ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్..!?
తెలంగాణలో అత్యంత సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు కేవలం నిఘా విభాగం అధికారుల చుట్టూనే తిరిగిన సిట్ విచారణ, ఇప్పుడు గత ప్రభుత్వంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. సిట్ తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏ1గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ2 గా చేర్చే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. వీరితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కె.నవీన్ రావుల పాత్రపై కూడా అభియోగపత్రంలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ, మీడియా వర్గాల్లో వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పటివరకు ఈ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ టి. ప్రభాకర్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సహా ఆరుగురు పోలీసు అధికారుల ప్రమేయంపైనే దర్యాప్తు కేంద్రీకృతమైంది. అయితే, అంతటి స్థాయిలో నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఉన్నత స్థాయి రాజకీయ ఆదేశాలు లేకుండా సాధ్యం కాదనే కోణంలో సిట్ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా, సుమారు 618 మంది రాజకీయ ప్రత్యర్థులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్ నంబర్లను అక్రమంగా ట్యాప్ చేశారని, దాదాపు 2,500 సంభాషణలపై నిఘా ఉంచారని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరోవైపు సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తదితరులపై ఇటీవల నమోదైన కొత్త ఎఫ్ఐఆర్ ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలోనే తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశాన్ని 18 నెలల తర్వాత తిరిగి తెరపైకి తీసుకురావడం, కేసును హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బదిలీ చేసి కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలను అధికార కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమాత్రం లేదని అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. దర్యాప్తులో లభించిన సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగానే సిట్ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని వారు వాదిస్తున్నారు.
న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసే ఛార్జ్షీట్లోని ఆరోపణలు కేవలం ప్రాథమిక అభియోగాలు మాత్రమే. ఈ ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడాలంటే, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి రాజకీయ నేతల నుండి నేరుగా ఆదేశాలు వెళ్లాయనేందుకు బలమైన సాంకేతిక, డాక్యుమెంటరీ ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను సిట్ నిరూపించాల్సి ఉంటుంది. సిట్ తుది అదనపు ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేర్లు అధికారికంగా నమోదైతే, తెలంగాణ రాజకీయాలు ఒక కొత్త మలుపు తిరగడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ న్యాయస్థానాల్లోనే కాకుండా, ప్రజాక్షేత్రంలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ పోరాటానికి వేదిక కానుంది.







