‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ త్రివిక్రమ్ గారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది: శ్రీనిధి శెట్టి
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. దీపావళి వెలుగులను కాస్త ముందుగానే తీసుకొస్తూ అక్టోబర్ 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక శ్రీనిధి శెట్టి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమాకు ఓకే చెప్పడానికి మిమ్మల్ని ఎక్సైట్ చేసిన అంశం ఏమిటి?
– త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక నాకు ముందు నుంచి ఉంది. అలాంటిది ఆయన నుంచి పిలుపు రావడం సంతోషంగా అనిపించింది. పైగా ఇది త్రివిక్రమ్ గారికి, వెంకటేష్ గారికి కూడా కొత్త జానర్. త్రివిక్రమ్ గారి ఫిల్మోగ్రఫీని గమనిస్తే, ఆయన సినిమాలకు పూర్తి భిన్నంగా ‘ఆదర్శ కుటుంబం’ ఉంటుంది. అందుకే కథ వినగానే ఈ చిత్రంలో ఖచ్చితంగా భాగం కావాలి అనుకున్నాను.
ఇవి కూడా చదవండి
– నాది అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకి నో చెబుదామనే ఆలోచన ఒక్క క్షణం కూడా కలగలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి. అసలు త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారి కాంబినేషన్ అంటేనే ఎంతో స్పెషల్. అలాంటిది వారి కాంబినేషన్ లో ఇంత మంచి సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం.
మీ పాత్ర ఎలా ఉంటుంది? కామెడీ చేయడం ఎలా అనిపించింది?
– త్రివిక్రమ్ గారు చెప్పినట్లు ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటిసారి కామెడీ పాత్ర చేశాను. నేను చిట్ ఫండ్ లో డబ్బులు పోగొడతాను. మొత్తం అప్పులు చేసేస్తాను. ఇప్పటిదాకా ఈ తరహా పాత్రలు చేయకపోవడంతో ఎలా చేస్తాననే సందేహం మొదట కాస్త కలిగినా.. అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది.
త్రివిక్రమ్ గారి డైలాగులు అద్భుతంగా ఉంటాయి. ఆయన డైలాగులు మీరు చెప్పడం ఎలా అనిపించింది?
– త్రివిక్రమ్ గారి డైలాగుల్లో ఎంతో భావం ఉంటుంది. అందుకే ప్రతి డైలాగ్ నేను చెప్పేముందు దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాను. సినిమాలో ఎన్నో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. రైటింగ్ లో ఆయన మ్యాజిక్ కనిపిస్తుంది. ట్రైలర్ లోని “చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్?” అనే డైలాగ్ అయితే నాకు మాత్రమే కాదు, అందరికీ ఎంతగానో నచ్చింది.
సినిమా విడుదల ఆలస్యం కావడంపై ఏమైనా నిరాశ చెందారా?
– ఒక సినిమాపై ఏడాదిన్నర కష్టపడి, అవుట్ పుట్ ను ఇంకా మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పుడు, కంగారుపడి విడుదల చేసే కంటే కాస్త ఆలస్యంగా రావడంలో తప్పులేదు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ గారు కూడా చెప్పారు. మెరుగైన అవుట్ పుట్ కోసమే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 30 కి విడుదల తేదీ మార్చడం జరిగింది. ఈ మూడు వారాల సమయం వల్ల ఆదర్శ కుటుంబం మరింత అందంగా మారింది.
మీరు తక్కువ సినిమాలు చేయడానికి కారణం.?
– కంటెంట్ పరంగా నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ‘ఆదర్శ కుటుంబం’ కూడా నా మనసుకి నచ్చి ఎంపిక చేసుకున్న సినిమానే. అయితే నేను చేస్తున్న పెద్ద సినిమాలు ఏడాది రెండేళ్లు సమయం తీసుకుంటున్నాయి. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నాను అనిపిస్తుంది. ‘ఆదర్శ కుటుంబం’ కూడా 2025 జూలైలో జాయిన్ అయ్యాను. సంవత్సరం దాటి పోయింది.
వెంకటేష్ గారి నటనను మ్యాచ్ చేసే ప్రయత్నం చేశారా?
– వెంకటేష్ గారు అద్భుతమైన నటుడు. కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ కానీ గొప్పగా ఉంటుంది. ఆయనను మ్యాచ్ చేయడం అనేది సాధ్యం కాదు. కానీ, నా వంతుగా ప్రయత్నించాను. ముఖ్యంగా త్రివిక్రమ్ గారి సూచనలతో కామెడీ సన్నివేశాల్లో సహజంగా నటించడానికి ట్రై చేశాను. త్రివిక్రమ్ గారి రైటింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ కలిస్తే కామెడీ ఎంతో సహజంగా ఉంటుంది. ఆ సహజత్వంలో నేను ఇమిడిపోయే ప్రయత్నం చేశాను.
ఆదర్శ కుటుంబం సినిమా చూశారా? ఎలా అనిపించింది?
– ఇటీవలే చూశాను.. చాలా నచ్చింది. ఆదర్శ కుటుంబం సినిమా ఎలా ఉంటుంది అనేది నాకు ముందే తెలుసు. షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమా చూసినప్పుడు అంతకుమించిన ఆనందం కలిగింది.
కామెడీ, యాక్షన్ సమపాళ్లలో ఉంటాయా?
– ఎక్కువగా కామెడీ ఉంటుంది. యాక్షన్ ఎంత మోతాదులో ఉందనేది మీకు చూశాక తెలుస్తుంది. కామెడీ ఎంత ఎంజాయ్ చేస్తారో, యాక్షన్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది.
త్రివిక్రమ్ గారి గురించి?
– త్రివిక్రమ్ గారు ఎంత గొప్ప దర్శకుడు, ఆయన ఎన్ని గొప్ప సినిమాలు ఇచ్చారనేది నాకు ముందే తెలుసు. అయితే త్రివిక్రమ్ గారిని కలిసిన తర్వాత ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి తెలిసింది. త్రివిక్రమ్ గారు మాట్లాడుతుంటే అందరూ ఎందుకు అలా వింటూ ఉండిపోతారో అర్థమైంది. అంత సీనియర్ దర్శకుడైనా సరే సినిమా కోసం చర్చించడానికి ఎప్పుడూ ముందుంటారు. సెట్ లో మంచి వాతావరణం ఉండేలా చూస్తారు. నటీనటులకు కంఫర్ట్ ఇస్తారు.
హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ గురించి?
– ఈ బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నటీనటులకు ఎంతో సపోర్టుగా నిలుస్తారు. ఏడాదికి పైగా సాగిన ఈ మూవీ ప్రయాణం ఎంతో బాగుంది. ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
తదుపరి ప్రాజెక్టులు?
– కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.








