శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం దీపావళి ఆస్థానం (Deepavali Asthanam) శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ మలయప్పస్వామివారు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్ద గరుడాళ్వారు సన్నిధిలో ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కర్పూర మంగళహారతులు, ప్రసాద నివేదనలు సమర్పించారు. అనంతరం మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలను సమర్పించి, రూపాయి హారతి, ప్రత్యేక హారతులు నిర్వహించడంతో దీపావళి ఆస్థానం ముగిసింది. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి(Pedda Jeeyar Swamy), చిన్న జీయర్ స్వామి (Chinna Jeeyar Swamy), శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, సీవీఎస్వో మురళీకృష్ణ (Muralikrishna), ఇతర అధికారులు పాల్గొన్నారు.







