అలుగునూర్ వేదికగా ఉద్యమ జ్ఞాపకాల పునరుజ్జీవం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో చరిత్ర గతిని మార్చిన అత్యంత కీలకమైన ఘట్టం నవంబర్ 29. “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే తెగింపు నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అలుగునూర్ సాక్షిగా నిలిచింది. సరిగ్గా ఆ చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ, ఈ నెల 29న అలుగునూర్ వేదికగా ‘దీక్షా దివస్’ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
2009 నవంబర్ 29న కరీంనగర్ నుంచి దీక్షా స్థలికి బయలుదేరిన కేసీఆర్‌ను అలుగునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం తరలించడం నాటి ఉద్యమంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఖమ్మంలో, ఆ తర్వాత నిమ్స్ ఆసుపత్రిలో కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నా మొక్కవోని దీక్షను కొనసాగించడం వల్ల తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చింది. ప్రజా ఉద్యమ ఒత్తిడికి తలొగ్గిన నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చారిత్రక ప్రకటన చేశారు. అయితే ఆంధ్రా నాయకుల ఒత్తిడితో డిసెంబర్ 23న కేంద్రం తన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. డిసెంబర్ 9 హామీకి ‘ట్రిగ్గర్ పాయింట్’ అయిన నవంబర్ 29ని పార్టీలకు అతీతంగా తెలంగాణ సమాజమంతా ఒక చారిత్రక దినోత్సవంగా జరుపుకుంటోంది.
ఇవి కూడా చదవండి
అలుగునూర్ సభను విజయవంతం చేసేందుకు కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. దీక్షా దివస్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
సభకు భారీ ఎత్తున ప్రజలు, వాహనాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని గంగుల కమలాకర్ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించి జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. సభ జరిగే నవంబర్ 29 వరకు వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ బొట్టు పెట్టి ఆహ్వానించడం, డప్పు కొట్టే కార్యక్రమాలు, వాల్ రైటింగ్, కరపత్రాల పంపిణీతో పాటు సోషల్ మీడియా వేదికగా దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
బహిరంగ సభ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సన్నాహక సమావేశం అనంతరం బీఆర్ఎస్ ముఖ్య నేతలు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ లను కలిసి అలుగునూర్ సభకు అనుమతులు ఇవ్వాలని వినతిపత్రాలు సమర్పించారు. మొత్తంమీద, ఉద్యమ గడ్డపై జరుగుతున్న ఈ దీక్షా దివస్ సభ ద్వారా నాటి పోరాట స్ఫూర్తిని మరోసారి చాటిచెప్పేందుకు గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి.







