ముంబై కుర్రాడు.. బ్రిటన్‌లో 70 మంది అమ్మాయిలకు వల.. చివరకు 30 ఏళ్ల జైలు శిక్ష!
బయటకు చూస్తే అతడు ఓ సాధారణ విద్యార్థి. ముంబై నుంచి బ్రిటన్ వెళ్లి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేస్తున్న 27 ఏళ్ల యువకుడు. కానీ సోషల్ మీడియా వెనుక అతడి అసలు రూపం వేరేలా ఉంది. చిన్న వయసున్న బాలికలను టార్గెట్ చేయడం, నకిలీ గుర్తింపుతో వారితో పరిచయం పెంచుకోవడం, ప్రేమ పేరుతో వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంపించుకునేలా చేయడం.. ఆ తర్వాత వాటినే అడ్డం పెట్టుకుని బెదిరించడం. ఇలా కనీసం 70 మంది బాలికలను వేధించిన భారత సంతతి యువకుడికి బ్రిటన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
14 ఏళ్ల అబ్బాయిగా పరిచయం.. ప్రేమ పేరుతో వల
ముంబైకి చెందిన బిలాల్ కాజీ (27) బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్‌లో చదువుకునేవాడు. అయితే ఆన్లైన్లో మాత్రం తన అసలు గుర్తింపును దాచిపెట్టి ‘రీజ్’ (Reece) అనే పేరుతో 14 ఏళ్ల బ్రిటిష్ బాలుడిగా పరిచయం చేసుకునేవాడు. ఇందుకోసం మరో బాలుడి ఫొటోను కూడా ఉపయోగించేవాడు. స్నాప్‌చాట్, వింక్, రోబ్లాక్స్ వంటి యాప్‌ల ద్వారా 10 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలతో పరిచయాలు పెంచుకునేవాడు.
మొదట స్నేహం.. ఆ తర్వాత ప్రేమ పేరుతో దగ్గరవడం.. క్రమంగా వారిని తన మాట వినేలా చేసుకోవడం అతడి పద్ధతి. తమ మధ్య ఉన్నది ప్రేమేనని నమ్మించి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పంపాలని ఒత్తిడి చేసేవాడు. ఒక్కసారి వారు అతడి మాట నమ్మి ఫొటోలు పంపిన తర్వాత అసలు వేధింపులు మొదలయ్యేవి.
ప్రేమించుకుంటే ఇవన్నీ సహజమేనంటూ ఒత్తిడి
బాలికలు తమ వ్యక్తిగత ఫొటోలు పంపడానికి ఇష్టపడకపోతే కాజీ వారిని మానసికంగా ఒత్తిడికి గురిచేసేవాడు. ‘ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఇలాంటివి సహజమే’ అంటూ నమ్మించడానికి ప్రయత్నించేవాడు. అయినా ఎవరైనా నిరాకరిస్తే, అప్పటికే పంపిన ఫొటోలను బయటపెడతానని బెదిరించేవాడు.
కొన్ని సందర్భాల్లో బాలికలకు తెలియకుండా వారి వ్యక్తిగత కంటెంట్‌ను రికార్డు చేయడం, సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం కూడా చేసేవాడు. ఆ తర్వాత వారి స్నేహితులకు ఆ ఫొటోలు పంపడం, సోషల్ మీడియాలో ప్రచురించడం ద్వారా మరింత భయభ్రాంతులకు గురిచేసేవాడు. ఒక బాలిక తనకు ఇబ్బందిగా ఉందని, ఇకపై అలాంటి ఫొటోలు పంపించలేనని చెప్పినప్పటికీ, తన దగ్గర ఇప్పటికే పంపిన ఫొటోలకు సంబంధించిన రహస్య బ్యాకప్ ఉందని కాజీ హెచ్చరించినట్లు కోర్టులో వెల్లడైంది.
బాధితుల జీవితాలపై తీవ్ర ప్రభావం
ఈ ఘటనల్లో బాధితులుగా మారిన బాలికలు ఎదుర్కొన్న మానసిక వేదనను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కొందరు ఆందోళన, మానసిక సమస్యలతో బాధపడగా, మరికొందరిలో తినే అలవాట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. కొందరు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది.
13 ఏళ్ల వయసులో కాజీ నుంచి వేధింపులు ఎదుర్కొన్న ఓ బాలిక తన అనుభవాన్ని కోర్టుకు వివరించింది. అతడు తన అమాయకత్వాన్ని దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మరో బాధితురాలు మాట్లాడుతూ, ఈ ఘటనల వల్ల తన వ్యక్తిగత గోప్యత, భద్రతపై ఉన్న నమ్మకం పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పింది. ఆ సంఘటనలు ముగిసిపోయినా వాటి ప్రభావం ఇప్పటికీ తన రోజువారీ జీవితాన్ని వెంటాడుతోందని వివరించింది.
2021లో మొదలైన దర్యాప్తు.. విమానాశ్రయంలో అరెస్ట్
ఈ కేసులో దర్యాప్తు 2021లో మొదలైంది. ఓ బాధితురాలు ముందుకు వచ్చి డెర్బీషైర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. 2022 మేలో ఈ దర్యాప్తును చెషైర్ పోలీసులకు అప్పగించారు. ప్రారంభ దర్యాప్తులోనే సుమారు 180 మంది సంభావ్య బాధితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
అప్పటికే కాజీ చెస్టర్‌ను, యూనివర్సిటీని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అయితే 2023 జూలై 21న తిరిగి బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు హీత్రో విమానాశ్రయానికి వచ్చిన సమయంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ 2026 జూలై వరకు కొనసాగింది.
ఇవి కూడా చదవండి
30 ఏళ్ల జైలు శిక్ష.. జీవితాంతం లైంగిక నేరస్థుల జాబితాలో!
చెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా కాజీపై మొత్తం 39 నేరాలకు సంబంధించి అభియోగాలు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్యకర చిత్రాలను రూపొందించడం, బ్లాక్మెయిల్ చేయడం, పిల్లలను లైంగిక చర్యలకు ప్రేరేపించడం వంటి నేరాలతో సహా 37 అభియోగాలను అతడు అంగీకరించాడు. మిగిలిన రెండు అభియోగాలను తదుపరి విచారణ కోసం పెండింగ్‌లో ఉంచారు.
దీంతో కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెరోల్‌కు అర్హత పొందాలంటే కనీసం 20 ఏళ్లు జైలులో గడపాల్సి ఉంటుంది. అంతేకాదు, అతడి పేరును జీవితాంతం లైంగిక నేరస్థుల రిజిస్టర్లో ఉంచాలని ఆదేశించింది. పెరోల్‌పై విడుదలైనప్పటికీ మరో ఎనిమిదేళ్ల పాటు కఠినమైన నిబంధనలతో పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది.
సోషల్ మీడియాలో ఒక చిన్న పరిచయం ఎక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితుల్లో, పిల్లల ఆన్లైన్ భద్రత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. స్క్రీన్ అవతల కనిపించే వ్యక్తి చెప్పే పేరు, పంపించే ఫొటో నిజమైనవేనని నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ కేసు స్పష్టం చేస్తోంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల







