అన్నమయ్య సంకీర్తనలతో అలరించిన అష్టకాల శారద
అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఈ శనివారం అన్నమయ్యపురంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహించగా మధ్యాహ్నం అన్నదానం – సాయంత్రం అన్నమ స్వరార్చ న కార్యక్రమం భక్తిశ్రద్ధలతో సాగింది.
సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని శిష్యురాలు అష్టకాల శారద అన్నమ స్వరార్చనలో భాగంగా “జై జై గణపతి”, “తాళ్లపాక అన్నమాచార్య”, “గోవిందాశ్రిత”, “చిరుత నవ్వులవాడు”, “ద్వారకా తిరుమల గోవిందుడు”, “వినవమ్మ యశోద”, “రావమ్మ వరలక్ష్మి”, “మనసా మందిర”, “అంబా భవాని శారదే”, “ఉన్నది ఒక్కడే శివుడేగా”, “సప్తగిరివాసనే”, “హే దక్షిణామూర్తి”, “ఎంత చక్కనిదానవమ్మ” తదితర భక్తిగీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా కీబోర్డ్‌పై శ్రీనివాస్, తబలాపై అజయ్ సహకరించారు.
అనంతరం పద్మశ్రీ డా. శోభారాజు గారు అన్నమయ్య సంకీర్తనకు భావార్థ వివరణ అందించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేశారు. తదుపరి శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామివారికి హారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.
అన్నమయ్య సంకీర్తనలను సంగీతం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ యువ కళాకారులను ప్రోత్సహిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని కార్యక్రమంలో భక్తులు, సంగీతాభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.







