రివ్యూ: వినోదాత్మకంగా ‘రూపాయనమహా’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ :చిత్ర వేద ప్రొడక్షన్స్
నటీనటులు: అరవింద్ పాండ్రేట్, వేణు పోల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కాని,
క్రాక్ శ్రీమణి, విషన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి తదితరులు
సంగీతం: రిషి ఎం, సినిమాటోగ్రఫీ : జింక వరుణ్ నాయుడు
ఎడిటింగ్: రవితేజ గిరిజాల, నిర్మాత: పవని సాగి
దర్శకుడు: అరవింద్ రెడ్డి
విడుదల తేది : 02.10.2026
నిడివి : 2 ఘంటల 28నిముషాలు
భారీ తారాగణం, హంగామా లేకుండా చిన్న సినిమాగా నిశ్శబ్దంగా వచ్చి, తన సహజమైన కథనం, పల్లెటూరి నేపథ్యం, మనుషుల మధ్య ఉండే సాధారణ సంఘర్షణతో ఆకట్టుకునే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ‘రూపాయనమహా’ అలాంటి సినిమానే. దర్శకుడుగా అరవింద్ రెడ్డి తొలిసారిగా తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు అక్టోబర్ 2న ధియేటర్ లలో విడుదలైంది. ఈ రోజు విడుదలైన 5 చిత్రాలలో చిన్న చిత్రమైన ‘రూపాయనమహా’ ప్రేక్షకుడిని ఆకట్టుకుందా? లేదా? సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ చిత్రానికి ప్రధాన బలం చాలా ఆసక్తికరమైన కథాంశం. ఒక పేద కుటుంబం చేతికి అనుకోకుండా జీవితాన్ని మార్చేసేంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తే… అదే డబ్బు కళ్లముందే చేజారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ఆలోచన చుట్టూ సినిమా సాగుతుంది. హరి నారాయణ (అరవింద్ పాండ్రేట్) ఒక సాధారణ మధ్యతరగతి పల్లెటూరి వ్యక్తి. తల్లి, భార్య, చిన్న కూతురితో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తూ, రోజువారీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటాడు. అప్పుల భారం పెరిగిపోతున్న సమయంలో అతని జీవితంలో అనుకోని అదృష్టం తలుపు తడుతుంది. అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు ఏకంగా రూ. కోటి జాక్‌పాట్ తగులుతుంది. కోటీశ్వరుడయ్యాననే ఆనందం క్షణాల్లోనే ఆందోళనగా మారుతుంది. ఎందుకంటే… అసలు కారణం లాటరీ టికెట్ కనిపించదు. కుటుంబ సభ్యులంతా ఇంట్లోని ప్రతి మూలనూ వెతుకుతుండగా, హరి ఫోన్‌కు ఒక కాల్ వస్తుంది. అవతలి వ్యక్తి ఎవరో తెలియదు. అతని దగ్గరే ఆ విలువైన లాటరీ టికెట్ ఉందని చెబుతాడు. కానీ టికెట్ తిరిగి ఇవ్వాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. లాటరీ అమౌంట్ ఇవ్వడానికి గడువు గడిచిపోతుండగా, హరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎత్తుగడలను ఎలా ఎదుర్కొన్నాడు? తన అదృష్టాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో పల్లెటూరి గాసిప్‌లు, కుటుంబ కలహాలు, అనుకోని పరిణామాలు ఎలాంటి గందరగోళాన్ని సృష్టించాయి? అనేదే మిగతా కథ.
నటీనటుల హావభావాలు :
ఈ సినిమాలో కొత్త తరహా నటీనటుల ఎంపిక సినిమాకు బాగా కలిసొచ్చింది.అరవింద్ పాండ్రేట్ పోషించిన హరి పాత్రలో ఎలాంటి హీరోయిజం కనిపించదు. ఒక సాధారణ వ్యక్తి అకస్మాత్తుగా ఎదుర్కొనే ఆందోళన, భయం, నిస్సహాయతను సహజంగా చూపించారు. శ్రావణి మల్కాని, వేణు పోల్సాని, డి. అనుదీప్ తదితరులు కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా సహజమైన నటనను అందించారు. వారి సంభాషణలు, హావభావాలు పల్లెటూరి వాతావరణానికి సహజంగా సరిపోయాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు అరవింద్ రెడ్డి ఈ పాయింట్‌ను పెద్దగా హంగామా చేయకుండా, సహజమైన పల్లెటూరి వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేశారు. జింక వరుణ్ నాయుడు ఛాయాగ్రహణం సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాన్ని అతిగా రంగులు అద్దకుండా, సింపుల్‌గా, వాస్తవికంగా చూపించారు. రిషి ఎం అందించిన నేపథ్య సంగీతం హాస్యంతో కూడిన ఉత్కంఠభరిత సన్నివేశాలకు చక్కగా సరిపోయింది. రవితేజ గిరిజాల ఎడిటింగ్ కూడా కథలోని ప్రధాన సమస్యపై దృష్టి నిలిపేలా సింపుల్‌గా, పర్ఫెక్ట్ గా ఉంది.
విశ్లేషణ :
అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు వస్తే జీవితం మారిపోతుందనే ఆలోచన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే అంశం. ‘రూపాయనమహా’ ఒక నిజాయితీతో కూడిన, హాయిగా సాగిపోయే పల్లెటూరి థ్రిల్లర్. ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు, భారీ హంగులు లేదా బలవంతంగా ఇరికించిన కామెడీపై ఆధారపడకుండా, సాధారణ మనుషులు అనుకోకుండా ఎదుర్కొనే అసాధారణ పరిస్థితిని ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేశారు.సినిమా అసలు కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకుంటుంది. ప్రారంభంలో ఇంట్లో జరిగే గందరగోళం, లాటరీ టికెట్ కోసం పదేపదే చేసే వెతుకులాట కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సినిమాలోని సహజమైన, సింపుల్ ట్రీట్మెంట్ ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తక్కువ బడ్జెట్ ప్రభావం కనిపిస్తుంది. ఇంటి చుట్టూ లాటరీ టికెట్ కోసం జరిగే వెతుకులాట దాటి కథ పల్లెటూరిలోకి వెళ్లిన తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. అలాగే కొన్ని సహాయ పాత్రలను మరింత బలంగా తీర్చిదిద్దితే సినిమా ఇంకా ఆసక్తికరంగా మారే అవకాశం ఉండేది. హరి, ఫోన్లో మాట్లాడే ఆ అజ్ఞాత వ్యక్తి మధ్య జరిగే మానసిక పోరాటం ఆసక్తిని పెంచుతుంది. చివరికి కథను చక్కగా ముగించే విధంగా క్లైమాక్స్‌ను తీర్చిదిద్దారు. కథలోని అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ముగింపు ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. కాన్సెప్ట్ బాగున్నాబడ్జెట్ పరిమితులు కనిపించిన సందర్భాలు అనేకం కనిపించాయి. చిన్న సినిమా కదా? మరి….చివరఖరుకు చెప్పాలంటే…. సాధారణ మనుషులు, పల్లెటూరి జీవితం, కుటుంబ సంబంధాలు, కొద్దిపాటి హాస్యం, ఉత్కంఠ కలగలిపిన కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘రూపాయనమహా’ ఒకసారి హాయిగా చూడదగిన సినిమాగా నిలుస్తుంది.








