పీఆర్సీ జాప్యం.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సెగ!?
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం.. ముఖ్యంగా రెండో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమలుపై నెలకొన్న ప్రతిష్టంభన ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. తమ చిరకాల డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా, స్వయంగా ప్రచారం చేసి గుణపాఠం చెబుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ప్రస్తుతం మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, అలాగే వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని ఆరు జిల్లాల్లో కలిపి సుమారు నాలుగు లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ సిబ్బంది గ్రాడ్యుయేట్లుగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పట్టభద్రుల స్థానాల్లో ఫలితాలను తారుమారు చేయగల సంఖ్యాబలం వీరికి ఉండటంతో, ఉద్యోగ వర్గాల అసహనం నేరుగా ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఏర్పడింది.
నవంబర్ 6న నాంపల్లిలోని టీజీవో భవన్లో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్పర్సన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. మూడేళ్లకు పైగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా జూలై 1, 2023 నుంచి వర్తించేలా 51శాతం ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ నివేదికను తక్షణమే విడుదల చేసి అమలు చేయాలని జేఏసీ పట్టుబడుతోంది. గతంలో జూన్ 2 నాటికి కమిషన్ నుంచి నివేదిక తెప్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని నేతలు గుర్తుచేశారు. అలాగే ఉద్యోగులకు రావాల్సిన వివిధ బిల్లుల బకాయిలు ప్రస్తుతం రూ. 10,000 కోట్ల మార్కును దాటాయి. వీటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న మొత్తాన్ని ప్రస్తుత రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు.. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ అంశాన్ని పరిశీలించేందుకు సంయుక్త కమిటీ వేస్తామని, పీఆర్సీ నివేదిక తెప్పిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కార్యాచరణ శూన్యమని మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను జేఏసీ స్వాగతించినప్పటికీ, అది కాగితాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ వర్తింపజేయాలని, నెట్వర్క్ ఆసుపత్రులు తప్పనిసరిగా నగదు రహిత సేవలు అందించేలా కఠిన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
జేఏసీ అగ్రనాయకత్వం ప్రభుత్వంతో సంప్రదింపులకు ఇంకా మొగ్గు చూపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను దాటవేస్తున్నారన్న ఆగ్రహం వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండుగ ముగియగానే ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని జేఏసీ నిర్ణయించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ సమీపిస్తున్న వేళ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన కాలపరిమితితో కూడిన హామీ రాకపోతే పోరుబాట తప్పదని ఉద్యోగ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పెండింగ్ బిల్లుల విడుదల, 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం త్వరితగతిన అడుగులు వేయకపోతే, గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆగ్రహం అధికార పార్టీకి రాజకీయంగా భారీ నష్టాన్ని చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







