లాస్ ఏంజిల్స్ భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో.. ఘనంగా ఆయుర్వేద దినోత్సవం
లాస్ ఏంజిల్స్‌లో భారత కాన్సులేట్ జనరల్ (CGI) ఆధ్వర్యంలో ‘ఆయుర్వేద దినోత్సవం 2026’ వేడుకలు అక్టోబర్ 24న అత్యంత ఘనంగా జరిగాయి. ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విధాన ప్రాశస్త్యాన్ని, ఆధునిక ఆరోగ్య సంరక్షణలో దాని అవసరాన్ని ఈ సందర్భంగా ప్రముఖులు వివరంగా చర్చించారు.
“ప్రజలు, భూగోళం, నివారణ” థీమ్‌తో వేడుకలు..
ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని “ప్రజలు, భూగోళం, నివారణ” (People, Planet, Prevention) అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహించారు. వ్యాధులు రాకుండా ముందుగానే అరికట్టడం, ప్రకృతితో ముడిపడిన జీవనశైలిని అలవర్చుకోవడం, సమగ్ర ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేదం పోషించే కీలక పాత్రను ఈ వేడుక ప్రత్యేకంగా చాటిచెప్పింది.
పద్మభూషణ్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ ప్రత్యేక ఆకర్షణ..
ఈ వేడుకల్లో ప్రముఖ వేద పండితుడు, ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్’ వ్యవస్థాపక డైరెక్టర్, పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ డేవిడ్ ఫ్రాలీ (పండిట్ వామదేవ శాస్త్రి) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాలకు ఆయుర్వేదం, యోగా, వేదాంతజ్ఞానాన్ని పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. ఆయనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగాచార్య యోగిని శంభవి జీ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. భక్తి యోగా, మంత్ర యోగా, ఆయుర్వేద సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఆమె పాత్రను సదస్సు కొనియాడింది.

ఆకట్టుకున్న ప్యానెల్ చర్చలు, యోగా సెషన్లు..
ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచేందుకు పలువురు నిపుణులతో రెండు ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించారు. డాక్టర్ షీలా గోవిందరాజన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొదటి ప్యానెల్లో వైద్య జయగోపాల్ పర్ల, మంజుష వింజామూరి, డాక్టర్ కుణాల్ కపూర్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వైద్య రాజేష్ కన్వర్ నేతృత్వంలోని రెండో ప్యానెల్లో ఎస్. ప్రసాద్ వింజామూరి, అనుపమ కిళక్కెవీట్టిల్, భారతి వెంకటాచలపతి పాల్గొన్నారు. వీటితో పాటు డాక్టర్ మెలీనా ఇంటరాక్టివ్ సెషన్, ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు నిర్వహించిన వెల్నెస్ సెషన్లు సభను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆయుర్వేద ప్రదర్శన శాలలు..
ఈ కార్యక్రమంలో భాగంగా భారత సాంప్రదాయ ఉత్పత్తులు, చికిత్సలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో ఇండియా-యుఎస్ ట్రేడ్ పోర్టల్ , చిరుధాన్యాల (Millets) ప్రాముఖ్యతను వివరించే స్టాల్స్‌ను ప్రదర్శించారు. అలాగే ఆత్రేయ హెర్బ్స్, ఇషా ఫౌండేషన్, చండిక, రస్వేద హీలింగ్, NAMACB వంటి పలు ఆయుర్వేద, ఆరోగ్య సంస్థలు తమ ఉత్పత్తులు , సేవలపై సందర్శకులకు అవగాహన కల్పించాయి. 
నిపుణులకు కాన్సుల్ జనరల్ అభినందనలు..
భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ కే.జే. శ్రీనివాస ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు, పరిశోధకులు, నిపుణుల సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. సాంప్రదాయ వైద్య రంగాన్ని ప్రపంచస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు వారు చేస్తున్న కృషిని అభినందించారు. అమెరికాలో భారతీయ ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదంపై మరింత అవగాహన పెంచేందుకు లాస్ ఏంజిల్స్ కాన్సులేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.








