పాక్ అమ్ములపొదిలో ఎఫ్ పీవీ డ్రోన్స్.. భారత్ అప్రమత్తం..!
ఆపరేషన్ సిందూర్‌తో తలబొప్పి కట్టిన పాక్.. ఇప్పుడు రక్షణ వ్యూహాలను మార్చుకుంటోంది. ముఖ్యంగా మిత్రదేశాలతో జట్టుకట్టి.. రక్షణ సామాగ్రి సమకూర్చుకుంటోంది.మిత్రదేశమైన తుర్కియే నుంచి ఏకంగా లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ (ఫస్ట్‌పర్సన్ వ్యూ) డ్రోన్ల కొనుగోలుకు మూడేళ్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. దీంతో పలు మానవరహిత మిలిటరీ వ్యవస్థలను పాకిస్థాన్ (Pakistan) ఏఆర్టీసీ కొనుగోలు చేయనుందని ఉలుసఉన్మా, డిఫెన్స్ బ్లాగ్లు పేర్కొన్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం పది ఆల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు, 25 డుమ్రుల్ మినీ హెలికాప్టర్లు, 500 డీఎల్ఈ లాయిటరింగ్ మ్యూనిషన్, 250 కోర్గాన్ గ్రౌండ్ వ్యవస్థలు పాకిస్థాన్‌కు చేరనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌లో వీటి తయారీ ఫ్యాక్టరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
పాక్ కొనుగోలు చేయనున్న మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల రేంజి 8 కిలోమీటర్లు. ఇవి గాల్లో 20 నుంచి 30 నిమిషాలు ప్రయాణించగలవు. దీనిలో అమర్చిన వార్ హెడ్లో విరజిమ్మేందుకు వీలుగా 1,000 వరకు 3 ఎంఎం స్టీల్ బాల్స్ ఉంటాయి. డ్రోన్ పేలిన తర్వాత 20 మీటర్ల రేడియస్‌లో విధ్వంసం సృష్టిస్తాయి.
ఇక అల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలను దాడులకు తీసుకెళ్లగలవు. దీనిలో దాడి చేయాల్సిన లక్ష్యం వంటివి ప్రోగ్రామ్ చేస్తే అది అటానమస్‌గా పనిచేస్తుంది. థర్మల్ విజన్ వ్యవస్థలు, నైట్ విజన్ టెక్నాలజీని దీనిలో వాడారు. ఇక డుమ్రుల్ వ్యవస్థను షార్ట్ రేంజి నిఘా, దాడి ఆపరేషన్లకు వినియోగిస్తారు. 120 నిమిషాలు ఇది గాల్లో ఉండగలదు. ఇప్పటికే పాక్-తుర్కియే కలిసి 5వ తరం ఫైటర్ జెట్లు తయారు చేయాలని నిర్ణయించాయి.
ఇవి కూడా చదవండి
యుద్ధాల్లో రీపర్లు, బైరక్తర్ల పేర్లు తరచూ వినిపించినా.. క్షేత్రస్థాయిలో కీలక దాడులకు ఎఫ్‌పీవీ డ్రోన్లనే అత్యధికంగా వాడుతున్నారు. ఎఫ్‌పీవీ అంటే ఫస్ట్‌పర్సన్ వ్యూ డ్రోన్లు. వీటి ముందు భాగంలో ఓ కెమెరా ఉంటుంది. ఇది చిత్రీకరించిన దృశ్యాలను ఆపరేటర్ ఎఫ్‌పీవీ గాగుల్స్ లేదా వీఆర్ఎక్స్ మానిటర్లు ధరించి.. యుద్ధరంగాన్ని నేరుగా చూస్తాడు. వారికి యుద్ధ రంగంలో ఉన్నట్లే అనిపిస్తుంది. పైలట్ చేతిలోని రిమోట్‌తో దీనిని నియంత్రిస్తూ టార్గెట్‌ను గుర్తించి.. నిర్ధరించి దాడి చేస్తారు. ఇక ఈ డ్రోన్ల మోటార్ల వేగంలో మార్పులు చేసుకుంటే.. అవసరమైనట్లు దీనిని కదలించవచ్చు. దీనిలో పెద్దగా సెన్సర్లు ఉండవు.. నియంత్రణ ఆపరేటర్ చేతిలో ఉంటుంది.
పైలట్లు నేరుగా యుద్ధ రంగంలోకి అడుగుపెట్టకుండా దాదాపు కనీసం 2 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నుంచి దీనిని అపరేట్ చేయవచ్చు. దీంతో మోర్టార్లు, కాల్పుల నుంచి ఆపరేటర్లు బయటపడొచ్చు. ఆపరేటర్ రహస్య బంకర్లో దాక్కొని యాంటెనాను బయటపెడితే చాలు.. మిగిలిపని రిమోట్‌గా జరిగిపోతుంది.
ఈ డ్రోన్ ధర 500 అమెరికన్ డాలర్ల (రూ.47,000) కంటే తక్కువగానే ఉంటుంది. చాలా చౌకగా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. ఈ డ్రోన్ విడిభాగాలు సివిలియన్ మార్కెట్లో తేలిగ్గా లభిస్తాయి. కొన్ని రకాల ఎఫ్‌పీవీ డ్రోన్లు జామింగ్‌ను తట్టుకునేలా అతిపల్చటి వైర్లను కూడా వాడుతున్నారు.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో వినియోగించిన డ్రోన్ల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఒక్కటే మిలియన్ల కొద్దీ ఉత్పత్తి చేస్తోంది. 2025లో దాని సైన్యానికి 30 లక్షల డ్రోన్లు ఇచ్చింది. ప్రస్తుతం ఈ యుద్ధంలో రోజువారీ దాడుల్లో దాదాపు 60శాతం వీటి ద్వారానే జరుగుతున్నట్లు సమాచారం.







