రేవంత్ ప్రజాబలం., విమర్శనాస్త్రాల అంతరార్థం ఏంటి?
తెలంగాణ రాజకీయాలు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక భారాన్ని మోస్తూనే, మరోవైపు జాతీయ, ప్రాంతీయ ప్రత్యర్థులను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్లలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, రాబోయే సార్వత్రిక, స్థానిక పోరాటాలకు సమరశంఖం పూరించినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని కేసీఆర్ ఇద్దరినీ ఒకే గాటన కడుతూ “ప్రజాబలంతో తుఫానులా విరుచుకుపడి ఇద్దరినీ తుడిచిపెడతాం” అని హెచ్చరించడం రేవంత్ దూకుడును చాటుతోంది.
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధానాలను సంఖ్యలతో సహా నిలదీశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంపై ఏకంగా రూ.8.11 లక్షల కోట్ల రుణభారాన్ని మోపారని రేవంత్ ఆరోపించారు. ఆ తప్పుడు నిర్ణయాలు, రుణాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఏటా రూ.80,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని గుర్తుచేశారు. గడిచిన 34 నెలల కాలంలోనే రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులను కేవలం గత ప్రభుత్వ అప్పులు, బకాయిలు తీర్చడానికే వెచ్చించాల్సి వచ్చిందని గణాంకాలతో స్పష్టం చేశారు. ఆర్థిక వాస్తవాలపై అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికలపై చర్చకు రావాలని సవాల్ విసిరితే కేసీఆర్ తప్పించుకుని ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై రేవంత్ తనదైన శైలిలో వాగ్బాణాలు సంధించారు. కేసీఆర్ తింటే ‘బకాసురుడు’, పడుకుంటే ‘కుంభకర్ణుడు’ అని ఎద్దేవా చేస్తూ, ప్రజలకు జవాబుదారీతనం లేకుండా ఫామ్‌హౌస్ పాలన సాగించారని విమర్శించారు. అలాగే 50 ఏళ్లు వచ్చినా కేటీఆర్‌కు ఇంకా పరిపక్వత రాలేదని ఎద్దేవా చేస్తూ, రేవంత్ రెడ్డిలా నిలబడాలంటే అపారమైన ధైర్యం, ప్రజా మద్దతు అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రతికూల రాజకీయ శక్తులను ప్రకృతి విపత్తైన ‘ఎల్ నినో’తో పోల్చిన సీఎం, వీటన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఘాటు విమర్శల నడుమ కొడంగల్ సమగ్ర అభివృద్ధిపై సీఎం స్పష్టమైన హామీలు ఇచ్చారు. రూ.9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి కొడంగల్‌ను అత్యున్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడిన ఆయన, పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా శపథం చేస్తూ డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను కొడంగల్ గడ్డపైకి తెచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
రాబోయే సంక్రాంతి తర్వాత ‘ప్రజా బలం’ పేరుతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించడం ద్వారా క్షేత్రస్థాయి సమీకరణాలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని స్పష్టమైంది. రాష్ట్ర ఖజానాపై ఉన్న భారాన్ని ప్రజలకు వివరిస్తూనే, ప్రాజెక్టుల నిర్మాణం, భారీ అభివృద్ధి నిధుల కేటాయింపు ద్వారా ప్రజల్లో పట్టు నిలుపుకోవాలన్నదే రేవంత్ వ్యూహం. మోదీ, కేసీఆర్‌లపై ఏకకాలంలో ద్విముఖ పోరు సాగిస్తూ, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామన్న రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను రాబోయే రోజుల్లో మరింత వేడెక్కించనున్నాయి.







