గంభీర్ ప్రయోగంపై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్..!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మల(Rohith Sharma) వికెట్లు కోల్పోయి 39/3తో తీవ్ర ఒత్తిడిలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో పక్కా మిడిలార్డర్ బ్యాటర్ కె.ఎల్. రాహుల్ కంటే ముందుగా అక్షర్ పటేల్‌ను ఐదో నంబర్లో బ్యాటింగ్‌కు పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్ చేసిన ఈ ప్రయోగం ఘోరంగా ఫెయిల్ అయింది.
అక్షర్ పటేల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడంతో భారత్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో కూరుకుపోయింది. గంభీర్ చేసిన ఈ ‘లెఫ్ట్-రైట్ కాంబినేషన్’ ప్రయోగంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్పై టీమిండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం భిన్నంగా స్పందించారు. గంభీర్, గిల్ల నిర్ణయాన్ని పూర్తిగా వెనకేసుకొస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పొలిటికల్ మైండ్ గేమ్‌ను సమర్థిస్తూ.. ఆ ప్లానింగ్‌లో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పారు.
ఒక రైట్ హ్యాండర్ ఆడుతున్నప్పుడు హఠాత్తుగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారని గవాస్కర్ విశ్లేషించారు. ఆ కన్ఫ్యూజన్లో బౌలర్లు తప్పులు చేసే అవకాశం ఉంటుందని, దానివల్ల రన్స్ రాబట్టడం సులువవుతుందని అసలు లాజిక్‌ను బయటపెట్టారు. ఈ ప్రయోగం వెనుక ఉన్న థాట్ ప్రాసెస్ చాలా కరెక్ట్ అని, ఒకవేళ అక్షర్ పటేల్ ఈ మ్యాచ్‌లో రన్స్ చేసి ఉంటే అందరూ కెప్టెన్సీని ఆకాశానికి ఎత్తేసేవారని గవాస్కర్ గుర్తుచేశారు.
క్రికెట్లో ఇలాంటి స్ట్రాటజీలు కొన్నిసార్లు వర్కవుట్ అవుతాయని, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయని, ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తూ వర్కవుట్ కాలేదని చెప్పారు. అంతేకాకుండా అక్షర్ తర్వాత కె.ఎల్. రాహుల్ లాంటి క్లాస్ అండ్ సాలిడ్ బ్యాటర్ ఉన్నాడనే నమ్మకంతోనే మేనేజ్మెంట్ ఇలాంటి ధైర్యమైన ప్రయోగాలు చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ క్యాంపెయిన్‌లోనూ అక్షర్‌ను ఇలాగే ప్రమోట్ చేసి సక్సెస్ సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా క్రికెట్ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.







