అన్నవరం గిరి ప్రదక్షిణ గీతం ఆవిష్కరణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఈరోజు జరిగినఒక విశేష కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకులు, సప్తవిధ గజల్ చక్రవర్తి డా. గజల్ శ్రీనివాస్ శ్రీ సత్యనారాయణ స్వామి వారి గిరిప్రదక్షిణ విశిష్టతను తెలియజేస్తూ, స్వయంగా తానే రచన చేసి, సంగీతం సమకూర్చి ఆలపించిన ఒక అద్భుతమైన భక్తి గీతాన్ని స్వామి వారికి అంకితం చేస్తూ రికార్డు చేసిన.నూతన గీతాన్ని అన్నవరం దేవస్థానం వైదిక కమిటీ ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) నల్లం సూర్యచక్రధరరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీ నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ, సత్యదేవునిపై అపారమైన భక్తితో రానున్న కార్తిక పౌర్ణమి నవంబర్ 24 నాడు లక్షలాది మంది భక్తులు పాల్గొనే అన్నవరం గిరి ప్రదక్షిణ గీతం రచించి, స్వీయ సంగీతంలో గానం చేసి స్వామి వారికి అందించిన డా. గజల్ శ్రీనివాస్‌కి దేవస్థానం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. భక్తులకు స్వామి వారి గిరిప్రదక్షిణ విశిష్టతను ఈ గజల్ మరింత చేరువ చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. డా.గజల్ శ్రీనివాస్ సమక్షంలో గీత ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు చిట్టి శివరామ శర్మ, వేదన సూర్యనారాయణ శర్మ , చామర్తి కన్నబాబు , పాలంకి పట్టాభి రామ్మూర్తి ,నాగభట్ల రవి శర్మ , పర్యవేక్షణ అధికారి రమేష్ అర్చకులు, పురోహితులు , ఇతర అధికారులు పాల్గొని గీత ఆవిష్కరణను విజయవంతం చేశారు.








