విమానంలో వీరంగం సృష్టించిన హాలీవుడ్ నటి.. సిబ్బందిపై దాడి, ఎఫ్‌బీఐ దర్యాప్తునకు ఆదేశం
హాలీవుడ్ ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ విమాన ప్రయాణంలో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. లాస్ ఏంజెలెస్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఆమె తీవ్రంగా ప్రవర్తించారు. విమాన సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కొరికినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె అనుచిత ప్రవర్తన కారణంగా ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లు గాయపడినట్లు సమాచారం.
పోలీసుల అదుపులో నటి..
ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం చేరుకున్న వెంటనే భద్రతా సిబ్బంది , పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరుపుతోంది. విమానంలో ఒక ప్రయాణికురాలు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే సమాచారం అందడంతో ల్యాండింగ్ అయిన వెంటనే అధికారులు అక్కడకి చేరుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లలో ఒకరిని తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సెల్మా బ్లెయిర్ను కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
అదే కారణమా?
నాడీ సంబంధిత సమస్యలకు వాడే మందులు సకాలంలో తీసుకోకపోవడం, విమాన ప్రయాణంలో తలకు గాయం కావడంతోనే సెల్మా బ్లెయిర్ తీవ్ర అయోమయానికి గురయ్యారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. విరామం లేని పని అలసట , తలకు తగిలిన గాయం ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపాయని, ఇది ఆమె ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జనవరి 19న జరగనుంది. ప్రయాణికులు , సిబ్బంది భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, విమానంలో చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఎలాంటి సహనం చూపబోమని డెల్టా ఎయిర్ లైన్స్ స్పష్టం చేసింది.
గతంలోనూ వివాదాలు..
సెల్మా బ్లెయిర్‌కు విమానంలో ఇలాంటి సంఘటన ఎదురుకావడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2016లో మెక్సికోలోని కాంకున్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు వెళ్తున్న విమానంలోనూ ఆమె అసాధారణంగా ప్రవర్తించారు. ఆ సమయంలో మద్యం, మందులు కలిపి తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోయి నియంత్రణ కోల్పోయానని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత 2018లో తనకు నాడీ వ్యవస్థను దెబ్బతీసే మల్టిపుల్ స్క్లెరోసిస్(MS) వ్యాధి ఉన్నట్లు ఆమె వెల్లడించారు. క్రూయెల్ ఇంటెన్షన్స్, లీగల్లీ బ్లౌండ్, హెల్‌బాయ్ వంటి ప్రముఖ చిత్రాలతో ఆమె హాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.








