రసవత్తరంగా కల్వకుంట్ల కుటుంబ పోరు!
కల్వకుంట్ల కుటుంబంలో మొదలైన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ సమరంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్న కల్వకుంట్ల కవిత, ఏకంగా మాజీ మంత్రి హరీశ్ రావు కంచుకోటగా భావించే సిద్దిపేట గడ్డపై నుంచే సంచలన ఆరోపణలకు తెరలేపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు కీలక ప్రాజెక్టులు, నిర్ణయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు అటు గులాబీ శ్రేణుల్లోనూ, ఇటు అధికార కాంగ్రెస్ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
సిద్దిపేట పర్యటనలో భాగంగా కవిత నేరుగా హరీశ్ రావు, కేటీఆర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును భూకంప జోన్లో నిర్మించారని ఆరోపించిన ఆమె, ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 263.54 కోట్ల రికవరీకి విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా నిమ్స్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధుల మళ్లింపు, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు ప్రత్యేక కాలువ తవ్వకం వంటి అంశాలను ఆమె తెరపైకి తెచ్చారు. సొంత కుటుంబ సభ్యురాలే గత ప్రభుత్వ పనితీరుపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ శిబిరాన్ని ఆత్మరక్షణలో పడేసింది.
కవిత విమర్శలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి గట్టిగానే స్పందించారు. కవిత ప్రస్తావించిన సాంకేతిక అంశాలను తోసిపుచ్చుతూనే, ఆమె వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలం ఉందని బీఆర్ఎస్ ఆరోపించారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలు కవిత చేతికి ఎలా చిక్కాయని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 2010–2012 మధ్యకాలంలో ‘ఆడి కోర్ ఇన్ఫ్రా’ అనే సంస్థలో రేవంత్ రెడ్డి, కవిత, సూదిని సృజన్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని, ఒకే చిరునామాతో దాదాపు 30 కంపెనీలు స్థాపించారని ఆయన కొన్ని పత్రాలను చూపిస్తూ ఆరోపించారు. నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ముందుగా కవిత అక్కడికి వెళ్లి, అధికార పక్షం రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదివారని విమర్శిస్తూ ఆమె రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి
అయితే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను ‘తెలంగాణ రక్షణ సేన’ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. కవిత బయటపెట్టిన కాగ్ నివేదికలు, ఇతర పత్రాలన్నీ పబ్లిక్ డొమైన్లో ఎవరికైనా సులభంగా లభించేవేనని వారు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి వ్యాపారం కూడా చేయకుండానే మూతపడిన పాత కంపెనీ పేరును ప్రస్తావిస్తూ కవితకు రేవంత్ రెడ్డితో ముడిపెట్టడం కేవలం వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనని తిప్పికొట్టారు. గతంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో బీఆర్ఎస్ పాలనలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించిన ప్రవీణ్ కుమార్, నేడు గులాబీ కండువా కప్పుకుని హరీశ్ రావుకు మద్దతుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని కవిత వర్గం ఎద్దేవా చేసింది.
అధికార పార్టీని కాకుండా.. కవిత ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ను, అందులోనూ హరీశ్ రావు, కేటీఆర్‌లను మాత్రమే ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీసి, పార్టీ నుంచి బయటకు పంపడంలో వీరిద్దరి పాత్రే కీలకమని కవిత బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన ఓటు బ్యాంకు కలిగిన బీఆర్ఎస్ను బలహీనపరిస్తేనే, ఆ ప్రత్యామ్నాయ రాజకీయ శూన్యంలోకి తాను ఎదగగలనని ఆమె అంచనా వేస్తున్నారు.
మరోవైపు కల్వకుంట్ల కుటుంబంలో ఏర్పడిన ఈ చీలిక అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కలిసొచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం, ఇప్పుడు సొంత కుటుంబ సభ్యురాలు చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోవడానికే తన సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి వస్తోంది. ముఖ్యంగా నవంబర్ 19న సిద్దిపేటలో జరగనున్న సభలో హరీశ్ రావును టార్గెట్ చేయడానికి కవిత లేవనెత్తిన అంశాలే కాంగ్రెస్ నేతలకు బలమైన అస్త్రాలుగా మారే అవకాశం ఉంది.







