అద్దెకు మనవళ్లు: భారత్‌లో ఊపందుకుంటున్న విచిత్రమైన బిజినెస్!!!
ఒకప్పుడు ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ ఉంటే మనవళ్లతోనే కాలక్షేపం జరిగిపోయేది. వాళ్లకు ఏదైనా కావాలంటే పిల్లలు దగ్గరుండి చూసుకునేవారు. గుడికి వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా మనవళ్లు తోడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
పిల్లలు చదువులు, ఉద్యోగాల కోసం అమెరికా, కెనడా, యూరప్ అంటూ విదేశాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ వాళ్ల జీవితాలు బాగానే సాగుతున్నా.. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు మాత్రం ఒక లోటు వెంటాడుతోంది. మాట్లాడటానికి ఫోన్లో పిల్లలు ఉన్నారు కానీ, పక్కన కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడానికి మనిషి ఉండటం లేదు.
డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోగలరు. అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోగలరు. కానీ ఒంటరితనాన్ని మాత్రం అలా కొనుక్కుని పోగొట్టుకోలేరు కదా! ఈ సమస్యకే కొన్ని కంపెనీలు ఇప్పుడు ఒక కొత్త పరిష్కారం చూపిస్తున్నాయి. ఏకంగా మనవళ్లనే అద్దెకు ఇస్తున్నాయి.
వినడానికి వింతగా ఉన్నా, గంటల లెక్కన డబ్బులు తీసుకుంటూ వృద్ధులకు తోడుగా ఉండే ఈ వ్యాపారం భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. మరి ఈ అద్దె మనవళ్లు ఇంటికొచ్చి ఏం చేస్తారు? నిజంగానే సొంత మనవళ్లలా చూసుకుంటారా? ఈ వ్యాపారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
అమెరికాలో ఇద్దరు కూతుళ్లు.. ఇక్కడ అద్దె మనవడే తోడు!
గురుగ్రామ్‌కు చెందిన ఓ పెద్దాయన వయసు 80 ఏళ్లు దాటింది. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికాలో నివసిస్తున్నారు. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరూ బయటకు వెళ్లాలన్నా, మార్కెట్లో ఏదైనా పని చూసుకోవాలన్నా తోడు అవసరమవుతోంది.
అలాంటి సమయంలో వాళ్ల వెంట ఉండేది 26 ఏళ్ల కుర్రాడు. అతడు ఆ వృద్ధ దంపతులకు అద్దె మనవడు. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆ కుర్రాడు, గత కొన్ని నెలలుగా వారి దగ్గర పనిచేస్తున్నాడు. అయితే ఇది కేవలం డబ్బులు తీసుకుని చేసే ఉద్యోగంలా మిగిలిపోలేదు. ఆ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయాడు.
అనిల్‌కు శస్త్రచికిత్స జరిగినప్పుడు ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించడం, మందుల వివరాలు తెలుసుకోవడం దగ్గర నుంచి డ్యూటీ ముగిసిన తర్వాత కూడా ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడగడం వరకు అన్నీ చూసుకున్నాడు. దీంతో ఆ వృద్ధ దంపతులకు ఆ కుర్రాడిపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది.
అతడిని ఒక ఉద్యోగిగా కాకుండా తమకు మరో కొడుకులా భావిస్తున్నారు. ఆ కుర్రాడు కూడా వాళ్లను తన కుటుంబ సభ్యులుగానే చూస్తున్నాడు. ఇలా మొదలైన పరిచయం క్రమంగా ఒక ఆత్మీయ బంధంగా మారిపోయింది.
గంటకు రూ.400.. రూ.450! మనవడి సేవలకు ఇంత ధరా?
ఈ సేవలను అందిస్తున్న గురుగ్రామ్‌కు చెందిన కంపెనీ అధినేత గౌరవ్ మిట్టల్ చెబుతున్న వివరాల ప్రకారం, చాలామంది వృద్ధులు తమ దగ్గరకు వచ్చే యువతను కొద్దిరోజుల్లోనే సొంత మనవళ్లలా భావించడం మొదలుపెడుతున్నారు.
ఈ సేవలకు కూడా మొబైల్ రీఛార్జ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి. నెలకు 10 గంటల సేవలు కావాలంటే గంటకు రూ.450 చెల్లించాలి. 25 గంటల ప్యాకేజీ తీసుకుంటే గంటకు రూ.400 అవుతుంది.
ఒక నెలలో ఉపయోగించుకోలేని గంటలను తర్వాతి నెలకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అంటే అవసరాన్ని బట్టి మనవడి సేవలను కూడా ప్లాన్ చేసుకోవచ్చన్నమాట!
అయితే ఈ సేవలు ప్రస్తుతం ప్రధానంగా ఆర్థికంగా స్థిరపడిన పట్టణ కుటుంబాలకే అందుబాటులో ఉన్నాయి. మిట్టల్‌కు ఈ ఆలోచన రావడానికి కూడా తన కుటుంబంలో ఎదురైన అనుభవమే కారణం.
