ఖైరతాబాద్ ఉపఎన్నికపై మరో ట్విస్ట్!
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుందా.. జరగదా.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడింది. దీనిని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఈ స్థానం ఖాళీ అయినట్లు అధికారిక గెజిట్ వెలువడింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా తెరపైకి వచ్చిన న్యాయపరమైన చిక్కులు ఈ ఎన్నికల ప్రక్రియకు పెద్ద బ్రేక్ వేశాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి.. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దానంపై అనర్హత వేటు పడినప్పటికీ, తన పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక నిర్వహించవద్దని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు నిర్ణయం వెలువడే వరకు తాము ఎలాంటి ఉపఎన్నిక నిర్వహించలేమని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఒకవేళ కోర్టు విచారణలో దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తీర్పు వస్తే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన విజయారెడ్డిని నేరుగా ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుందన్న వాదన తెరపైకి వచ్చింది.
ఇవి కూడా చదవండి
విజయారెడ్డి వాదనను బీజేపీ సీనియర్ నేత, అప్పట్లో మూడో స్థానంలో నిలిచిన చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. 2023 ఎన్నిక కేవలం ఇద్దరి మధ్య జరిగిన పోరు కాదని, అది బహుముఖ పోటీ అని ఆయన వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం.. బహుముఖ పోటీలో విజేత ఎన్నిక రద్దయితే, రెండో స్థానంలో ఉన్న వ్యక్తిని నేరుగా గెలిచినట్లు ప్రకటించడం చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఓడిపోయిన అభ్యర్థికి నేరుగా పదవి కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ప్రజల అభిప్రాయాన్ని మళ్లీ కోరేందుకు ఉపఎన్నిక ఒక్కటే మార్గమని వాదిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారం వెనుక ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహాలు వేర్వేరుగా ఉన్నాయి. ఉపఎన్నికల పోరును ఎదుర్కొనే కంటే, న్యాయపరమైన ప్రక్రియ ద్వారా విజయారెడ్డికి ఎమ్మెల్యే పదవి దక్కితే అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎంతో కొంత ఊరట లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టు నిరూపించుకోవాలని చూస్తున్న బీజేపీ మాత్రం ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. బీఆర్ఎస్ కూడా తన సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.







