పారిశ్రామిక అభివృద్ధికి అనువైన ప్రదేశం కొడంగల్ : సీఎం రేవంత్ రెడ్డి
పారిశ్రామిక అభివృద్ధికి అనువైన ప్రదేశం కొడంగల్ : RARE ఇండస్ట్రియల్ హబ్ లో పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు..
– గొప్ప పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడం నా బాధ్యత, కల
– 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తాం
– ఈ ప్రాంతంలో భావితరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల తోపాటు విద్యాసంస్థల ఏర్పాటు కోసం RARE ఎడ్యుకేషన్ హబ్
కొడంగల్: కొడంగల్ రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్) ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధితో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2027 డిసెంబర్ కల్లా శంషాబాద్ నుండి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ నిర్మాణం పూర్తవుతుందని, విమానాశ్రయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఇండస్ట్రియల్ హబ్ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా దాదాపు వంద మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. కొడంగల్ పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ విమానాశ్రయ ప్రాంతం, ఇతర పారిశ్రామిక క్లస్టర్లకు చెందిన ఏరోస్పేస్, రక్షణ రంగం, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, టెక్స్ టైల్, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహా, వివిధ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
రేర్ ఇండస్ట్రీయల్ హబ్ తోపాటు NARI ( Networkof Apparel RReadiness & Infrastructure ) పార్క్, THRIVE హబ్ , RISE ( Regional Industries & Small Emterprises) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దడం తన బాధ్యత మాత్రమే కాకుండా, తన కల అని తెలిపారు. “కొడంగల్ తోనే నా గుర్తింపు, ఆత్మ గౌరవం.”
ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో అనువైన ప్రాంతమని, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ హబ్ లో నిర్మాణాలు చేపడుతుండడం, మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు పరిశ్రమల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల తోపాటు విద్యాసంస్థల ఏర్పాటు కోసం 250 ఎకరాల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ రూపుదిద్దుకుంటున్నారు.
రేడియల్ రోడ్ నిర్మాణంతో కేవలం 70 నిమిషాల్లో కొడంగల్ చేరుకునే అవకాశం ఉంటుందని, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టే ముందు మొదటిగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరంలో ఉందో చూస్తారని వివరించారు. రానున్న కాలంలో చందన్ వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు గొప్ప పారిశ్రామిక అభివృద్ధికి నోచుకుంటాయని చెప్పారు.
కొడంగల్ అన్ని రకాలుగా అభివృద్ధికి అనువైన వ్యూహాత్మక ప్రాంతమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు తక్కువ దూరంలో ఉండడం విశేషమని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల వనరులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకోసం అధికారులు నిత్యం సహకరించడానికి అందుబాటులో ఉంటారన్నారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు జరుగుతుందని, టాటా టెక్నాలజీస్ సంస్థ సహకారంతో విద్యార్థులకు శిక్షణ అందుతుందన్నారు. అదే విధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కోర్సులు అందించవచ్చని వివరించారు.







