొరత లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల బలోపేతానికి ఈ కేబినెట్ సమావేశంలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రైతన్నలకు అండగా నిలుస్తూ ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ గ్యారంటీని పొడిగిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కృష్ణా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనుల కోసం రూ. 698.90 కోట్ల భారీ నిధులను కేబినెట్ మంజూరు చేసింది. వీటితో పాటు చిత్తూరు జిల్లాలో సాగునీటి రంగానికి ఊతమిచ్చేలా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల ప్రతిపాదనలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ‘ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024’ (AP Clean Energy Policy-2024) లో కాలానికి అనుగుణంగా చేయాల్సిన కీలక మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా కర్నూలు జిల్లాలో భారీ పవన విద్యుత్ (Wind Power) ప్రాజెక్టు ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఏపీ వృద్ధిరేటును పరుగులు పెట్టించేలా ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు సాగుతున్నాయి.








