మరో కొడంగల్‌గా అందోల్! త్వరలో 10-15 పరిశ్రమలు.. మంత్రి దామోదర సంచలన ప్రకటన
అందోల్: స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోని అందోల్ ప్రాంతానికి కొత్త వెలుగులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా ప్రకటించారు. అందోల్ మండలం సంగుపేటలోని శ్రీలక్ష్మీదేవి గార్డెన్స్‌లో నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అందోల్‌లో కనీసం 10 నుంచి 15 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని స్పష్టం చేశారు. తద్వారా ఈ ప్రాంతం నుంచి సంగారెడ్డి, హైదరాబాద్‌లకు వలసలు తగ్గుతాయని అందోల్-జోగిపేట పట్టణాల్లోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు..
పర్యాటక ప్రాంతాలుగా అందోల్, సింగూర్..
అందోల్, సింగూర్ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని, స్థానిక వనరులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు కలిసొచ్చేలా ప్రణాళికలు అమలు చేస్తామని ఆయన తెలిపారు.
ఇదే కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అందోల్-సంగుపేటలో 1141 సర్వేలోని ప్రభుత్వ భూమిలో రూ.60 కోట్లతో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. చౌటకూర్‌లో రూ.35 కోట్లతో గిరిజన న్యాయ(లా) కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందోల్‌లో నిర్మించిన నర్సింగ్ కళాశాలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, నైపుణ్యాలు పెంపొందించుకుని పోటీ ప్రపంచంలో ధైర్యంగా ముందుకు సాగాలని మంత్రి సూచించారు. స్థానికంగా విద్యా అవకాశాలు పెరిగితే గ్రామీణ యువతకు మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని ఆయన అన్నారు.
పింఛన్ల పంపిణీ…
ఈ కార్యక్రమంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ వివరాలను అధికారులు వెల్లడించారు. అందోల్ మండలం సంగుపేటలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి దామోదర రాజనర్సింహ పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 18,591, అందోల్ నియోజకవర్గంలో 3,130 పింఛన్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. జిల్లాలో కొత్త లబ్ధిదారులకు నెలకు రూ.4.24 కోట్ల పింఛన్ అందనుంది.
అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్పల్లి మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సామాజిక భద్రత అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు ఈ పింఛన్లు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు.
పేదల ఆహార భద్రత, గృహ వసతి, సామాజిక రక్షణను ప్రభుత్వం సమగ్ర దృష్టితో చూస్తోందని మంత్రి చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలకు సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు సుమారు 1000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.
సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, స్థలం లేని నిరుపేదలకూ ఇళ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మహిళా సంఘాలకు పెద్దఎత్తున బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, వడ్డీ చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని, హుమ్నాపూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రభుత్వం సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తోందని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,48,562 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ.32.73 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. తాజాగా మరో 18,591 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేయగా, వీరికి ప్రతి నెల రూ.4.24 కోట్ల పింఛన్ అందించనున్నట్లు తెలిపారు.
అందోల్ నియోజకవర్గంలో కొత్తగా 3,130 మందికి చేయూత పింఛన్లు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమానికి హాజరుకాలేక మంజూరు ప్రొసీడింగ్స్ పొందని లబ్ధిదారులు సంబంధిత మండల కార్యాలయాల్లో వాటిని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ తర్వాత లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ, బ్యాంక్ ఖాతాల అనుసంధానం వంటి ప్రక్రియలను సంబంధిత శాఖలు కొనసాగించనున్నాయి.







