పెళ్లిళ్లు కావడం లేదనే… ప్రభుత్వం స్కూళ్లలో పాఠంగా ఈ ప్రేమ నవల?
చైనాలో పెళ్లిళ్లు చేసుకునేందుకు యువత ఆసక్తి చూపించడం లేదనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు జనాభా పెరుగుదలను అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధించిన ఆ దేశం.. ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకోండి, పిల్లలను కనండి అంటూ ప్రజలను ప్రోత్సహించాల్సిన పరిస్థితి వచ్చింది. జననాల సంఖ్య పడిపోవడం, వివాహాలు తగ్గిపోవడం, విడాకులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితుల్లో యువత ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం మరో మార్గాన్ని ఎంచుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యార్థులందరూ చదవాల్సిన పుస్తకాల జాబితాలో ప్రసిద్ధ ఆంగ్ల నవల ‘జేన్ ఐర్’ ను చేర్చింది. ఈ నవల్లో ఏముంది. దీని ప్రభావం ఏమైనా ఉంటుందా?
పెళ్లిళ్లు తగ్గుతున్నాయి.. చైనాలో పెరుగుతున్న ఆందోళన
చైనా ఇప్పుడు తీవ్రమైన జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. గతంలో జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు కఠినమైన జనన పరిమితులను అమలు చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం జననాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దేశంలో యువత వివాహాల పట్ల ఆసక్తి తగ్గడం, పిల్లలను కనాలనే ఆలోచనను వాయిదా వేయడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి.
2026 ప్రథమార్ధంలో చైనాలో వివాహాల సంఖ్య 7.5 శాతం తగ్గగా, విడాకుల సంఖ్య 3.9 శాతం పెరిగినట్లు కథనం పేర్కొంది. ఇక గత ఏడాది నమోదైన జననాల సంఖ్య దశాబ్దం క్రితం ఉన్న స్థాయిలో సగం కంటే తక్కువకు పడిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో దేశ జనాభా గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి.
ఈ పరిస్థితిని మార్చేందుకు చైనా ప్రభుత్వం ‘జననాలకు అనుకూలమైన సమాజం’ నిర్మించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతోంది. అయితే, యువతను పెళ్లిళ్ల వైపు, కుటుంబ జీవితంవైపు ఎలా ఆకర్షించాలన్నది ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే పాఠశాలల్లో బోధించే సాహిత్యంపై కూడా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
విద్యార్థులకు ‘జేన్ ఐర్’ తప్పనిసరి.. ఎందుకీ నిర్ణయం?
షార్లెట్ బ్రాంటే రచించిన ‘జేన్ ఐర్’ నవల 19వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఆంగ్ల సాహిత్య రచన. సెప్టెంబర్ నుంచి చైనాలోని సెకండరీ స్కూల్ విద్యార్థులందరూ ఈ నవలను చదవాల్సిన పుస్తకంగా చేర్చింది.
సాధారణంగా ఒక సాహిత్య రచనను పాఠ్యాంశంగా చేర్చడం వెనుక దాని సాహిత్య విలువ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు వంటి అంశాలు ఉంటాయి. అయితే, ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న వివాహాలు, జననాల సంక్షోభం నేపథ్యంలో ఈ నవల ఎంపిక చర్చనీయాంశమైంది.
యువతలో వివాహం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అలాగే ఈ నవలలోని వ్యక్తిత్వం, సమానత్వం, ప్రేమకు సంబంధించిన సందేశాలను విద్యార్థులకు పరిచయం చేయడమే లక్ష్యమన అంటున్నారు.
ఇంతకీ ‘జేన్ ఐర్’ నవలలో ఏముంది?
జేన్ ఐర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఎన్నో కష్టాలు, అవమానాల మధ్య పెరుగుతుంది. చదువు పూర్తయ్యాక ఎడ్వర్డ్ రోచెస్టర్ అనే సంపన్నుడి ఇంట్లో గవర్నెస్‌గా ఉద్యోగంలో చేరుతుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. సామాజిక హోదా, ఆస్తిపాస్తుల్లో ఇద్దరికీ ఎంతో తేడా ఉన్నా.. వారి మనసులు దగ్గరవుతాయి.
ఇవి కూడా చదవండి
చివరకు రోచెస్టర్‌ను పెళ్లి చేసుకోవడానికి జేన్ సిద్ధమవుతుంది. కానీ పెళ్లి సమయంలో అతడి జీవితానికి సంబంధించిన ఓ రహస్యం బయటపడుతుంది. దీంతో వివాహం ఆగిపోతుంది. రోచెస్టర్‌ను గాఢంగా ప్రేమిస్తున్నప్పటికీ, తన విలువలకు విరుద్ధంగా జీవించడానికి జేన్ నిరాకరిస్తుంది. అతడిని విడిచిపెట్టి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న జేన్ తన జీవితాన్ని తానే నిర్మించుకుంటుంది. కాలక్రమంలో రోచెస్టర్ జీవితంలోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. చివరకు ఇద్దరూ మళ్లీ కలుసుకుని వివాహం చేసుకుంటారు.
ఈ నవలకూ పెళ్లిళ్లకూ లింకేంటి?
ఇక్కడే అసలు ఆసక్తికరమైన అంశం ఉంది. చైనాలో వివాహాల సంఖ్య తగ్గుతున్న సమయంలో, ప్రేమను సామాజిక హోదా లేదా సంపదతో కాకుండా పరస్పర గౌరవం, సమానత్వంతో చూడాలని చెప్పే నవలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు.