సొంత అనుభవమే వ్యాపారమైంది
తండ్రి మరణించిన తర్వాత ఆయన తల్లి సొంత ఊరిని వదిలి కుమారుడి దగ్గరకు రావాల్సి వచ్చింది. ఆమెకు డబ్బుకు కొదవ లేదు. ఇతరులతో కలిసిమెలిసి ఉండే స్వభావం కూడా ఉంది. కానీ ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వచ్చేది.
వృద్ధులకు అన్ని సౌకర్యాలు ఉన్నా, బయటకు తీసుకెళ్లే మనిషి లేకపోతే వాళ్ల జీవితం ఎంత పరిమితమైపోతుందో అప్పుడే ఆయనకు అర్థమైంది.
వృద్ధులకు కావాల్సింది మందులు కాదు.. మనసు విప్పి మాట్లాడే మనిషి!
వృద్ధుల సంరక్షణ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి మందులు, ఆసుపత్రులు, ఆహారం, ఇతర అవసరాలు. కానీ చాలామంది వృద్ధులను ఎక్కువగా బాధించేది అనారోగ్యం కంటే ఒంటరితనం.
హైదరాబాద్‌లో కంపానియన్‌గా పనిచేస్తున్న వినయ్ కుమార్‌కు ఎదురైన అనుభవాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కొంతమంది వృద్ధులు తమ పిల్లలకు చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలను కూడా అతడితో పంచుకుంటుంటారు.
పిల్లలు ఇతర నగరాల్లో లేదా విదేశాల్లో ఉండటంతో తమ గురించి ఆందోళన చెందకూడదని కొన్ని విషయాలను దాచిపెడుతుంటారు. అలాంటప్పుడు తమ దగ్గరకు వచ్చే కంపానియన్‌తో మాత్రం మనసు విప్పి మాట్లాడతారు.
వినయ్‌కు ఒక వృద్ధుడితో ఎదురైన అనుభవం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో అతడికి ఇంగ్లీష్, హిందీ రాదని ఆ వృద్ధుడు ఇంట్లోకి కూడా రానివ్వలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది.
చివరకు వినయ్‌కు డ్రైవింగ్ నేర్చుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇతరులకు తన దేవుడిచ్చిన కొడుకుగా పరిచయం చేసేవాడు. 2023లో ఆ వృద్ధుడు మరణించినప్పుడు, ఆయన కుమారుడు వినయ్‌ను కూడా అంత్యక్రియల్లో పాల్గొనాలని కోరాడు.
మొదట్లో ఒక సేవ కోసం మొదలైన పరిచయం చివరకు రక్తసంబంధం లేకపోయినా కుటుంబ బంధంగా మారిపోయింది. వినయ్ తన క్లయింట్లను సొంత తల్లిదండ్రులు, తాతయ్యలుగానే భావిస్తానని చెబుతున్నాడు.
ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేస్తారు.. కానీ అసలు కావాల్సింది కంపెనీ!
బెంగళూరుకు చెందిన సీనియర్ కేర్ సంస్థ అధినేత సంతోష్ అబ్రహం చెప్పిన అనుభవం ఈ వ్యాపారంలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. కొంతమంది వృద్ధులు ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేస్తుంటారు. వెంటనే కేర్ మేనేజర్ ఇంటికి వెళ్లి చూస్తే ఎలాంటి సమస్య కనిపించదు.
మందులు అవసరం ఉండదు. వైద్యుడిని పిలవాల్సిన పరిస్థితి కూడా ఉండదు. కానీ ఆ తర్వాత వాళ్లు కోరేది మాత్రం ఒక్కటే.. కాసేపు పక్కన కూర్చొని మాట్లాడమని! అంటే వాళ్లకు కావాల్సింది వైద్యం కంటే తమ మాటలు వినే మనిషి అన్నమాట.
కొందరికి పేకాట ఆడేవారు కావాలి. మరికొందరికి సినిమాకు వెళ్లే సహచరుడు కావాలి. ఇంకొందరు గుడికి, పార్కులకు, స్థానిక కార్యక్రమాలకు వెళ్లాలనుకుంటారు. బయటకు వెళ్లే అవకాశం లేక ఇంట్లోనే ఉండిపోయేవారికి ఇలాంటి చిన్న చిన్న సరదాలే పెద్ద ఆనందాన్ని ఇస్తాయి.
కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్ని సంకోచాలు ఉంటాయి. తమ సమస్యలు చెబితే పిల్లలు బాధపడతారేమోనని అనుకుంటారు. కానీ ఒక అపరిచితుడితో తమ మనసులోని విషయాలను స్వేచ్ఛగా చెప్పుకోగలుగుతారు.
అందుకే ఈ సేవల్లో కేవలం పనులు చేయడం కంటే, వృద్ధులతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రంగంలో పనిచేసే సంస్థలు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. కంపానియన్లు వృద్ధులకు తోడుగా ఉండాలి కానీ వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల స్థానాన్ని భర్తీ చేయకూడదు.
