ఏపీ పారిశ్రామిక రంగానికి బిగ్ బూస్ట్..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పారిశ్రామిక పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వానికి మరో పెద్ద విజయం దక్కింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుండి కీలక అనుమతులు లభించాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ (EAC) పర్యావరణ అనుమతులతో పాటు తీరప్రాంత నియంత్రణ మండలి క్లియరెన్స్‌ను కూడా మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు.
కావలి, గుడ్లూరు మండలాల పరిధిలో సుమారు 5,200 ఎకరాల విస్తీర్ణంలో రూ.1.03 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఈ మెగా రిఫైనరీ ప్రాజెక్టును బీపీసీఎల్ నిర్మించనుంది. వార్షికంగా 9 మిలియన్ టన్నుల ముడి చమురు శుద్ధి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి రవాణా ఇంధనాలతో పాటు ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మరియు ఇతర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే పెట్రోకెమికల్ ఉత్పత్తులను భారీగా తయారు చేస్తారు.
అంతేకాకుండా, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరుల కోసం ప్రత్యేక జోన్లను మరియు రామాయపట్నం పోర్టుతో అనుసంధానిస్తూ ఒక భారీ ముడి చమురు టెర్మినల్‌ను కూడా ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణపరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసేందుకు పర్యావరణ నిర్వహణ ప్రణాళిక కోసం రూ.3,022 కోట్లు, చుట్టుపక్కల గ్రామాల కార్పొరేట్ పర్యావరణ బాధ్యత కార్యక్రమాల కోసం రూ.54 కోట్లు కేటాయించారు. నిర్మాణ సమయంలో దాదాపు 14,000 మందికి, ఆ తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అన్ని రకాల మేజర్ అనుమతులు రావడంతో, ఈ మెగా ప్రాజెక్టు పనుల ప్రారంభానికి త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీని దేశంలోనే ఒక ప్రధాన ఎనర్జీ హబ్‌గా మార్చడంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలక పాత్ర పోషించనుందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