బీజింగ్‌కు చెందిన అధికారిక వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసం కూడా ఈ కోణాన్ని ప్రస్తావించింది. జేన్ ఐర్ కథలో నిజమైన ప్రేమకు సంపద, అందం, సామాజిక స్థాయి ప్రామాణికాలు కావని, పరస్పరం సమానులుగా భావించుకోవడమే ముఖ్యమని వివరించింది. వ్యక్తులు ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకున్నప్పుడే సంతోషకరమైన సంబంధాన్ని నిర్మించుకోగలరన్నది ఈ నవలలోని ముఖ్యమైన భావనగా పేర్కొంది.
డబ్బు, హోదా కంటే ప్రేమే ముఖ్యమా?
చైనాలో ఎక్కువ శాతం యువతులు, యువకులు వివాహం విషయంలో ఆర్థిక భద్రత, జీవన వ్యయం, భవిష్యత్తు బాధ్యతలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. పిల్లల పెంపకం ఖర్చులు, పని ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు కూడా పెళ్లి నిర్ణయాలపై ప్రభావం చూపెడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ, పరస్పర గౌరవం, సమానత్వం గురించి చెప్పే నవల యువతకు ఉపయోగపడుతుందని భావిస్తోంది ప్రభుత్వం. కానీ వివాహాల సంఖ్య తగ్గడానికి కారణం కేవలం ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం కాదు. ఆర్థిక, సామాజిక పరిస్థితులు కూడా కీలకమైనవి.
అందుకే ‘జేన్ ఐర్’ను పాఠ్యాంశంగా చేర్చడాన్ని పెళ్లిళ్లు పెంచేందుకు ప్రభుత్వం వేసిన ప్రత్యక్ష వ్యూహంగా చెప్పాలి.
మైక్రోడ్రామాలపై ఆంక్షలు.. సాహిత్యంపై ప్రోత్సాహం
యువత ఆలోచనలపై ప్రభావం చూపుతున్న మరో అంశం చైనాలో ప్రజాదరణ పొందిన మైక్రోడ్రామాలు. తక్కువ నిడివి కలిగిన ఈ వీడియో కథల్లో సంపన్నులైన కంపెనీ అధిపతులు పేద యువతులను ప్రేమించి, వారి జీవితాలను మార్చే కథాంశాలు తరచుగా కనిపిస్తాయి.
సామాజికంగా ఎదగడం కష్టమవుతోందని భావించే యువతకు ఇలాంటి కథలు ఆకర్షణీయంగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డబ్బు పట్ల వ్యామోహాన్ని ప్రోత్సహించే, వివాహ సంబంధాలను వక్రీకరించే కంటెంట్‌పై చర్యలు తీసుకునేందుకు చైనా ప్రభుత్వం జూన్‌లో రెండు నెలల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఒకవైపు ఇటువంటి వీడియో కథలపై నియంత్రణలు, మరోవైపు ప్రేమలో సమానత్వం, వ్యక్తిగత గౌరవం గురించి చెప్పే సాహిత్యానికి ప్రాధాన్యం.. ఈ పరిణామాలు చైనాలో యువత విలువలు, కుటుంబ వ్యవస్థపై జరుగుతున్న చర్చను ప్రతిబింబిస్తున్నాయి.
చైనాలో ‘జేన్ ఐర్’కు పాత చరిత్రే ఉంది
‘జేన్ ఐర్’ను చైనా ఇప్పుడు కొత్తగా పరిచయం చేయడం లేదు. ఈ నవల చైనీస్ అనువాదం తొలిసారిగా 1917లో వెలువడింది. మావో మరణం తర్వాత 1976లో చైనాలో ప్రదర్శించిన తొలి చిత్రాల్లో ఈ నవల ఆధారంగా రూపొందించిన సినిమా కూడా ఒకటి. బ్రిటన్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సైతం ఈ నవలను ప్రస్తావించారు. ఇటీవల బీజింగ్‌లో దీని ఆధారంగా రూపొందించిన సంగీత నాటకం కూడా ప్రదర్శితమైంది.
అంటే, చైనాలో ఈ నవలకు ఇప్పటికే సుదీర్ఘమైన సాహిత్య, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతం జనాభా సంక్షోభం కొనసాగుతున్న సమయంలో విద్యార్థుల పాఠ్యాంశాల్లో దీనికి ప్రాధాన్యం లభించడం కొత్త చర్చకు కారణమైంది.
పుస్తకాలు చదివిస్తే పెళ్లిళ్లు పెరుగుతాయా?
యువత ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి, జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అనే అంశాలపై సాహిత్యం ప్రభావం చూపవచ్చు. కానీ పెళ్లిళ్లు తగ్గడానికి కారణమైన ఆర్థిక ఒత్తిళ్లు, జీవన వ్యయాలు, ఉద్యోగ పరిస్థితులు, కుటుంబ బాధ్యతల వంటి సమస్యలను పుస్తకాలు మాత్రమే పరిష్కరించలేవు.
‘జేన్ ఐర్’ చెప్పే సందేశం కూడా కేవలం పెళ్లి చేసుకోవాలనే పిలుపు కాదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, సమానత్వం ఉన్న సంబంధాన్ని ఎంచుకోవాలన్నది దాని ప్రధాన భావన. అందువల్ల ఈ నవల యువతను పెళ్లిళ్ల వైపు నడిపిస్తుందా లేదా అన్నది స్పష్టంగా చెప్పలేం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