4. 7 బిలియన్ డాలర్ల మార్కెట్… సెన్సేషనల్ బిజినెస్
ఈ వ్యాపారం వెనుక కేవలం ఒంటరితనం మాత్రమే లేదు. భారత్‌లో వేగంగా మారుతున్న జనాభా స్వరూపం కూడా ఉంది.
యూఎన్ఎఫ్పీఏ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ విడుదల చేసిన ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం, 2022లో దేశ జనాభాలో 60 ఏళ్లు దాటినవారి వాటా 10.5 శాతంగా ఉంది. 2050 నాటికి అది దాదాపు 21 శాతానికి చేరుతుందని అంచనా.
అంటే అప్పటికి సుమారు 34.7 కోట్ల మంది వృద్ధులు భారత్‌లో ఉంటారు. ఈ సంఖ్యను చూస్తే భవిష్యత్తులో వృద్ధుల సంరక్షణ ఎంత పెద్ద అవసరంగా మారబోతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇంతమంది వృద్ధులకు కేవలం వైద్య సదుపాయాలు కల్పిస్తే సరిపోదు. వాళ్ల రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న అవసరాలను కూడా గుర్తించాలి. అందుకే సీనియర్ కేర్ పరిశ్రమపై ఆసక్తి పెరుగుతోంది. భారత ప్రభుత్వం ఈ రంగం విలువను సుమారు 7 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది.
ఇప్పటికే కొన్ని స్టార్టప్‌లు ఈ రంగంలో సేవలు అందిస్తున్నాయి. 2022లో రతన్ టాటా కూడా ముంబైకి చెందిన ఒక స్టార్టప్‌ను ప్రోత్సహించారు. ఆ సంస్థ నినాదం ‘Everything Grandkids Do!’ అంటే మనవళ్లు చేసే పనులన్నీ తాము చేస్తామన్నమాట.
ఈ రంగంలో పనిచేసే యువతకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే వృద్ధుల దగ్గరకు పంపిస్తున్నారు. చాలామంది సైకాలజీ, సోషల్ వర్క్, హాస్పిటాలిటీ రంగాల్లో శిక్షణ పొందినవారే.
పిల్లలకు బాధ్యత తగ్గుతుందా? లేక వృద్ధులకు కొత్త తోడు దొరుకుతుందా?
అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వినయ్ కె అనే వ్యక్తి తన తల్లికి ఐదేళ్లుగా కంపానియన్ సేవలను అందిస్తున్నారు. ఈ సేవలకు డబ్బులు చెల్లించడం వల్ల ఒక ఇబ్బంది తప్పుతుందని ఆయన అంటున్నారు.
పొరుగువారినో, బంధువులనో ప్రతిసారీ సహాయం అడిగినప్పుడు ఏదో ఉపకారం కోరుతున్నామనే భావన ఉంటుంది. కానీ ఒక సేవకు డబ్బులు చెల్లించినప్పుడు ఆ సంకోచం ఉండదని చెబుతున్నారు. అంటే పిల్లలు దగ్గర లేకపోయినా తల్లిదండ్రులకు అవసరమైన సమయంలో ఒకరు అందుబాటులో ఉంటారన్న నమ్మకం వారికి కలుగుతోంది.
అయితే వృద్ధుల కోసం ఇలాంటి సేవలను తీసుకోవడాన్ని పిల్లలు తమ బాధ్యతను వదిలేసినట్లుగా చూడకూడదని జిందాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శిల్పా బెనర్జీ అభిప్రాయపడుతున్నారు.
కుటుంబ సభ్యులు ఎంత ప్రేమ చూపించినా, వృద్ధులకు నిరంతరం ఒకరి తోడు అవసరమవుతుంది. ఆ అవసరాన్ని గుర్తించి కుటుంబాలు, స్థానిక సమాజం, ప్రొఫెషనల్ సేవలు కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని ఆమె చెబుతున్నారు.
పిల్లలు విదేశాల్లో ఉన్నంత మాత్రాన తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని చెప్పలేం. అదే సమయంలో డబ్బులు పంపించడం, ఫోన్ చేయడం మాత్రమే వాళ్లకు కావాల్సిన తోడును పూర్తిగా భర్తీ చేయలేవు.
ఈ కొత్త వ్యాపారం వెనుక ఉన్న అసలు విషయం
వృద్ధులకు ఖరీదైన బహుమతులు, పెద్ద ఇళ్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నంత మాత్రాన జీవితం సంతోషంగా మారిపోదు. వాళ్లు చెప్పే పాత కథలను విసుగు లేకుండా వినేవారు కావాలి. బయటకు వెళ్లాలంటే చేయి పట్టుకునేవారు ఉండాలి. పండుగ రోజున పక్కన కూర్చొని కాసేపు నవ్వించేవారు కావాలి.
ఒకప్పుడు ఇవన్నీ కుటుంబంలో సహజంగా దొరికేవి. ఇప్పుడు వాటి కోసం కూడా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. పిల్లలు విదేశాల్లో స్థిరపడటం ఒకవైపు, తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా మిగిలిపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య పుట్టుకొస్తున్నదే అద్దె మనవళ్ల వ్యాపారం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







