ఇళ్ల ధరలు తగ్గిస్తున్నా కొనేవాళ్లు లేరు.. అమెరికాలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఏమైంది?
అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు వింతైన వాతావరణం కనిపిస్తోంది. ఒకప్పుడు ఇల్లు అమ్మకానికి ఉందంటే చాలు, కొనుగోలుదారులు ఎగబడి అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇల్లు అమ్ముదామంటే వేల డాలర్లు ధర తగ్గించాలి, మరమ్మతుల ఖర్చులు భరించాలి, చివరికి వడ్డీ రాయితీలు కూడా ఆఫర్ చేయాల్సి వస్తోంది. అయినా సరే కొనేనాథుడే కరువయ్యాడు. ఎందుకీ సమస్య మొదలైంది?
డిమాండ్ పడిపోవడానికి అసలు కారణాలు
ఈ సంక్షోభానికి ప్రధాన కారణం గృహ రుణాలపై పెరిగిన వడ్డీ రేట్లు. 2026 ప్రారంభంలో 6 శాతానికి దిగువకు వచ్చిన 30 ఏళ్ల సగటు గృహ రుణ వడ్డీ రేటు, అక్టోబరు నాటికి ఏకంగా 7.4 శాతానికి పెరిగింది. ఇది మూడేళ్లలోనే గరిష్ట స్థాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన నిత్యజీవిత ఖర్చులు తోడవ్వడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది.
గృహాల మధ్యస్థ ధర సెప్టెంబర్ నాటికి $4,19,250 (సుమారు ₹3.5 కోట్లు) కు చేరింది. సుమారు 21 శాతం మంది యజమానులు తమ ఇళ్ల ధరలను తగ్గించుకోగా, 50 ప్రధాన నగరాల్లో అమ్మేవారి సంఖ్య కంటే కొనేవారి సంఖ్య 63 శాతం పడిపోయింది. 2013 తర్వాత కొనుగోలుదారుల సంఖ్య ఈ స్థాయిలో తగ్గిపోవడం ఇదే తొలిసారి.
అమ్మకానికి ఉన్న ఇళ్లు పెరిగాయి.. కొనేవాళ్లు మాత్రం తగ్గిపోయారు!
రియల్టర్.కామ్ గణాంకాల ప్రకారం, 2026 సెప్టెంబర్‌లో అమెరికాలో ఇళ్ల అమ్మకపు ప్రకటనల్లో మధ్యస్థ ధర ఏడాది క్రితంతో పోలిస్తే 1.2 శాతం తగ్గి 4,19,250 డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.3.5 కోట్లు. అంతేకాదు, ఆ నెలలో అమ్మకానికి పెట్టిన ఇళ్లలో దాదాపు 21 శాతం ఇళ్ల యజమానులు మొదట ప్రకటించిన ధరను తగ్గించారు. నాలుగేళ్లలో ఇంత ఎక్కువ ఇళ్ల ధరలు తగ్గించడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి
మరోవైపు, అమెరికాలోని 50 అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతాలపై రెడ్‌ఫిన్ చేసిన విశ్లేషణ ప్రకారం, గత నెలలో కొనుగోలుదారుల కంటే అమ్మకానికి సిద్ధంగా ఉన్నవారి సంఖ్య 63 శాతం ఎక్కువగా ఉంది. కొనుగోలుదారుల సంఖ్య సుమారు 9.29 లక్షలకు పడిపోయింది. 2013 నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల్లో ఇదే అత్యల్ప స్థాయి. అదే సమయంలో అమ్మకానికి ఉన్న ఇళ్ల సంఖ్య 2020 తర్వాత అత్యధిక స్థాయికి చేరింది.
ఈ లెక్కలు చూస్తే అమెరికా హౌసింగ్ మార్కెట్లో అసలు సమస్య ఏమిటో స్పష్టమవుతుంది. ఇళ్లు లేవని కాదు.. కొనడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు తగ్గిపోయారు. ఇళ్ల ధరలు కొంత తగ్గుతున్నా, వాటిని కొనడానికి అవసరమైన ఆర్థిక స్థోమత చాలామందికి లేదు. అందుకే ధర తగ్గింపులు జరుగుతున్నా మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడం లేదు.
కొత్త ఇల్లు కొనడానికి ఒప్పందం కుదిరింది.. పాత ఇల్లు అమ్ముడైతేనే వెళ్లగలరు!
పాత ఇల్లు అమ్మేసి ..పిల్లలందరికీ ప్రత్యేక గదులు ఉండేలా కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకోవాలన్నది చాలా ఆశ. కానీ కొత్త ఇంటికి మారే ముందు ప్రస్తుత ఇంటిని అమ్మాల్సిన అవసరం ఏర్పడుతోంది. అయితే కొనుక్కునేవాళ్లు రావటం లేదు. రేట్లు తగ్గించినా ఫలితం లేదు. కొనుగోలుదారులకు ఇల్లు నచ్చేలా చేయడానికి కొత్త వాటర్ హీటర్, డిష్వాషర్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లోరింగ్‌ను కూడా మార్చుతున్నారు. అయినా అమ్మకం పూర్తికావటం లేదు. దీంతో చాలా కుటుంబాలు తీవ్ర నిరాశకు గురవుతున్నాయి.
కొనుగోలుదారుల చేతికి ఆధిపత్యం
ఈ ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అమెరికా మార్కెట్లో కొనుగోలుదారులకే అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యజమానులు కేవలం ధరలు తగ్గించడమే కాకుండా, కొనుగోలు చేసే సమయంలో అయ్యే ఇతర రుసుములను తామే భరిస్తున్నారు. రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే ఆర్థిక ఆఫర్లను ఇస్తున్నారు. అయితే, వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉండటం మరియు రాబోయే రోజుల్లో ధరలు మరింత తగ్గుతాయనే ఆశతో చాలామంది కొనుగోలుదారులు వేచి చూసే ధోరణినే అవలంబిస్తున్నారు.
ఒకప్పుడు ఇల్లు దొరకడమే కష్టంగా ఉంటే, ఇప్పుడు అమ్మడమే పెద్ద సవాలుగా మారింది. తగ్గిస్తున్న ధరలు కొనుగోలుదారులకు పూర్తిస్థాయిలో ఊరటనివ్వకపోవడం, ఇళ్లు అమ్ముడవక యజమానుల జీవితాలు ముందడుగు వేయకపోవడంతో అమెరికా రియల్ ఎస్టేట్ రంగానికి త్వరలోనే స్పష్టమైన మార్గం దొరుకుతుందో లేదో వేచి చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








